తల్లిదండ్రుల పెంపకం మీద ఆధారపడే పిల్లల వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. పిల్లలు ధైర్యంగా ఉన్నా, పిరికిగా ఉన్నా, ఆత్మవిశ్వాసంతో ఉన్నా లేక ఆత్మవిశ్వాసం తక్కువస్థాయిలో ఉన్నా.. పిల్లల్లో ఏ విధమైన లక్షణాలు కనిపించినా.. దానికి కారణం తల్లిదండ్రులే. చిన్నతనంలో పిల్లలకు ఏది నేర్పించినా ఇట్టే నేర్చుకుంటారు. అవే వారి మనసుల్లో నాటుకుపోతాయి. ఈ అనుభవాలే వయసు పెరిగే కొద్దీ వారి వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయి.
కొంతమంది పిల్లల్లో ప్రతిభ ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసం లోపించడం మనం చూస్తూనే ఉంటాం. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. అందుకే పిల్లల పెంపకం అంత ఈజీ విషయం ఏమీ కాదు. పిల్లల పెంపకంలో ప్రతీ తల్లీదండ్రులు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఇది పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేస్తాయి.
పిల్లల్ని ఎప్పుడూ ఎగతాళి చేయకూడదు. ఈ మాత్రం చేయలేకపోతున్నావా.. అనే మాట.. అది చిన్నదే కానీ వారిని బాగా బాధిస్తుంది. ఉదాహరణకు, మంచంమీది నుంచి దూకడం, ఫుట్‌బాల్ తన్నడం వంటి ఆలోచనలు మనకు చిన్నవిగా ఉండవచ్చు, కానీ పిల్లలకి ఈ విషయాలు చాలా పెద్దవి, ముఖ్యమైనవి. కాబట్టి పిల్లలు వాటిని ట్రై చేస్తుంటే.. ఎగతాళి చేయకూడదు. ఇది వారు ఏమీ ట్రై చేయకుండా చేస్తుంది.
పోలికలు వద్దు : పిల్లలు ఎవరికి వారే ప్రత్యేకం. ఒడ్డు, పొడవు, అలవాట్లు, అభిరుచులు, అందం.. ఇవన్నీ ఒకరికి మరొకరికి పోలిక ఉండదు. కానీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, తల్లిదండ్రులు ఇతరులతో పోల్చి మాట్లాడతారు. మీ పిల్లల ఆసక్తులను ఇతరుల అభిరుచులతో పోల్చడం సరైంది కాదు, కాబట్టి మీ బిడ్డకు చదవడానికి ఆసక్తి లేనట్లయితే బాధపడకండి. వారి ఇష్టాలు, ఆసక్తులు వారికి తగ్గట్టుగా ఏర్పరచుకోనివ్వండి. అంతేకానీ అవి ఉన్న పిల్లలతో వారిని పోల్చకూడదు. పోల్చడం వల్ల పిల్లల్తో ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏర్పడుతుంది.
తప్పులు వెతక్కండి : పిల్లలు తప్పులు చేయడం సహజం. కానీ వారి ప్రతీ పనిలో తప్పులు వెతకడం పిల్లల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. బాల్యంలో ఏ పనినైనా సంపూర్తిగా చేయడం అసాధ్యం. అందుకే పిల్లలు చేసే పనిలో తప్పులు వెతకడానికి బదులుగా, కనుగొనడానికి వారి ప్రయత్నాన్ని, పనిని ప్రోత్సహించండి. ఉదాహరణకు, పిల్లలు పెయింటింగ్ చేస్తుంటే, వారి పెయింటింగ్‌లో లోపాలు కనిపెట్టడం కాకుండా.. పెయింటింగ్‌లోని మంచి విషయాలను అభినందించండి.
ఇతరులకు ఫిర్యాదు : చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల గురించి ఇతర వ్యక్తులకు లేదా పొరుగువారికి ఫిర్యాదు చేస్తారు. కొన్నిసార్లు తల్లిదండ్రులు సరదాగానో, లేదా గాసిప్ కోసమో దీనిని చేస్తారు. కానీ ఈ విషయాలు పిల్లల మనస్సులో ముద్ర పడిపోతాయి. దీంతో వారిలో ఆత్మవిశ్వాసం తగ్గడం ప్రారంభమవుతుంది.
చిన్న విషయాలకే చేయి చేసుకోవడం : చిన్నతనంలో చేసే ఏ తప్పు అంత ప్రమాదకరం కాదు. కాబట్టి, చిన్న చిన్న వాటికే కొట్టడం సరికాదు. దీనికి బదులుగా, వారి తప్పు వారు అర్థం చేసుకునేలా చేయాలి.
దిద్దుకోలేని తప్పు చేస్తున్నారన్నప్పుడు కొట్టడం పర్వాలేదు. కానీ చిన్న చిన్న విషయాలకే చేయి చేసుకోవడం మిమ్మల్ని కూడా గిల్టీ ఫీలింగ్ లో పడేస్తుంది. వారి మీద మీ ప్రేమ తగ్గుతుంది. అదే సమయంలో, వారిలో అభద్రతా భావం పెరుగుతుంది. వారితో భయం మొదలవుతుంది.