ఈ గ్రామంలో ఎవరూ తమ ఇంట్లో ఆహారం వండరు? ఎందుకో తెలుసా?

First Published Sep 25, 2024, 4:19 PM IST

No one in this Indian village cooks food at home : కడుపు నిండాలంటే రెండు పూటలా భోజనం చేయాలి. ఇందుకోసం ఇంట్లో  భోజనం వండుకోవాలి. అయితే, మ‌నం ఇప్పుడు తెలుసుకోబోయే గ్రామంలోని ఏ ఒక్క ఇంట్లో వంట‌లు చేసుకోరు. భారతదేశంలోనే ఈ గ్రామం కథ చాలా ఆసక్తికరంగా ఉండటంతో పాటు ఎంతో స్ఫూర్తిని నింపుతూ ఆద‌ర్శంగా నిల‌స్తోంది. ఆ ఆసక్తికర వివ‌రాలు మీకోసం. 
 

Indian village, Chandanki, Gujarat,

In this Indian village, no one cooks food at home : మ‌నిషి జీవించ‌డానికి ఆహారం తీసుకుకోవ‌డం ముఖ్యం. మ‌రీ ముఖ్యంగా మారుతున్న, ఉరుకుల ప‌రుగుల జీవితంలో అనేక అనారోగ్య ప‌రిస్థితుల‌ను ఎత్తిచూపుతూ వైద్యులు ఇంట్లో వండిన ఆహారాన్ని తినమని సలహా ఇస్తున్నారు. కానీ ఈ గ్రామంలో మాత్రం ఏ ఒక్క‌ ఇంట్లో వంట చేయరు. అది ఎక్క‌డో విదేశాల్లో లేదు. మ‌న దేశంలోనే గుజ‌రాత్ లో ఉంది. అస‌లు ఇక్క‌డ వంట ఎందుకు చేయ‌రు?  మ‌రి వారి భోజ‌నం సంగ‌తేంటి?
 

గుజరాత్‌లోని చందన్‌కీ అనే గ్రామం గురించి గత కొంతకాలంగా నిత్యం వార్త‌లు వ‌స్తున్నాయి. సోష‌ల్ మీడియాలో కూడా ఇదే గ్రామం హాట్ ట్రెండింగ్ గా మారింది. దీని వెనుక అస‌లు కార‌ణం ఏమిటంటే ఈ గ్రామంలోనే ఏ ఇంట్లో కూడా పొయ్యి వెల‌గ‌దు.. వంట చేసుకోరు. ఈ ప్ర‌త్యేక చందన్‌కీ  గుజ‌రాత్ లోని మహేసనా జిల్లా బెచరాజీ తాలూకాలో ఉన్న ఒక గ్రామం. 2011 జనాభా లెక్కల ప్రకారం చందన్‌కీ గుజరాత్‌లోని ఒక చిన్న గ్రామంగా ఉంది. ఇక్క‌డ జనాభా దాదాపు 250 మందికి పైగా ఉంటున్నారు. ఇందులో 117 మంది పురుషులు, 133 మంది స్త్రీలు ఉన్నారు. కొన్ని మీడియా నివేదికల ప్రకారం ఇప్పుడు ఈ జ‌నాభా వేయి వ‌ర‌కు చేరింద‌ని స‌మాచారం. ప్ర‌స్తుత జ‌నాభా గ‌ణాంకాలు గ‌మ‌నిస్తే గ్రామంలో 500 మంది పౌరులు మాత్రమే ఉంటున్నారు. మిగ‌తా  వారు వేరే ప్రాంతాల్లో ప‌నిచేస్తూ అక్క‌డే ఉంటున్నారు. గ్రామంలో ఉన్న‌వారిలో ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లు. 
  

Latest Videos


చందన్‌కీ గ్రామంలో నివసించే ఏవ‌రూ కూడా త‌మ ఇండ్ల‌ల‌లో వంట చేసుకోరు. అయితే, వీరి ఆహరం కోసం ఇక్కడి ప్రజలందరికీ కమ్యూనిటీ హాల్ ఉంది. ఇందులో రోజుకు రెండుసార్లు భోజనం పెడతారు. ఇక్క‌డ గ్రామంలోని అంద‌రూ క‌లిసి భోజ‌నం చేస్తారు. 

ఈ కమ్యూనిటీ హాల్‌లో రెండు పూటల భోజనం వడ్డిస్తారు. దీని కోసం ఒక్కొక్కరికి నెల‌కు 2000 రూపాయలు డిపాజిట్ చేస్తారు. ఇక్కడ సాంప్రదాయ గుజరాతీ ఆహారాన్ని అందిస్తారు. ప్రత్యేక శ్రద్ధ తో రుచి, నాణ్యతలో చాలా బాగుంటుంది ఆహారం. 

చందన్‌కీ గ్రామ సర్పంచ్ పూనంబహాయి పటేల్ ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు. 20 ఏళ్లు న్యూయార్క్‌లో పనిచేసిన పటేల్ తన స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. ఈ క్ర‌మంలోనే త‌న ఊర్లోని ప‌రిస్థితులు గ‌మ‌నిస్తుండ‌గా, ఎక్కువ మంది వృద్ధులు క‌నిపించారు. దీనికి ప్ర‌ధాన కారణం  యువత ఉద్యోగాల కోసం నగరానికి వలస వెళ్లారు.

దీని వ‌ల్ల గ్రామంలో నివాస‌ముంటున్న‌ వృద్ధులు ఎక్కువగా ఉండడంతో వారు రోజువారీ పనులకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప‌నుల కోసం న‌గ‌రానికి వ‌ల‌స వెళ్లిన యువ‌త వారి కుటుంబ పోష‌ణ‌కు డ‌బ్బులు పంపేవారు కానీ, వృద్దులు త‌మ ప‌నులు చేసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్న ప‌రిస్థితులు క‌నిపించాయి. 

కుటుంబ వ్యవస్థలో మార్పుల‌తో చాలా మంది వృద్ధులు గ్రామంలో ఒంటరిగా ఉంటున్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని పూనాంబాయి పటేల్ చందన్‌కీ గ్రామంలో అందరు ఒక కుటుంబంలా క‌లిసి ఉండేలా ప్లాన్ చేశారు. దీని కోసం గ్రామంలో  కమ్యూనిటీ భోజ‌న‌ హాల్‌ను ప్రారంభించారు. ఇక్క‌డ‌ కలిసి భోజనం ఏర్పాటు చేయడం ప్రారంభించారు. ఒక్కొక్క‌రుగా ఇందులో చేరుతూ క్రమంగా ఈ సంప్రదాయం మొదలైంది.

చందన్‌కీ  గ్రామంలోని ఏ ఇంట్లో కూడా ఇప్పుడు ఆహారం వండుకోరు. కమ్యూనిటీ హాల్‌లో నే అంద‌రూ క‌లిసి భోజ‌నం చేస్తారు. తమ పిల్లలు, కుటుంబ  సభ్యులు తమ వద్ద లేకపోయినా ఆ ఊరంతా ఇప్పుడు ఒక కుటుంబంలా సంతోషంగా జీవిస్తోంది. చందన్‌కీ  గ్రామంలోని ఈ సంప్రదాయాన్ని చూసేందుకు నేడు దేశ, విదేశాల నుంచి చాలా మంది ఇక్క‌డ‌కు వ‌స్తున్నారు.

click me!