కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్ ఏర్పడటం ఈ రోజుల్లో సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. కానీ ఇది చూడటానికి అస్సలు బాగుండదు. ఏదో జబ్బు చేసిన వారిలా కనిపిస్తారు. అలాగే ముఖం అలసటగా, నీరసంగా, ముసలివాళ్లలాగా కనిపిస్తారు. నిజానికి కళ్ల చుట్టూ నల్లగా కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. నిద్రలేమి, ఒత్తిడి, స్క్రీన్ ను ఎక్కువగా చూడటం వంటి చాలా కారణాలు ఉన్నాయి. అయితే కొన్ని అనారోగ్య సమస్యల వల్ల కూడా కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
డార్క్ సర్కిల్స్ రావడానికి సాధారణ కారణాలు
నిద్రలేమి: చాలా మందికి నిద్రలేమి సమస్య ఉంటుంది. అయితే ఈ సమస్య వల్ల కూడా కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి. ఈ నిద్రలేమి వల్ల కళ్ల చుట్టూ ఉన్న చర్మం పలుచగా మారుతుంది. దీంతో రక్తనాళాలు ఎక్కువగా కనిపిస్తాయి. మీకు తెలుసా? మన వయస్సు పెరిగే కొద్దీ చర్మం బలహీనంగా మారుతుంది. అలాగే కొల్లాజెన్ కూడా తగ్గుతుంది. దీనివల్ల డార్క్ సర్కిల్స్ వస్తాయి.
జెనెటిక్స్: కొంతమందికి జెనెటిక్స్ వల్ల కూడా డార్క్ సర్కిల్స్ వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
అలెర్జీ ప్రతిచర్యలు: అలెర్జీ ప్రతిచర్య వల్ల కూడా కళ్ల చుట్టూ ఉన్న చర్మం నల్లబడుతుంది.
డీహైడ్రేషన్: మన శరీరంలో నీళ్లు లేకపోవడం వల్ల మన చర్మం పొడిబారుతుంది. అలాగే కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి.
ఎండ: ఎండవల్ల కూడా డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి. నిపుణుల ప్రకారం.. సూర్యకిరణాల వల్ల మన చర్మంలో మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల కళ్ల చుట్టూ ఉన్న చర్మం నల్లగా అవుతుంది.
ఒత్తిడి - ఒత్తిడి శారీరక, మానసిక సమస్యలను కలిగిస్తుంది. ఇది మీ శరీరంలో ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోన్ లెవెల్స్ ను పెంచుతుంది. మీ చర్మాన్ని దెబ్బతీస్తుంది.
పోషకాల లోపం: శరీరంలో పోషకాలు లోపిస్తే కూడా కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి.
ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఎక్కువగా ఉపయోగించడం: ఫోన్, కంప్యూటర్ ను ఎక్కువ ఉపయోగించడం వల్ల కళ్లపై ఒత్తిడి బాగా పడుతుంది. దీనివల్ల కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి.
డార్క్ సర్కిల్స్ వెనుక ఉన్న అనారోగ్య కారణాలు
రక్తహీనత: ఐరన్ లోపం వల్ల రక్తహీనత సమస్య వస్తుంది. ఈ సమస్య వల్ల మన చర్మం పసుపు రంగులోకి మారుతుంది. అలాగే కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి.
మూత్రపిండాల సమస్యలు: ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మూత్రపిండాల వ్యాధుల వల్ల కూడా డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి. ఎందుకంటే ఈ సమస్య వల్ల శరీరంలో ద్రవం పేరుకుపోయి కళ్ల చుట్టూ వాపు వస్తుంది. డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి.
థైరాయిడ్ సమస్యలు: థైరాయిడ్ గ్రంథి సమస్యలు ఉంటే కూడా కళ్ల చుట్టూ ఉన్న చర్మం నల్లబడుతుందని నిపుణులు చెబుతున్నారు.
అలెర్జీలు: కొంతమందికి దుమ్ము, ధూళి, పుప్పొడి,లేదా జంతువుల బొచ్చుకు అలెర్జీ ఉంటుంది. ఇలాంటి వారికి కళ్ల చుట్టూ నల్లబడటం, వాపు వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి.
సైనసైటిస్: సైనసైటిస్ సమస్య ఉన్నవారికి కళ్ల చుట్టూ ఒత్తిడి ఎక్కువగా కలుగుతుంది. దీనివల్ల డార్క్ సర్కిల్స్ వస్తాయి.
డార్క్ సర్కిల్స్ తగ్గాలంటే ఏం చేయాలి?
డార్క్ సర్కిల్స్ తగ్గాలంటే ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర పోవాలి. అలాగే నీళ్లను పుష్కలంగా తాగాలి. అప్పుడే శరీరం హైడ్రేట్ గా ఉండి డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి. అలాగే పండ్లు, కూరగాయలు,ఆకుకూరలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను రోజూ తినాలి. ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ ను ఖచ్చితంగా రాసుకోవాలి. అలాగే కంప్యూటర్లు లేదా మొబైల్ ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం మానేయాలి. కళ్లపై కోల్డ్ కంప్రెస్ లను వాడితే కంటి వాపు తగ్గుతుంది.