మన దేశ ప్రధానులు కూడా క్షమాపణలు చెప్పారు. ఏ సందర్భాల్లో తెలుసా

First Published | Aug 30, 2024, 10:40 PM IST

మహారాష్ట్రలో శివాజీ మహారాజ్ విగ్రహం ఆవిష్కరణ తర్వాత ఇటీవల కూలిపోయింది. ఈ సంఘటనపై దుమారం రేగడంతో ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణలు చెప్పారు. ప్రధాని పదవిలో ఉండగా క్షమాపణలు చెప్పినవారు చరిత్రలో ఇంకా ఉన్నారు. వారు ఏ సందర్భాల్లో క్షమాపణలు చెప్పారో మీరు తెలుసా. అలాంటి ప్రధానుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

విగ్రహం కూలిపోవడంపై మోడీ క్షమాపణ

మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో 30 ఆగస్టు 2024న శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోవడంపై ప్రధాని మోడీ మరాఠా ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఈ ఘటనతో చాలామంది బాధపడ్డారని ప్రధాని అన్నారు. ‘‘ఇక్కడికి వచ్చిన వెంటనే శివాజీ విగ్రహం కూలిపోవడంపై క్షమాపణలు కోరుతున్నాను. ఈ ఘటనతో బాధపడిన ప్రజలను కూడా క్షమాపణలు కోరుతున్నాను. శివాజీ మహారాజ్‌ను తమ దైవంగా భావించే వారికి తీవ్ర బాధ కలిగిందని, వారికి నేను క్షమాపణలు చెబుతున్నాను. మన విలువలు భిన్నమైనవి. మన దేవుళ్ల కంటే గొప్పది మరొకటి లేదు. మనకు శివాజీ మహారాజ్ కేవలం రాజు మాత్రమే కాదు. ఆయన మనకు పూజనీయుడు. నేను ఈరోజు శివాజీ మహారాజ్‌కు నమస్కరిస్తూ క్షమాపణలు కోరుతున్నాను.’’ అని ప్రధాని అన్నారు.

1984 సిక్కు వ్యతిరేక అల్లర్లపై క్షమాపణ

1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో వందలాది మంది సిక్కులు హత్యకు గురయ్యారు. వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. వారి ఇళ్లు, వ్యాపారాలను ధ్వంసం చేశారు. 1984 అక్టోబర్ 31న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తన సిక్కు అంగరక్షకుల చేత హత్యకు గురైన తర్వాత సిక్కు వ్యతిరేక అల్లర్లు చెలరేగాయి. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులపై హింసను రెచ్చగొట్టారని,  అరికట్టడంలో విఫలమయ్యారని ఆరోపణలు వచ్చాయి.

12 ఆగస్టు 2005న అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈ అల్లర్లకు క్షమాపణలు చెప్పారు. అల్లర్లను దర్యాప్తు చేసి, అనేక మంది కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసిన నానావతి కమిషన్ నివేదికను సమర్పించిన తర్వాత మన్మోహన్ సింగ్ క్షమాపణలు చెప్పారు. తన ప్రసంగంలో డాక్టర్ సింగ్ మాట్లాడుతూ సిక్కు సమాజం అనుభవించిన బాధలకు క్షమాపణలు చెప్పడానికి నేను వెనుకాడనని, ఇలా జరిగినందుకు తాను సిగ్గుపడుతున్నానని అన్నారు. తన పౌరులను రక్షించడంలో రాష్ట్రం విఫలమైందని ఆయన అంగీకరించారు. ప్రాణ, ఆస్తి నష్టాలపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.


గుజరాత్ అల్లర్లపై వాజ్‌పేయ్ విచారం

2002లో గుజరాత్ అల్లర్లు జరిగాయి. ఈ మత ఘర్షణల్లో 1,000 మందికి పైగా మరణించారు. 59 మంది హిందూ యాత్రికులు ప్రయాణిస్తున్న గోధ్రా రైలును తగులబెట్టిన ఘటన తర్వాత ఈ అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్ల నేపథ్యంలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ ఏప్రిల్ 4, 2002న గుజరాత్‌లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. అప్పటి ప్రధాని వాజ్‌పేయ్ అల్లర్ల బాధిత ప్రాంతాలను సందర్శించి, హింసపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గుజరాత్‌లో జరిగిన ఘటన దేశానికే అవమానకరని ఆయన ఒక ప్రకటనలో అన్నారు. ప్రభుత్వంతో సహా అందరూ సెక్యులరిజం, న్యాయం సూత్రాలను పాటించాలని ఆయన నొక్కి చెప్పారు. హింసకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

పీవీ క్షమాపణలు, విచారం

పి.వి. నరసింహారావు 1991 నుండి 1996 వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. డిసెంబర్ 6, 1992న అయోధ్యలోని బాబ్రీ మసీదును ఒక అల్లరి మూక కూల్చివేసింది, దీని ఫలితంగా దేశవ్యాప్తంగా మత ఘర్షణలు చెలరేగాయి. వీటిని అరికట్టడానికి సరైన చర్యలు తీసుకోవడంలో వైఫల్యం అయ్యారని ఆయన విమర్శలను ఎదుర్కొన్నారు. ఈ ఘటనపై నరసింహారావు మసీదును రక్షించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని, ప్రాణ, ఆస్తి నష్టాలను అంగీకరించారు.

జవహర్‌లాల్ నెహ్రూ క్షమాపణలు, విచారం

దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కూడా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. స్వతంత్ర భారతంలో కాశ్మీర్ సంక్షోభం, స్వతంత్ర సమయంలో జరిగిన అల్లర్లు, భాషా ప్రాతిపదికన జరిగిన అల్లర్లపై విచారం వ్యక్తం చేశారు. 1947-48లో కాశ్మీర్ సంక్షోభం సందర్భంగా జరిగిన హింసాకాండలో ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాయి. ఆ హింసపై ఆయన విచారం వ్యక్తం చేశారు. 1947లో భారత్, పాకిస్తాన్ విభజన తర్వాత పెద్ద ఎత్తున మత ఘర్షణలు చెలరేగడంతో భారీగా ప్రాణనష్టం జరిగింది. విభజన అల్లర్లపై నెహ్రూ తీవ్ర విచారం, బాధ వ్యక్తం చేశారు. దీనివల్ల లక్షలాది మంది భారతీయులు బాధలు, కష్టాలకు గురయ్యారని ఆయన వాపోయారు. 

Latest Videos

click me!