
Ganesh Chaturthi 2022: ఈ ఏడాది వినాయక చవితి ఆగస్టు 31న వచ్చింది. ఇక ఈ రోజు నుంచి పది రోజుల పాటు వినాయకుడు సకల పూజలు అందుకుంటాడు. ఈ పండుగ హిందువులకు ఎంతో పవిత్రమైంది. ఇక పండగ మొదలైనప్పటి నుంచి నిమజ్జనం వరకు భక్తులంతా వినాయకుడి పూజలో మునిగిపోతారు. గణేషుడు, విఘ్నేషుడు, ఏకదంతుడు అంటూ గణప్పయ్యను ఎన్నో పేర్లతో పిలుస్తారు. కానీ ఈ భగవంతుడి శరీర భాగాలను చూసి మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. అవి తెలుసుకుంటే మన జీవితం సన్మార్గంలో వెళుతుంది. గణపతి బప్పా శరీర భాగం అర్థాన్ని తెలుసుకుందాం పదండి.
పెద్ద పెద్ద చెవులు
ఏ దేవుడికి గణపతికి ఉన్నట్టు పెద్ద పెద్ద చెవులు ఉండవు. ఈ చెవులను చూసి మనం నేర్చుకోవాల్సింది.. మంచి శ్రోతగా ఉండాలని. అంటే ప్రతి ఒక్కరూ చెప్పిన షయాలను శ్రద్ధగా వినాలని అర్థం. వాటిని స్వీకరించి.. వాటిలో మంచేది.. చెడేది అన్న విషయాలను గ్రహించగలగాలి. వాటిలో చెడు వాటిని వదిలేసి..మంచిని ఆచరించాలని ఈ పెద్ద పెద్ద చెవులు చెప్తాయి.
గణేషుని నుదురు
గణపయ్య నుదురు చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ నుదురు జ్ఞానానికి చిహ్నంగా భావిస్తారు. అంటే ప్రతి పనిని తెలివితేటలతో చేయాలి. అప్పుడే నువ్వు అనుకున్న పనిలో విజయం సాధిస్తావు. అలాగే అడ్డంకిగా ఉన్న సమస్య నుంచి బయటపడగలుగుతావు.
గణేషుని కడుపు
గణపయ్య పెద్ద కడుపును కలిగి ఉండాలి. ఇది ఆనందానికి చిహ్నంగా పరిగణిస్తారు. పెద్ద పొట్ట మంచి విషయాలను, చెడు విషయాలను బాగా అర్థం చేసుకోవాన్ని చూపిస్తుంది. అంటే మంచి విషయం ఏదైతే ఉందో దాన్ని తేలికగా జీర్ణం చేసుకోండి. ప్రతి నిర్ణయాన్ని తెలివిగా తీసుకోండి. అప్పుడే మీ జీవితం సన్మార్గంలో వెలుతుంది.
తొండం
ఏకదంతుని పెద్దని తొండం ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది. దీని అర్థం మనం ఎప్పుడూ చురుగ్గా, హుషారుగా ఉండాలని. ఎందుకంటే జీవితం చురుకుగా ఉండకపోతే విజయం సాధించలేం.
కళ్లు
గణేషుని కళ్లు దూరదృష్టికి చిహ్నం. ప్రతి సందర్భాన్ని, ప్రతి పనిని దూరదృష్టితో చూడాలని గణపయ్య కళ్లు తెలియజేస్తాయి. అందుకే మనం ప్రతిదాన్ని లోతుగా తెలుసుకోవాలి.
ఏకదంతం
పరశురాముడికి, గణపతికి జరిగిన యుద్దంలో పరశురాముడు తన గండ్ర గొడ్డలితో గణేషుడి పంటిని నరుకుతాడు. ఆ పంటితోనే గణేషుడు మహాభారతం మొత్తాన్ని రచించాడు. ప్రతిదాన్ని సరిగ్గా ఉపయోగించాలని ఈ ఏకదంతం మనకు బోధిస్తుంది. అంటే ఏది పనికి రాదని దేన్ని విసిరేయకూడదు.. అది మనకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది.
గణేషుడి ఆయుదం
పురాణాల ప్రకారం.. గణేషుడి ఆయుదం గొడ్డలి. ఇది గణేషుడిని అన్ని సంకెళ్ల నుంచి విముక్తి పొందడానికి సహాయపడుతుంది. అదే విధంగా మనిషి కోరుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదు. దురాశలను, అడ్డూ అదుపులేని కోరికలను, చెడులను తొలగించుకోవచ్చు.
గణేషుడి వాహనం
ఎలుకే గణేషుడి వాహనం. ఈ ఎలుకమీదే గణేషుడు ముల్లోకాలను చుట్టొస్తాడు. దీని అర్థం గణేషుడి శరీరం కంటే చిన్నదైన ఎలుక గణేషుడిని మోస్తుంది. అలాగే మనం ఎంత పెద్దవారిమైనా మన ఆలోచనలను, ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. అప్పుడే ఆర్థికంగా బాగుంటాం.