మీరు అలెర్ట్‌గా లేకపోతే డిజిటల్ అరెస్ట్ అవుతారు. ఈ మోసం నుంచి ఇలా తప్పించుకోండి

First Published | Nov 16, 2024, 11:20 AM IST

డిజిటల్ అరెస్ట్ పేరుతో ఈ మధ్య కొత్త రకం మోసాలు జరుగుతున్నాయి. వీటి బారిన పడి చాలా మంది కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. మోసగాళ్ళు ప్రభుత్వ అధికారుల్లా నటించి మీ డబ్బు కొల్లగొడతారు. అప్రమత్తంగా లేకపోతే మీరు కూడా డిజిటల్ అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. డిజిటల్ అరెస్ట్ మోసం నుంచి తప్పించుకోవడానికి సూచనలు, సలహాలు ఇక్కడ తెలుసుకుందాం. 

మోసగాళ్ళు ప్రభుత్వ అధికారుల్లా నటించి ప్రజలను మోసం చేస్తున్నారు. ఇది తెలియక ఫోన్ చేసింది అధికారులే అనుకొని జనం వారు అడిగిన సమాచారం మొత్తం ఇచ్చేస్తున్నారు. దీంతో క్షణాల్లో మన బ్యాంకు అకౌంట్లలో ఉన్న డబ్బులు దొంగిలించేస్తున్నారు. ఇలాంటి మోసాలు పెరిగిపోవడంతో ప్రధాని మోడీ కూడా ప్రజలను హెచ్చరించారు. ఇలాంటి భయపెట్టే కాల్స్ వస్తే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయమని చెప్పారు. CERT-In కూడా ఈ మోసం గురించి వివరించింది.

డిజిటల్ అరెస్ట్ మోసం అంటే ఏమిటి?

డిజిటల్ అరెస్ట్ మోసం ఒక రకమైన ఆన్‌లైన్ మోసం. మోసగాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బును దోచుకుంటారు. బాధితులను భయపెట్టి, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డారని ఫేక్ ఆరోపణలు చేస్తారు. మీకు శిక్ష పడకుండా ఉండాలంటే వెంటనే డబ్బు పంపమని బెదిరిస్తారు. ఉన్నతాధికారులు డబ్బులు అడుగుతున్నారని గంటలో అడిగినంత డబ్బు ఇవ్వకపోతే నేరుగా వచ్చి అరెస్టు చేస్తమని భయపెడతారు. 

డిజిటల్ అరెస్ట్ మోసం ఎలా చేస్తారు.

మోసగాళ్ళు CBI, ఆదాయపు పన్ను, కస్టమ్స్ అధికారుల్లా నటిస్తారు. ముందుగా ఫోన్ కాల్స్ చేస్తారు. తర్వాత మిమ్మల్ని నమ్మించడానికి WhatsApp, Skype వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా వీడియో కాల్‌ చేస్తారు.  మీరు ఆర్థిక మోసానికి పాల్పడ్డారని, టాక్స్ కట్టకుండా క్రైమ్ చేశారని ఆరోపణలు చేసి డిజిటల్ అరెస్ట్ వారెంట్ ఉందని బెదిరిస్తారు. కొన్నిసార్లు నమ్మించడానికి పోలీస్ స్టేషన్ లాంటి సెట్టింగ్ కూడా ఏర్పాటు చేస్తారు.

Latest Videos


డిజిటల్ అరెస్ట్ మోసాన్ని ఎలా అడ్డుకోవాలి?

నిర్దిష్ట బ్యాంక్ ఖాతాలు లేదా UPI IDలకు పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ చేయమని బలవంతం చేస్తారు. చెల్లించిన తర్వాత మోసగాళ్ళు మాయమై పోతారు. వాళ్లు చేసిన ఫోన్లు పనిచేయవు. ఇలాంటి మోసాల్లో డబ్బు పోవడమే కాకుండా వ్యక్తిగత సమాచారం కూడా దొంగిలించే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి మోసాల నుండి రక్షించుకోవడానికి ముఖ్యమైన మార్గం అప్రమత్తంగా ఉండటమే. 

పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వొద్దు

తాను ప్రభుత్వ అధికారినని, మీరు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పే ఫోన్ కాల్ వస్తే నమ్మకండి. మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. నిజమైన చట్ట సంస్థలు ఎప్పుడూ డబ్బు, బ్యాంక్ వివరాలు అడగవు. కాల్ చేసిన వ్యక్తి గురించి మీకు సందేహం ఉంటే సంబంధిత సంస్థను నేరుగా సంప్రదించి చెక్ చేసుకోండి. బెదిరించడానికి ప్రయత్నిస్తే భయపడకుండా ప్రశాంతంగా ఉండండి. వ్యక్తిగత సమాచారం ముఖ్యంగా బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్ నెంబర్ వంటివి ఎవరితోనూ పంచుకోకండి.

సైబర్ క్రైమ్ కు కంప్లయింట్ చేయండి

ప్రభుత్వ సంస్థలు అధికారిక సమాచార మార్పిడికి WhatsApp లేదా Skype వంటి వేదికలను ఉపయోగించవని గుర్తుంచుకోండి. మీరు మోసపోతున్నారని అనుకుంటే వెంటనే స్థానిక పోలీసులు లేదా సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేయండి.

మీరు డిజిటల్ అరెస్ట్ మోసానికి గురైతే ముందుగా మీ బ్యాంకుకు ఫిర్యాదు చేసి ఖాతాను బ్లాక్ చేయించండి. జాతీయ సైబర్ క్రైమ్ ఫిర్యాదుల కోసం cybercrime.gov.in వెబ్‌సైట్‌లో కంప్లయింట్ చేయండి. మోసానికి సంబంధించిన ఆధారాలను భద్రపరుచుకోండి. కాల్స్, లావాదేవీలు, సందేశాల వివరాలను సేవ్ చేసుకోండి. అవసరమైతే లాయర్ సహాయం తీసుకోండి.

click me!