
బయట పనులు చేసుకోవడం, తిరిగి ఇంటికి రావడం. మళ్లీ పనులకు వెళ్లడం ఇంటికి రావడం. రోజూ ఇవి రిపీట్ అవుతూనే ఉంటాయి. కానీ ఇవి జీవితం మీద విరక్తిని పుట్టిస్తాయి. లైఫ్ అంటే ఇంతేనా అనిపించేలా చేస్తాయి. అందుకే కొంతమంది ఎన్నిపనులు ఉన్నా.. పోస్ట్ పోన్ చేసి మరీ విహార యాత్రలకు వెళుతుంటారు. కొందరు ప్రపంచాన్నే చుట్టేసి వస్తే ఇంకొందరు దేశాన్నిచుట్టేసి వస్తారు. నిజానికి విహారయాత్రలు మనల్ని ఎంత ప్రశాతంగా ఉంచుతాయో.. ఎత్తైన కొండలు, మైమరిపించే పచ్చదనం, జల జల పారే వాగులు, వంకలు.. ఓహో ఇవన్నీ మనల్ని ఓ అందమైన లోకంలోకి తీసుకెళ్తాయి. మరి వానాకాలంలో విహారయాత్రకు బెస్ట్ ప్లేసెస్ గురించి తెలుసుకుందాం పదండి..
లోనావాలా - మహారాష్ట్ర
వర్షాకాలంలో ముందుగా వెళ్లాల్సింది వెకేషన్ ఏదైనా ఉందంటే అది ఇదే.. మహారాష్ట్రలో ఉండే లోనావాలా ను చూడటానికి రెండు కళ్లు చాలవు. రుతుపవనాల రాకతో సహ్యాద్రి పర్వత శ్రేణులు, ఘాట్లు, ఆకర్షణీయమైన పచ్చదనం, జల జలపారే జలపాతాలు, ఆహ్లాదకరమైన వాతావరణం మనల్ని అదోలోకంలోకి తీసుకెళ్తాయి. భారతదేశంలో వర్షాకాలంలో తప్పకుండా చూడాల్సిన ప్లేస్ ఇది. ప్రకృతి ప్రేమికులు దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది ట్రెక్కింగ్, క్యాపింగ్, గుర్రపు స్వారీకి అనువైంది.
చూడాల్సినవి: టైగర్ పాయింట్ అని పిలువబడే కొండ శిఖరం వద్ద ప్రవహిస్తున్న ప్రవాహం మనల్ని కట్టిపడేస్తుంది. క్రీస్తుపూర్వం 3 నుంచి 2 వ శతాబ్దంలో బౌద్ధ సన్యాసులు నిర్మించిన కార్లా గుహలను కూడా చూడొచ్చు. బుషి ఆనకట్ట సమీపంలో ఒక ప్రసిద్ధ జలపాతం కూడా ఉంది. ఇది వర్షాకాల ప్రేమికులందరికీ బాగా నచ్చే ప్రదేశం.
గోవా
భారతదేశంలో వర్షాకాలంలో తప్పక చూడాల్సిన ప్లేస్ లో గోవా ఒకటి. మెత్తని ఇసుక, చల చల్లని చిరు జల్లులు, బీచ్ లు చూపును తిప్పుకోనీయవు. వర్షంలో తడవడానికి, రుచికరమైన గోవా వంటకాలను ఆస్వాదించడానికి ఇది సరైన ప్రదేశం. ప్రకృతి ప్రేమికులు, సాహస ప్రియులు, బీచ్ ప్రేమికులు, పార్టీలు ఇష్టపడేవారికి ఇది బాగా నచ్చుతుంది. జెట్ స్కీయింగ్, స్కూబా, ట్రెక్కింగ్, హెరిటేజ్ టూర్, షాపింగ్, బర్డ్ వాచింగ్ ఇక్కడ చేయొచ్చు.
చూడాల్సినవి: దూద్ సాగర్ జలపాతాలు, అగ్వాడా కోట వద్ద ట్రెక్కింగ్ లేదా హైకింగ్ కు వెళ్లడం, డాల్ఫిన్ షో, బీచ్ ల సరిహద్దులో ఉన్న సముద్రం మధ్య ప్రయాణించడం, బాగా బీచ్ లో వాటర్ గేమ్స్ థ్రిల్లింగ్ అనుభవాన్ని కలిగిస్తాయి.
కొడైకెనాల్ - తమిళనాడు
ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్స్ గా పిలువబడే కొడైకెనాల్ భారతదేశంలో వానాకాలంలోని బెస్ట్ వెకేషన్ ప్లేసెస్ లో ఒకటి. పశ్చిమ కనుమలలోని పళని కొండలలో ఉన్న ఈ ప్లేస్ లో కనువిందు చేసే జలపాతాలు, సరస్సులు, పచ్చని కనుమలు, ఎత్తైన కొండల మన చూపును తిప్పుకోనీయవు. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్లేస్ చాలా చాలా నచ్చుతుంది. బోటింగ్, ట్రెక్కింగ్ ఇక్కడ చేయొచ్చు.
చూడాల్సినవి: బెరిజాం సరస్సు చుట్టూ తిరుగుతూ, రాళ్లు, చెట్లతో ఉన్న మానవ నిర్మిత సరస్సు అయిన కోడై సరస్సు ఎంతో సుందరంగా ఉంటుంది. అలాగే పల్ని కొండలు కూడా ఎంతో ఆకర్షిస్తాయి.
అండమాన్ నికోబార్ దీవులు
ఇది దాదాపుగా 570 ద్వీపాల సమూహం. ఇక్కడ రకరకాల వన్యప్రాణులు, థ్రిల్లింగ్ వాటర్ స్పోర్ట్స్, సహజమైన వెండి ఇసుక బీచ్ లు, పర్వతాలు, కనువిందుచేసే ప్రకృతి సౌందర్యం, గిరిజన పర్యటనలు మనల్ని ఆనందకేళిలో విహరించేలా చేస్తాయి. ఈ ప్రదేశం మిమ్మల్ని అడుగడుగునా ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. బీచ్ లవర్స్ కు, ప్రకృతి ప్రేమికులకు, సాహస ప్రియులకు ఇది చాలా నచ్చుతుంది. జెట్ స్కీయింగ్, స్కూబా, స్నార్కెలింగ్, ట్రెక్కింగ్ లు ఇక్కడ ఎంచక్కా చేయొచ్చు.
చూడాల్సినవి: లిటిల్ అండమాన్ లో స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్, ఇతర వాటర్ స్పోర్ట్స్, సర్ఫింగ్ కోసం హావ్ లాక్ ద్వీపంలోని సెల్యులార్ జైలు మిమ్మల్ని మైమరిపిస్తాయి.
కూర్గ్ - కర్ణాటక
ఇక్కడ దట్టమైన అటవులు ఉంటాయి. ఇక్కడ ఎన్నో రకాల వృక్షాలు, జంతులు కనువిందు చేస్తాయి. ఇది జీవవైవిధ్య హాట్ స్పాట్ గా కూడా కూడా పిలవబడుతోంది. ఈ రొమాంటిక్ డెస్టినేషన్ అద్భుతమైన జలపాతాలు, సరస్సులు, విస్తారమైన కాఫీ తోటలు, రుచికరమైన వంటకాలకు ప్రసిద్ది చెందింది. వర్షాకాలంలో ఉత్తమ పర్యాటక ప్రదేశాలలో ఇది ఒకటిగా ప్రసిద్ది చెందింది. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్లేస్ బాగా నచ్చుతుంది. ట్రెక్కింగ్, పక్షుల వీక్షణ, ఏనుగుల ఇంటరాక్షన్, గుర్రపు స్వారీ, కాఫీ తోటల టూర్ ను బాగా ఎంజాయ్ చేస్తారు.
చూడాల్సినవి: పుష్పగిరి వన్యప్రాణి అభయారణ్యంలోని వన్యప్రాణులు. కోటబెట్ట వద్ద ఆహ్లాదకరమైన పర్వతారోహణను ఆస్వాదించండి. భారతదేశంలో రెండవ ఎత్తైన కర్ణాటకలోని జోగ్ జలపాతాన్ని చూడండి.
మున్నార్ - కేరళ
దక్షిణ భారతదేశంలో వర్షాకాలంలో సందర్శించడానికి అనువైన ప్రదేశాల్లో కేరళ ఒకటి. నిజానికి మున్నార్ ఒక స్వర్గంలా ఉంటుంది. తెల్లని పొగమంచు, విశాలమైన తేయాకు తోటలు, పచ్చని కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం మీ కళ్లను తిప్పుకోనీయవు. ఈ హిల్ స్టేషన్ నిజంగా వర్షాకాలంలో భారతదేశంలో ఇష్టమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ప్రకృతి ప్రేమికులు, హనీమూన్ ప్రియులు దీన్ని బాగా ఇష్టపడతారు. ట్రెక్కింగ్, ప్లాంటేషన్ టూర్స్, సందర్శన, వలస పక్షులు బాగా నచ్చుతాయి.
చూడాల్సినవి: పశ్చిమ కనుమలలో ఎత్తైన శిఖరమైన అనముడి వద్ద కొన్ని అద్భుతమైన వన్యప్రాణులు. దేవికుళంలోని అందమైన సరస్సుల వద్ద ప్రకృతి నడకను ఆస్వాదించడం. అట్టుకల్ జలపాతాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి.