నడక వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కాదు. కానీ వాకింగ్ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ప్రయోజనాలకు బదులుగా నష్టాలను చవి చూడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మంది ఇంటి బయట చెప్పులు లేకుండా నడుస్తుంటారు. అది ఎలాంటి నేలమీదైనా. కానీ దీనివల్ల ఏం జరుగుతుందో తెలియదు.
చెప్పులు లేకుండా నడవడం మంచిదేనా?
- చెప్పులు వేసుకోకుండా రోజులో కొద్దిసేపు నడిస్తే మన శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. మీకు తెలుసా? చెప్పులు లేకుండా నడిస్తే మన కాళ్లు బలంగా అవుతాయి. అలాగే శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఎత్తుపల్లాల నేలపై నడిస్తే మన కాళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో మన శరీర పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాదు చెప్పులు లేకుండా నడిస్తే మన మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు.
- మీరు రోజూ చెప్పులు లేకుండా నడిస్తే మీ భంగిమ కూడా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీరం సమతుల్యంగా ఉంటుంది. అలాగే మీ తొడ కండరాలు, కాళ్లలోని అన్ని కండరాలు బలంగా అవుతాయి.
- మీరు గమనించారో లేదో కానీ.. చెప్పులు లేకుంటేనే మనం ఫాస్ట్ ఫాస్ట్ గా నడవగలుగుతాం. అలాగే మోకాళ్లు, పిరుదులు, శరీరం మధ్యలో కదలిక మెరుగుపడుతుంది. సరిపోని బూట్లు వేసుకుని నడవడం వల్ల కాళ్లలో నొప్పి కలుగుతుంది. మీరు గనుక చెప్పులు లేకుండా నడిస్తే ఆ సమస్య ఏమీ ఉండదు.
పిల్లలు చెప్పులు లేకుండా నడవొచ్చా?
పిల్లలకు చెప్పులు లేకుండా నడవడమే ఇష్టం. అందుకే చెప్పులు వేసినా వాటిని వదిలేసి నడుస్తుంటారు. ఎందుకంటే చెప్పులు లేకుంటేనే వారు ఫ్రీగా నడవగలుగుతారు. పిల్లలు చెప్పులు లేకుండా నడిస్తే వారి కాళ్లు బలంగా అవుతాయి. అలాగే వారి ఆలోచనలకు అనుగుణంగా స్వేచ్ఛగా నడవడానికి, పరుగెత్తడానికి కూడా సహాయపడుతుంది. కానీ చెప్పులు లేకుండా నడిస్తే పిల్లలకు గాయాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి పేరెంట్స్ పిల్లలకు బలవంతంగానైనా షూస్ ను వేస్తుంటారు.
చెప్పులు లేకుండా నడిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి?
చెప్పులు లేకుండా నడిస్తే గాయాలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే నేలపై పిన్నులు, పగిలిన గాజు ముక్కలు, ముళ్లు వంటివి ఉండొచ్చు. చూసుకోకుండా నడిస్తే గాయాలు అవుతాయి. అలాగే అపరిశుభ్రమైన ప్లేస్ లో నడిస్తే సూక్ష్మజీవుల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. అపరిశుభ్ర ప్రదేశాల్లో ఉండే శిలింధ్రాలు, బ్యాక్టీరియా వంటి ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే సూక్ష్మజీవులు పాదాలకు సోకుతాయి.
చెప్పులు లేకుండా ఎక్కడ నడవాలి?
శుభ్రంగా ఉన్న చదునైన నేలపై చెప్పులు లేకుండా నడవడం చాలా మంచిది. మీరు పచ్చిక బయళ్లపై, ఇసుకపై, కార్పెట్లపై చెప్పులు లేకుండా ఎంచక్కా నడవొచ్చు. అంతేకాదు దేవాలయాలు వంటి పవిత్ర ప్రదేశాల్లో మీరు చెప్పులు లేకుండా నడిచినప్పుడు ఉల్లాసంగా ఉంటారు. కాకపోతే చెప్పులు లేకుండా నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.