మహాభారతంలో అర్జునుడికి 2024 PT5 ఆస్టరాయిడ్‌కి సంబంధం ఏంటో తెలుసా

First Published Sep 18, 2024, 3:49 PM IST

యూనివర్స్ నుంచి 2024 PT5 అనే ఆస్టరాయిడ్ రెండు నెలల పాటు భూమి చుట్టూ తిరగనుంది. సెప్టెంబర్ 29 నుండి నవంబర్ 25 వరకు ఇది తిరుగుతుంది. స్పేస్ లో ఇలాంటి పరిణామాలు సర్వసాధారణం. అయితే ఈ సారి భూ కక్ష్యలోకి వచ్చిన ఈ గ్రహ శకలానికి మహాభారతంలోని అర్జునుడికి సంబంధం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

2024 PT5ని మినీ మూన్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే ఇది కూడా చంద్రుడిలా భూమి చుట్టూ ఓ ప్రత్యేకమైన కక్ష్యలో తిరుగుతోంది. అయితే ఈ తాత్కాలిక చిన్న చంద్రుడు 53 రోజులు మాత్రమే  భూమి చుట్టూ తిరుగుతాడు. ఇది కంటికి కనిపించదని ఇస్రో నెట్‌వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్స్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్(NETRA) ధృవీకరించింది. 2024 PT5 వ్యాసం కేవలం 10 మీటర్లు మాత్రమే. ఇది సాధారణ చంద్రుడి కంటే 3,50,000 రెట్లు చిన్నది. అందువల్ల ఇది కంటికి కనబడదు. 
 

2024 PT5 కదలికను NETRA పర్యవేక్షిస్తోంది. ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టదని నేత్ర కన్ఫర్మ్ చేసింది. సెప్టెంబర్ 29 నుంచి దాదాపు రెండు నెలల పాటు భూమి చుట్టూ తిరుగుతుంది. మినీ-మూన్ భూమి చుట్టూ తిరిగే తన దీర్ఘవృత్తాకార కక్ష్య నుండి విడిపోయి నవంబర్ 25న సోలార్ సిస్టమ్ స్పేస్ లోకి వెళ్లిపోతుంది. 

భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి మూలంగా దాని సమీపంలో ఉన్న వస్తువులను ఆకర్షిస్తుంది. స్పేస్ లో ఉన్న ఉల్కలు, గ్రహ శకలాలు ఇదేవిధంగా భూమి వైపు వస్తుంటాయి. ఇలాంటి వాటిని NASA పర్యవేక్షిస్తుంది. నాసా అనుబంధ సంస్థ అయిన ఆస్టరాయిడ్ టెరెస్ట్రియల్-ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్(ATLAS) 2024 PT5 ను ఆగష్టు 7న గుర్తించింది. 

Latest Videos


ఈ గ్రహశకలానికి హిందూ ఇతిహాసమైన మహాభారతంతో సంబంధం ఉంది. అమెరికన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ (RNAAS) రీసెర్చ్ నోట్స్‌లో ఓ ఆర్టికల్ ప్రచురితమైంది. అందులో ఉన్న వివరాల ప్రకారం ఖగోళ శాస్త్రవేత్తలు 2024 PT5 కక్ష్య ప్రాపర్టీస్ అన్నీ అర్జున గ్రహశకలం బెల్ట్ నుండి వచ్చిన గ్రహ శకలాలను పోలి ఉన్నాయి. NETRA డాక్టర్ అనిల్ కుమార్ కూడా 2024 PT5 అర్జున గ్రహశకలం సమూహంలో భాగమని ధృవీకరించారు.
 

'అర్జున' అనేది సోలార్ సిస్టమ్ లోని గ్రహశకలాల ప్రత్యేక గ్రూప్. ఖగోళ శాస్త్రవేత్త రాబర్ట్ హెచ్. మెక్‌నాట్ 1991 నవంబర్ 1న ఆస్ట్రేలియాలోని సైడింగ్ స్ప్రింగ్ అబ్జర్వేటరీలో '1991 VG' అనే గ్రహశకలాన్ని కనుగొన్నప్పుడు ఈ ఉల్కల సమూహాన్ని కూడా కనిపెట్టారు. ఆ సమయంలో హిందూ ఇతిహాసం మహాభారతంలోని అర్జునుడి పాత్ర నుండి ప్రేరణ పొంది 'అర్జున' అనే పేరును ఆయన పెట్టారు. దీనిని అంతర్జాతీయ ఖగోళ సంఘం(IAU) కూడా అధికారికంగా ఆమోదించింది.

హిందూ పురాణాల్లో అర్జునుడు అంటే ధైర్యసాహసాలు, విలువిద్య నైపుణ్యాలు, జ్ఞానానికి ప్రసిద్ధి చెందాడు. అర్జునుడు బాణం వేసినంత వేగంగా సౌర వ్యవస్థలోని గ్రహశకలాలు కదులుతుండటంతో ఆ గ్రూప్ కు అర్జున అనే పేరు పెట్టారు. 
 

2006లో కూడా ఇదే విధంగా భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల ఒక గ్రహశకలం భూమికి దగ్గరగా వచ్చింది. జూలై 2006 నుండి జూలై 2007 వరకు భూమి చుట్టూ తిరిగింది. ప్రస్తుతం భూమికి దగ్గరవుతున్న 2024 PT5 కూడా ఇలాంటిదే. 

2051లో మళ్ళీ 2024 PT5 భూమికి దగ్గరగా వచ్చి సగం చుట్టు తిరుగుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 2024 PT5 వల్ల భూమిపై ప్రజలకు ఎటువంటి ముప్పు లేదని చెబుతున్నారు. ఇదంతా విశ్వంలో సహజంగా జరిగే పరిణామమని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని NASA ప్రకటించింది.

click me!