అసలు కొబ్బరి నూనె మంచిదేనా?

First Published | Dec 4, 2023, 1:59 PM IST

కొబ్బరి నూనెలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే మనలో చాలా మంది కొబ్బరి నూనె చేసే మంచి గురించి మాత్రమే తెలుసు. ఈ నూనె ఎలాంటి దుష్ప్రభావాలను కలిగిస్తుందో తెలిస్తే షాక్ అవుతారు. 

Image: Getty Images

కొబ్బరి నూనెను కేవలం జుట్టుకు మాత్రమే కాదు.. వంటల్లో కూడా ఉపయోగిస్తారు. నిజానికి కొబ్బరి నూనె మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో మంచి కొవ్వులు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయినప్పటికీ మనం నమ్ముతున్నట్టు కొబ్బరి నూనె ఆరోగ్యకరమైందా? కాదా? అనే ప్రశ్న ఇప్పుడు చాలా మందిలో మెదులుతోంది. కొందరి నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొబ్బరి నూనె మనం అనుకుంటున్నట్టు అంత గొప్ప నూనె ఏం కాదని అంటున్నారు. మరి ఈ కొబ్బరి నూనె గురించి వివరంగా తెలుసుకుందాం పదండి. 

సంతృప్త కొవ్వు ఎక్కువగా.. 

కొబ్బరి నూనెలో ఎక్కువ మొత్తంలో సంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను విపరీతంగా పెంచుతుంది. కొలెస్ట్రాల్ పెరిగితే గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక రోగాలు వచ్చే ఛాన్స్ ఉంది. 


అవసరమైన కొవ్వు ఆమ్లాలు..

మనం ఆరోగ్యంగా ఉండేందుకు ఒమేగా -3, ఒమేగా -6 వంటి ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండాలి. కానీ ఈ మంచి కొవ్వులు కొబ్బరి నూనెలో ఎక్కువ మొత్తంలో ఉండవు. అందుకే మీ రోజువారీ ఆరోగ్యకరమైన కొవ్వుల తీసుకోవడం కోసం కొబ్బరి నూనెపై మాత్రమే ఆధారపడటం మీ శరీర అవసరాలను తీర్చడానికి సరిపోదు.
 

అధిక కేలరీలు

కొబ్బరి నూనెను ఇతర వంట నూనెలకు 'ఆరోగ్యకరమైన' ప్రత్యామ్నాయంగా భావిస్తారు. కానీ కొబ్బరి నూనెలో కొవ్వు, కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కొబ్బరి నూనెను వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తే మీకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. 
 

అవసరమైన పోషకాల లోపం

కొబ్బరి నూనెలో విటమిన్ ఇ, లారిక్ ఆమ్లం వంటి కొన్ని ప్రయోజనకరమైన పోషకాలు మెండుగా ఉంటాయి. అయినప్పటికీ.. మన శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరమైన ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఈ కొబ్బరి నూనెలో ఉండవు. 
 

అయితే కొబ్బరి నూనెను మన ఆహారం నుంచి పూర్తిగా తొలగించాలని కాదు. ఇది మన ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటుగా ఎన్నో దుష్ప్రభావాలను కూడా చూపిస్తుంది. కొబ్బరి నూనెతో మీకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా.. దీనిని మీ సమతుల్య ఆహారంలో భాగంగా తక్కువగా తీసుకోండి. కానీ మీ రోజువారి అవసరాలకు  కొబ్బరి నూనెపై ఎక్కువగా ఆధారపడకూడదు. అలాగే దీనిని మోతాదుకు మించి ఉపయోగించకూడదు.

Latest Videos

click me!