తిన్న వెంటనే సోడా తాగుతున్నారా? ఇది చాలా డేంజర్

First Published | Sep 21, 2024, 12:18 PM IST

మీరు భోజనం చేసిన తర్వాత వెంటనే సోడా తాగుతున్నారా? ఏదైనా బిర్యానీ లాంటి ఫుడ్ తిన్న వెంటనే సోడా పట్టించేస్తున్నారా? తిన్న వెంటనే సోడా తాగితే అరుగుతుందని మీరు భావిస్తారు. అయితే అది కరెక్ట్ కాదు. తిన్న వెంటనే సోడా తాగడం వల్ల జీర్ణం అవ్వకపోగా, ఎసిడిటీ, అల్సర్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని మీకు తెలుసా? సోడా తాగడం వల్ల కలిగే నష్టాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు ఆరోగ్యంగా ఉండాలంటే డైజేషన్ సిస్టమ్ సరిగా పనిచేయాలి. అందులో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు అనారోగ్యానికి గురవుతారు. జీర్ణ సమస్యలు కడుపు నొప్పితో మొదలై తీవ్రమైన అనారోగ్యాలకు దారి తీస్తాయి. మీరు తీసుకున్న ఫుడ్ 3 నుండి 4 గంటలలోపు జీర్ణం అయితే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టే. అలా కాలేదంటే కడుపులో ఉన్న ఫుడ్ వల్ల గ్యాస్, ఉబ్బరం, ఇతర అసౌకర్యాలు వస్తాయి. భోజనం తర్వాత సోడా తాగడం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుందని చాలా మంది నమ్ముతారు. కానీ ఇది నిజమో కాదో ఇప్పుడు తెలుసుకుందాం. 

సోడా జీర్ణక్రియకు సహాయపడుతుందనేది ఒక అపోహ మాత్రమే. సోడాలో గ్యాస్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది తీసుకున్నప్పుడు త్రేనుపులుగా బయటకు వస్తుంది. దాన్నే మనం గ్యాస్ బయటకు పోయింది అనుకుంటాం. సోడా ఎప్పుడు తీసుకున్నా త్రేనుపులు వస్తాయి. అయితే భోజనం తర్వాత సోడా తాగినప్పుడు ఫుడ్ డైల్యూట్ అయిపోతుంది. అందువల్ల తిన్న ఆహారం త్వరగా అరగదు. 

సోడాలు వాస్తవానికి జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. వాటి కార్బొనేషన్ అధిక చక్కెర కంటెంట్ వల్ల ఉబ్బరం, గ్యాస్ పెరిగి అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కొన్ని సోడాలలో ఫాస్పోరిక్ యాసిడ్, కెఫీన్ ఉంటాయి. ఇవి కొంతమంది వ్యక్తులకు గుండెల్లో మంటను కలిగిస్తాయి. అతిగా సోడా తాగడం ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.

Latest Videos


బరువు పెరగడం: కూల్ డ్రింక్స్, సోడాల్లో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి వేగంగా బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. ఒక లీటర్ సోడాలో 10 టీస్పూన్ల చక్కెర ఉంటుంది. ఈ చక్కెర పానీయాలు తాత్కాలికంగా ఆకలిని తగ్గిస్తాయి. అయితే అవి చివరికి అతిగా తినడానికి, తరువాత బరువు పెరగడానికి దారితీస్తాయి.

ఫ్యాటీ లివర్: మీరు గ్లూకోజ్, ఫ్రక్టోజ్ గురించి వినే ఉంటారు. మన శరీర కణాలు గ్లూకోజ్‌ను సులభంగా జీవక్రియ చేయగలిగినప్పటికీ కాలేయం మాత్రమే ఫ్రక్టోజ్‌ను డైజస్ట్ చేస్తుంది. కూల్ డ్రింక్స్ ను అధికంగా తీసుకోవడం వల్ల కాలేయంపై ఫ్రక్టోజ్ ఓవర్‌లోడ్ అవుతుంది. దీనివల్ల కొవ్వుగా మారి కాలేయంలో పేరుకుపోతుంది. ఇది చివరికి తీవ్రమైన కొవ్వు కాలేయ వ్యాధికి దారితీస్తుంది.

దంత క్షయం: కూల్ డ్రింక్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలలో దంత క్షయం ఒకటి. సోడాలలో ఉండే ఫాస్పోరిక్ యాసిడ్, కార్బోనిక్ యాసిడ్ కాలక్రమేణా దంతాల ఎనామిల్‌ను దెబ్బతీస్తాయి. చక్కెరతో కలిపినప్పుడు ఈ ఆమ్లాలు నోటిలో బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి అనువైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. చివరికి పళ్లన్నీ దెబ్బతింటాయి. 

టైప్ 2 డయాబెటిస్: కూల్ డ్రింక్స్, చక్కెర పానీయాలను ఎక్కువ కాలం తీసుకోవడం వల్ల ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సోడా తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తరచుగా పెరుగుతాయి. దీంతో శరీరంలోని ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. చివరికి డయాబెటిస్‌కు దారితీస్తుంది.

ఎముకల ఆరోగ్యం: కోలా, సోడాలలో సాధారణంగా కనిపించే ఫాస్పోరిక్ యాసిడ్, మానవ శరీరంలో కాల్షియం పెరగడానికి ఆటంకం కలిగిస్తుంది. సోడాలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. ఆస్టియోపోరోసిస్, పగుళ్ల ప్రమాదం పెరుగుతుంది.

మూత్రపిండాల సమస్యలు: అనేక శీతల పానీయాలలో అధిక స్థాయిలో ఫాస్పోరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది యూరిన్ లో యాసిడ్ నేచర్ ను పెంచుతుంది. దీంతో మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడతాయి. దీర్ఘకాలికంగా ఫాస్పోరిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల మూత్రపిండాల పనితీరు కూడా దెబ్బతింటుంది. కిడ్నీ వ్యాధులు అటాక్ అయ్యే ప్రమాదం పెరుగుతుంది.

క్యాన్సర్ ప్రమాదం: కూల్ డ్రింక్స్ లో కనిపించే కొన్ని కృత్రిమ రంగులు, రుచులు క్యాన్సర్ కారకాలుగా పనిచేస్తాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్ని పానీయాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మూత్రాశయ క్యాన్సర్, ఇతర రకాల క్యాన్సర్‌లు ఏర్పడే ప్రమాదం ఉంది. అందువల్ల జీర్ణక్రియ కోసం సోడా తాగడం అనేది ఒక అపోహ మాత్రమే.

సోడాలు జీర్ణక్రియకు సహాయపడటానికి బదులుగా లివర్ ప్రాబ్లమ్స్ కు దారితీస్తుంది. గుండె జబ్బులు, క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.

సరైన జీర్ణక్రియ కోసం ఆహారాన్ని బాగా నమలడం మంచిది. మీరు జీర్ణ సమస్యలను ఎదుర్కొంటుంటే వెచ్చని నీరు తాగడం మంచిది. ఆర్టిఫీషియల్ డ్రింక్స్ లేదా సోడా కంటే నీరు, హెర్బల్ టీలు, ఇంట్లో తయారుచేసిన పండ్ల రసాలు ఆరోగ్యం ఇస్తాయి. శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచివి. 

click me!