ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఏపీ హైకోర్టు ధర్మాసనాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం, ఏపీ ఉద్యోగుల సంఘం దాఖలు చేసిన పిటిషన్లపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.
ఫిబ్రవరిలో నాలుగు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ఈ నెల 8వ తేదీన షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇదే షెడ్యూల్ ప్రకారంగా ఎన్నికలు జరగనున్నాయి.
ఈ మేరకు ఈ నెల 23న తొలివిడత ఎన్నికలకు ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిపికేషన్ ప్రకారంగా ఈ నెల 25 నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
అయితే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఉద్యోగులు కూడ ఇదే రకమైన అభిప్రాయంతో ఉన్నారు. కరోనా నేపథ్యంలో ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది.
మరో వైపు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణకు వచ్చే అవకాశం ఉన్నందున వేచి చూడాలని పంచాయితీరాజ్ ఉన్నతోద్యోగులు ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ను కోరారు.
ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రక్రియకు సహకరించే పరిస్థితి లేదని ఇప్పటివరకు సంకేతాలు ఇచ్చారు. నామినేషన్ల ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు చేస్తారా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉంది.
నామినేషన్లు వేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని టీడీపీకి చెందిన మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి ప్రకటించారు.
ఇదిలా ఉంటే ఏపీ హైకోర్టు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సుప్రీంకోర్టులో మరో ధర్మాసనానికి మారింది. తొలుత లావు నాగేశ్వరరావు బెంచీ ముందుకు పిటిషన్ వెళ్లింది. ఆ తర్వాత మరో బెంచీ ముందు రీలిస్ట్ చేశాడు రిజిస్ట్రీ.
జస్టిస్ సంజయ్ కిషన్ నేతృత్వంలో పిటిషన్ పై విచారణ సాగనుంది.