రాజకీయాల్లో చిరంజీవి ఫ్లాప్‌, పవన్‌ సూపర్‌ హిట్‌.. చిరు చేసిన మిస్టేక్ ఏంటి? పవర్‌ స్టార్‌ విజయానికి కారణమేంటి

First Published | Jun 11, 2024, 8:24 PM IST

రాజకీయాల్లో మెగాస్టార్‌ స్టార్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాడు. కానీ తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ సూపర్‌ హిట్‌ కొట్టాడు. అన్న ఫెయిల్యూర్‌కి, తమ్ముడు సక్సెస్‌కి కారణం ఏంటి? ఇద్దరిలో ఉన్న తేడా ఏంటి?
 

రాజకీయాల్లో సినిమా తారల ప్రభావం చాలానే ఉంటుంది. చాలా మంది నటులు రాజకీయాల్లోకి వచ్చారు కానీ, వారిలో కొందరు మాత్రమే సక్సెస్‌ అయ్యారు. తెలుగులో రాష్ట్రాల్లో ఎన్టీఆర్‌ మాత్రమే సక్సెస్‌ అయ్యాడు. ఆ తర్వాత మరే నటుడు ఆ స్థాయిలో సక్సెస్‌ కాలేకపోయారు. కృష్ణ, దాసరి, కృష్ణంరాజు, మోహన్‌బాబు, బాబు మోహన్‌, మురళీ మోహన్‌ వంటి వారు రాజకీయాల్లోకి వెళ్లారు. పదవులు అనుభవించారు. కానీ ఎన్టీఆర్‌లా రాజకీయాలను శాషించలేదు.  
 

మెగాస్టార్‌ చిరంజీవి కూడా రాజకీయాల్లోకి ఓ సునామీలా వచ్చి వెళ్లిపోయాడు. రెండు మూడేళ్లలోనే పార్టీని క్లోజ్‌ చేశాడు. ఆయన కేంద్ర మంత్రి అయ్యాడు. కానీ తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ లా సక్సెస్‌ కాలేకపోయాడు. పవన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలను శాషిస్తున్నాడు. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ చక్రం తిప్పే స్థాయికి ఎదిగాడు. ఏపీలో కూటమి ఏర్పాటు చేయించి అది విజయం సాధించేలా చేశాడు. రేపు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టబోతున్నాడు. మరి చిరంజీవి సక్సెస్‌ కాలేకపోవడానికి కారణమేంటి? ఆయన చేసిన మిస్టేక్‌ ఏంటి? పవన్‌ కళ్యాణ్‌ సక్సెస్‌ కి కారణమేంటి? ఆయన రాజకీయాలను శాషించే స్థాయికి ఎదగడం వెనుకున్న కథేంటి? రాజకీయాలకు సంబంధించి మెగా హీరోల్లో చిరంజీవి, పవన్‌కి మధ్య ఉన్న తేడా ఏంటి? తెరవెనుక ఉన్న కారణాలేంటి? అనేది చూస్తే..
 


మెగాస్టార్‌ చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించాడు. ఆగస్ట్ 2న భారీ స్థాయిలో ఈవెంట్‌ ఏర్పాటు చేసి పార్టీ పేరుని ప్రకటించారు చిరంజీవి. అప్పట్లో మెగాస్టార్‌కి సినిమా పరంగా భారీ క్రేజ్‌ ఉంది. అత్యంత మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరో. దీంతో జనం కుప్పులు తెప్పలుగా వచ్చారు. ఆయన మీటింగ్‌ పెడితే లక్షల్లో జనాలు వచ్చారు. ఒక సునామీలా ఆయన మీటింగ్‌లు ఉండేవి. కానీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి 294 సీట్లకుగానూ కేవలం 18 సీట్లు మాత్రమే వచ్చాయి. చిరంజీవి ఎన్నికలకు ఆరు నెలల ముందే మాత్రమే పార్టీని స్థాపించాడు. ఆ ఆరు నెలల్లోనే జనం ముందుకు వెళ్లాడు. దీంతో ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేకపోయాడు. 
 

నిజానికి 2009 ఎన్నికల సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలకు సంబంధించిన గ్యాప్‌ లేదు. కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉంది. రాజశేఖర్‌ రెడ్డి సీఎంగా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. అంతేకాదు ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు కూడా గట్టిగా ఉన్నాడు. టీడీపీ గ్రామాల స్థాయిలో బలమైన క్యాడర్‌ని కలిగి ఉంది. ఈ రెండు పార్టీలకు గ్రౌండ్‌ లెవల్‌లో బలమైన పునాదులున్నాయి. దీనికితోడు తెలంగాణలో ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌ ఉంది. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతూనే ఉంది. ఇలా ఈ మూడు పార్టీలు ఉన్నంతలో బలంగా ఉన్నాయి. రాజకీయపరమైన గ్యాప్‌ ఏమాత్రం లేదు. 
 

అలాంటి సమయంలో మెగాస్టార్‌ ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. రాజకీయ ఉద్దండులు రాజశేఖర్‌ రెడ్డి, చంద్రబాబు నాయుడు, తెలంగాణ సెంటిమెంట్‌ పార్టీ టీఆర్‌ఎస్‌ని ఎదుర్కొని 18 సీట్లు గెలిచారు. తెలంగాణలో కేవలం ఒకే సీట్‌ గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోనే మిగిలిన 17 సీట్లు వచ్చాయి. రెండు చోట్ల పోటీ చేసిన చిరంజీవి ఒక్క చోటే(తిరుపతి) విజయం సాధించారు. ఈ ఫలితాలు చిరంజీవికి పెద్ద షాక్‌ ఇచ్చాయి. అధికారం ఫామ్‌ చేయాలనే టార్గెట్‌తో, ఎన్టీఆర్‌లా తాను కూడా ఓ సునామీలో రాజకీయ ప్రత్యమ్నాయంగా రావాలని భావించి పీఆర్‌పీని స్థాపించిన చిరుకి ఈ ఫలితాలు పెద్ద షాక్‌ ఇచ్చాయి. ఆయనకు జనంలో ఉన్న క్రేజ్‌, మాస్‌ ఫాలోయింగ్‌ కేవలం సినిమాకే పరిమితమని, అవి ఓట్లుగా టర్న్ కాలేదని ఆ ఎన్నికలు స్పష్టం చేశాయి. అభిమానం వేరు, పార్టీ వేరు అని చాటి చెప్పాయి. పార్టీ పెట్టిన వెంటనే ఎన్నికల్లోకి వెళ్లడం, గ్రౌండ్‌ లెవల్‌ల్లోకి వెళ్లలేకపోవడం వంటివి పెద్ద ప్రభావాన్ని చూపించాయని చెప్పొచ్చు. సినిమాల్లో హీరోగా ఆడియెన్స్ మనసుని దోచుకున్న చిరంజీవి రాజకీయాల్లో మాత్రం జనం మనసుని గెలవలేకపోయాడు.
 

చిరంజీవి.. 2009 ఎన్నికల అనంతరం కేవలం రెండేళ్లు మాత్రమే తన పార్టీని కొనసాగించాడు. ఆ వెంటనే కాంగ్రెస్‌ పార్టీలో తన పీఆర్‌పీని విలీనం చేశాడు. తాను కేంద్రమంత్రి పదవి తీసుకున్నారు. స్వతంత్ర్య హోదాలో టూరిజం మంత్రిగా ఎంపికయ్యారు. కేంద్ర మంత్రిగా ఆ రెండేళ్లు పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం పూర్తిగా రాజకీయాలకే దూరమయ్యాడు. చిరు.. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి ప్రధాన కారణం ఆయన ప్రత్యక్ష రాజకీయాలను ఎదుర్కోలేకపోయాడు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని గట్టిగా నిలదీయలేకపోయాడు, ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాడలేకపోయాడు, తనపై వచ్చే విమర్శలను తీసుకోలేకపోయాడు, అధికార పక్షాన్ని విమర్శించలేకపోయాడు. తన సెన్సిటివ్‌ మైండ్‌ సెట్‌ ఆయనకు పెద్ద దెబ్బగా మారింది. తాను ఈ రాజకీయాలకు పనికి రానని, ఈ రాజకీయ బురద తాను చల్లుకోలేనని భావించి పీఆర్‌పీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, మంత్రి పదవి తీసుకుని రిలాక్స్ అయ్యాడు.  ఐదేళ్లలోనే రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యాడు. 
 

నిజానికి చిరంజీవి ఆ తక్కువ సమయంలోనే పార్టీ పెట్టి, ఎన్నికల్లోకి వెళ్లి 18 సీట్లు గెలవడం గొప్ప విషయమే. రెండు ప్రధాన పార్టీలను, పెద్ద నాయకులను ఎదుర్కొని ఆ స్థాయిలో సీట్లని సాధించడం గొప్ప విషయమే కానీ, దాన్ని కొనసాగించలేకపోయాడు చిరంజీవి. రాజకీయాల్లో విజయం సాధించాలంటే కంటిన్యూగా జనంలో ఉండాలి, పోరాటాలు చేయాలి, ప్రజల పక్షాన సమస్యలపై పోరాడాలి, విమర్శలు చేయాలి, విమర్శలను తీసుకోవాలి. ఇదంతా లాంగ్‌ రన్‌ ప్రాసెస్. కానీ తన సున్నితమైన మనస్థత్వం కారణంగా చిరంజీవి ఇది మనకు వద్దు అనుకున్నారు. పార్టీని విలీనం చేసి, రాజకీయాలకే దూరమయ్యాడు. ఆ రకంగా మెగాస్టార్‌ రాజకీయాల్లో విఫలమయ్యాడు. ఆయనది పొలిటికల్‌ జర్నీ ఫ్లాప్‌ స్టోరీ అయ్యింది. 
 

కానీ పవన్‌ కళ్యాణ్‌ అలా చేయలేదు. ఆయనకు పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తూ వచ్చాడు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు అన్నతోనే ఉన్నాడు పవన్‌. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ఓ సునామీలా ప్రచారం నిర్వహించాడు. ఆ తర్వాత పరిణామాలు పవన్‌ కళ్యాణ్‌కి అనుభవాన్ని తెచ్చిపెట్టాయి. రాజకీయాలపై కొంత అవగాహన వచ్చింది. అనంతరం తాను రాజకీయాల్లోకి వచ్చాడు. అన్న చేసిన తప్పు చేయకూడదని తాను పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2014 మార్చి 14న పవన్‌ జనసేన పార్టీని స్థాపించాడు. ఆ కొద్ది రోజుల్లోనే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ విడిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దీంతో పవన్‌ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కేవలం టీడీపీ, బీజేపీ కూటమికి సపోర్ట్ చేశాడు. ఆ టైమ్‌లో కూటమినే విజయం సాధించింది. 
 

 కొన్నాళ్ల తర్వాత పవన్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లాడు. టీడీపీతో తెగతెంపులు చేసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. అటు సినిమాలు చేస్తూనే, రాజకీయాలకు టైమ్‌ ఇచ్చాడు. జనం మధ్యలోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో ప్రభుత్వాన్ని విమర్శించాడు, వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధమయ్యాడు. రెగ్యూలర్‌గా జనంలోకి వెళ్తూ నెమ్మదిగా ఎదగాలని భావించారు.  కానీ ప్రారంభంలో పవన్‌కి కూడా అన్నలాగే తమ్ముడు కూడా వచ్చి వెళ్లిపోతాడు, శాశ్వతంగా రాజకీయాల్లో ఉండరనే విమర్శలు వచ్చాయి. అధికార పక్షం, అటు ప్రతిపక్షం వైసీపీ కూడా విమర్శలు చేసింది. వ్యక్తిగత జీవితాన్ని లాగి విమర్శలు చేశారు. ఇవన్నింటిని భరించాడు పవన్‌. తిట్టుకి తిట్టే సమాధానం అని భావించి రెచ్చిపోయాడు, ప్రత్యర్థులపై విరుచుకుపడ్డాడు. 
 

ఈ క్రమంలో ఆయన 2019 ఎన్నికల్లో స్వతంత్ర్యంగా పోటీ చేశారు. కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేయగా, ఒక్క సీటు మాత్రమే గెలిచింది. ఘోరంగా పరాజయం చెందింది. అయినా పవన్‌ తగ్గలేదు. తాను లాంగ్‌ టర్మ్ రాజకీయాలను చూస్తున్నానని వెల్లడించాడు. నెమ్మదిగా పుంజుకోవాలని, గ్రౌండ్‌ లెవల్‌లో క్యాడర్‌ని బిల్డ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఐదేళ్లలో ఆ పని చేశాడు. చాపకింద నీరులా నెమ్మదిగా క్షేత్ర స్థాయిలోకి వెళ్లాడు పవన్‌. తరచూ జనంలో ఉన్నాడు. మీటింగ్ లలో ప్రభుత్వాన్ని విమర్శించాడు. విరుచుకుపడ్డాడు. ప్రభుత్వంలోని నాయకులు ఎలా మాట్లాడితే అలానే మాట్లాడాడు, ఇంకా చెప్పాలంటే విమర్శల డోస్‌ పెంచాడు, వ్యక్తిగతంగానూ టార్గెట్‌ చేసి మాట్లాడాడు. ఇవన్నీ పవన్‌ని జనంకి దగ్గర చేశాయి. చిరంజీవిలా వెళ్లిపోయే వాడు కాదు, ఉండేవాడని జనం నమ్మేలా చేశాయి. 
 

దీంతోపాటు పవన్‌ రాజకీయాలను నేర్చుకున్నాడు. సామాజిక సమీకరణాల గురించి తెలుసుకున్నాడు. ఓట్ల మేనేజ్‌మెంట్‌ తెలుసుకున్నాడు. ఏ అంశాన్ని మాట్లాడితే ఎవరిని టార్గెట్‌ చేయోచ్చు, ఏ జనాన్ని ఆకర్షించించో తెలుసుకున్నాడు. తమ అతిపెద్ద సామాజిక వర్గం అయిన కాపుని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు. ఆ విషయంలో సక్సెస్‌ అయ్యాడు. తాను రాజకీయాల్లో ఉంటానని, వారికి అండగా ఉంటానని నమ్మకం కలిగేలా చేశాడు. దీంతో ఆ వర్గం పవన్‌ వైపు మళ్లింది. వైసీపీ వైపు ఉన్న వాళ్లంతా పవన్‌ వైపు టర్న్ తీసుకున్నారు. మరోవైపు యూత్‌ని టార్గెట్‌ చేస్తూ వెళ్లాడు పవన్‌. వారిని బాగా రెచ్చగొట్టాడు. `పైసలకు అమ్ముడు పోయే వారు కాదు యువత అంటే` అంటూ వారిలో చైతన్యాన్ని తీసుకొచ్చాడు, తనవైపు ఆకర్షింప చేసుకున్నాడు. పవర్‌ పుల్‌ స్పీచ్‌లతో యువతని బాగా ఆకర్షించాడు. ఇవన్నీ పవన్‌కి 2024 ఎన్నికలలో పనిచేశాయి. 
 

మరోవైపు ఈ ఎన్నికల్లో ఒంటరిగా వెళితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలుతాయని భావించిన పవన్‌.. రాజకీయ వ్యూహాన్ని ప్రదర్శించాడు. టీడీపీ, బీజేపీలతో పొత్తు సెట్‌ చేశాడు. తనే ముందుండి ఈ ప్రక్రియని నడిపించాడు. అన్నీ తానై వ్యవహరించాడు. మూడు పార్టీలు కలిసి పనిచేసేలా ప్లాన్‌ చేసి ఎన్నికల్లోకి వెళ్లాడు. తమ కార్యకర్తల్లోనూ ఆ ధైర్యాన్ని, నమ్మకాన్ని, భరోసని ఇచ్చాడు పవన్‌. ఎన్నికలకు ముందు నుంచి యాక్టివ్‌గా ఉన్నాడు. ఎన్నికల్లోనూ అగ్రెసివ్‌గా ప్రచారం నిర్వహించాడు. మాటకు తూటా పేలుస్తూ ముందుకెళ్లాడు. అత్యంత పవర్‌ఫుల్‌ స్పీచెస్‌తో ప్రత్యర్థులను చెడుగుడు ఆడుకున్నాడు పవన్‌. ఆయన స్పీచ్‌లు బాగా హైలైట్‌ అయ్యాయి. జనాన్ని, యువతని బాగా ఆకర్షించాయి. అవన్నీ ఓట్లుగా మారాయి. 

దీనికితోడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వంపై బాగా వ్యతిరేకత ఉంది. ఉపాధి కల్పించే విషయంలో, రాష్ట్ర అభివృద్ధి, రోడ్డ విషయంలో విఫలం అయ్యాడు జగన్‌. లిక్కర్‌ మాఫియా, ఇసుక మాఫియా, భూహక్కు చట్టాల్లో మార్పులు ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాయి. మరోవైపు రాజధాని అంశం కూడా పెద్ద దెబ్బగా మారింది. ఇలా జగన్‌ ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత పెరిగింది. దాన్ని తమకు అనుకూలంగా మల్చుకున్నారు పవన్‌. ఆ వ్యతిరేక ఓటు చీలకుండా కూటమి ఏర్పాటు చేసి సక్సెస్‌ అయ్యాడు. అంతేకాదు తాను పోటీ చేసిన అన్ని సీట్లలో(21అసెంబ్లీ, 2 ఎంపీ) విజయం సాధించి చరిత్ర సృష్టించాడు. రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పాడు. ఓ కింగ్‌ మేకర్ గా నిలిచారు. సీట్ల ప్రకారం టీడీపీ సక్సెస్‌ అయినా, నైతికంగా, రాజకీయంగా పవన్‌ ఎక్కువ సక్సెస్‌ అయ్యాడు. ఆయన దేశ వ్యాప్తంగా పాపులర్‌ అయ్యాడు.  అందరి దృష్టిని ఆకర్షించాడు. విజయవంతంగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో భాగం కాబోతున్నాడు. డిప్యూటీ సీఎం పదవి కూడా తీసుకోబోతున్నారు పవన్‌. 
 

అన్న చిరంజీవిలా ఇలా పార్టీ పెట్టిన రెండు మూడు సంవత్సరాల్లోనే పార్టీని క్లోజ్‌ చేయకుండా పదేళ్లు వెయిట్‌ చేశాడు పవన్‌. బాగా దెబ్బలు తిన్నాడు, తిట్లు తిన్నాడు, తాను తిట్టాడు, ఫక్తు రాజకీయ నాయకుడిలా మారాడు, విజయం సాధించాడు. కానీ చిరంజీవి అలా చేయలేకపోయాడు. ఆయన మనస్థత్వం ఆయన్ని త్వరగా పార్టీ క్లోజ్‌ చేసేలా చేసింది. చిరంజీవిలోని సెన్సిటివ్‌ నేచర్‌ ఆయన్ని రాజకీయాల్లో  అట్టర్‌ ఫ్లప్‌ చేస్తే, అదే డేరింగ్‌, డైనమిక్‌ ఆలోచనలు, మొండితనం పవన్‌ని సూపర్‌ హిట్‌ చేశాయి. అంతేకాదు కేవలం టీడీపీతో కలవడం, ప్రభుత్వంతో కలిసి పనిచేయడమే కాదు, రాబోయే ఎన్నికల్లో సీఎం సీటే ప్రధానంగా పవన్‌ పనిచేయబోతున్నాడు. ఆ రకంగా పావులు కదపబోతున్నాడు. రెండు మూడేళ్లలో టీడీపీ నుంచి కూడా బయటకు వచ్చి ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వంపై పోరాడుతూ సొంతంగా అధికారంలోకి రావాలనే లాంగ్‌ ప్లానింగ్‌తో ముందుకు సాగుతున్నాడు పవన్‌. మరి అందులో ఎంత వరకు సక్సెస్‌ అవుతాడనేది చూడాలి. 

Latest Videos

click me!