కథేంటి: సైకాలిజీ ప్రొఫెసర్ జేడీ(విజయ్)కు తాగుడు లేనిదే తెల్లారదు. కాలేజీకి తాగి వచ్చే అతనంటే మేనేజ్మెంట్ కు మండుతూంటూంది. అయితే అతనికి స్టూడెంట్స్ లో భీబత్సమైన ఫాలోయింగ్ ఉండటంతో ఏమీ యాక్షన్ తీసుకోలేరు. స్టూడెంట్స్ వెల్ఫేర్ కోసం పోరాడుతుండటం, అప్పుడప్పుడూ తన స్టైల్స్, మేనేరిజంతో పాటలు పాడి, డాన్స్ లు చేయటంతో సాటి లెక్చరర్ చారులత(మాళవిక మోహనన్) ప్రేమలో పడిపోతుంది. ఇలా కాలేజీలో కథ కాలక్షేపం చేస్తూండగా..ఎలక్షన్స్ వస్తాయి. కానీ మేనేజ్మెంట్ కు అవి ఇష్టం ఉండవు. కానీ జేడీ...స్టూడెంట్స్ లో నాయకత్వం వర్దిల్లాలంటే ఎలక్షన్స్ జరగాల్సిందే అని పట్టుపడతాడు.
అయితే నువ్వే భాధ్యత తీసుకో..ఏ గొడవలు జరగకూడదు. జరిగాయో..కాలేజీ విడిచిపెట్టి వెళ్లిపోయాలని మేనేజ్మెంట్ ఓ కంఢీషన్ పెడుతుంది. ఎలక్షన్స్ సవ్యంగా,శాంతియుతంగా జరుగుతాయి కానీ ..రిజల్ట్ తర్వాత గొడవలు అవుతాయి. వేరే దారి లేని పరిస్దితుల్లో జేడీ..కాలేజీని విడిచిపెట్టాల్సి వస్తుంది. దాంతో అతన్ని జువైనల్ అబ్జర్వేషన్ హోంలో మాస్టర్ గా మూడు నెలలు పని చేయాల్సిన అవసరం పడుతుంది. అక్కడికి వెళ్లాకే కథ మలుపు తిరిగుతుంది.
ఆ జువైనల్ హోంలో బాల నేరస్థుల్ని అడ్డు పెట్టుకుని బయట అరాచకాలు చేస్తున్న భవాని (విజయ్ సేతుపతి)అనే ఓ శాల్తీ ఉంటుంది. ఈ భవానికి ఓ భారీ ప్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ రోజుల్లో వరంగల్ లో ఉండే భవానీ(విజయ్ సేతుపతి) తండ్రిని ముగ్గురు ప్రత్యర్థులు చంపేస్తారు. అంతేకాకుండా భవానీని కూడా చంపబోతే కాళ్లా వేళ్లా పడి..ప్రాణాలతో వదిలెయ్ మని వేడుకుంటాడు. అంతేకాకుండా ఆ నేరాన్ని తనపై వేసుకుని బాలనేరస్థుల జైలు జువైనల్ హోంకు వెళతాడు. అక్కడ అతను అన్ని రకాలుగా రాటు దేలి రాక్షసుడు అవుతాడు. ఆ తర్వాత..పెద్దై... ఆ జైలులో పిల్లల్ని చేరదేసి వారితో నేరాలు చేయించి బ్రతకటం మొదలు పెడతాడు.
అలా మెల్లిమెల్లిగా వరంగల్ లో లారీల సామ్రాజ్యానికి రారాజు అవుతాడు. జైలులో పిల్లలకు మత్తు పదార్థాల అలవాటు చేసి తను చేసిన నేరాలను వారిపైకి నెట్టి అరాచకాలను సాగిస్తుంటాడు. అలాంటి చోటకే మన మాస్టర్ వెళ్లాడు. ఇదీ కథా సెటప్. ఇక్కడ నుంచి ఇద్దరి మధ్యా యుద్దం మొదలవుతుంది. మన హీరో తాగుబోతే కానీ నీతిమంతుడు. దాంతో భవాని పనులుకు అడ్డం పడతాడు. భవానీ ఊరుకుంటాడా.. అతనూ తనదైన శైలిలో వార్ ప్రకటిస్తాడు. ఇద్దరి మధ్యా నువ్వా నేనా టైప్ లో యుద్దం. చివరకు భవాని పై జేడీ ఎలా విజయం సాధించాడు. ఆ క్రమంలో జరిగిన సంఘటనలు ఏమిటనేది మిగతా కథ.
ఎలా ఉందంటే...: దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ కథను కూడా సెకండాఫ్ మొత్తం ఒకే లొకేషన్ కు తీసుకు వచ్చి నడిపే ప్రయత్నం చేసాడు. అయితే ఖైదిలో ఉన్న ఇంటెన్సిటీలో ఇందులో లేదు. అలాగే హీరో,విలన్ ఇద్దరూ ఎదురెదరు ఎక్కడా పడరు. అలా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. ఇద్దరూ ఎదురయ్యేసరికి..క్లైమాక్స్ ఫైట్ వచ్చేసింది. విజయ్ వంటి స్టార్ హీరోకు కథ రాసుకోవటం ఎంత ఈజీనో అంత కష్టం. ఎందుకంటే అతని నుంచి అభిమానులు కమర్షియల్ ఎలిమెంట్స్ ఎదురుచూస్తారు. అలాగని అవే పెట్టుకుంటూ పోతే చివరకు తన ముద్ర మాయమైపోతుంది. స్క్రిప్టు దశలో బాగుందనిపించే ఈ కథ విజయ్,విజయ్ సేతుపతి అనే స్టార్, నటుడు మధ్య నలిగిపోయింది. అలగే ఈ కథలో కొత్తదనం కూడా కరువు అయ్యింది. అప్పట్లో వచ్చిన కమల్ హాసన్ ప్రొఫిసర్ విశ్వం, చిరంజీవి మాస్టారు ఛాయిలు కనపడతాయి.
అయితే జువైనల్ హోం అనేది కొత్త నేపధ్యం. కానీ విజయ్ స్దాయికి ఆ బ్యాక్ డ్రాప్ చిన్నదై పోయింది. విలన్ పాత్ర డిజైన్ లో వైవిధ్యం ఉన్నా ...నడక మాత్రం పరమ రొటీన్ గా ఉంది. ఎప్పుడైతే విలన్, హీరో ఈ యాక్షన్ సినిమాలో కనపడకుండా దాగుడుమూతలు ఆడతారో అఫ్పుడే హీరో పాత్ర ప్యాసివ్ గా మారిపోయింది. కథను,క్యారక్టర్స్ ని సహజంగా చూపెడితే ఇబ్బంది అనిపించదు కానీ...హీరోకు ఓ రేంజిలో ఎలివేషన్స్ ,బిల్డప్ లు ఇచ్చి..అసలు పోరాటం దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం ఓ సహజమైన క్యారక్టర్ లా సామాన్యుడుగా చూపుదామనుకుంటే ఎలా.. ఆ ఎలివేషన్స్ కు తగినట్లే విలన్ ఉండాలి. అలాగే అతనితో ఫైట్ ఉండాలి. అదే లేకుండాపోయి తేలిపోయి..ఆ సీన్స్ అన్ని బోర్ కొట్టేసాయి. ఏదైమైనా ‘ఖైదీ’ చూసిన కళ్లతో ...‘మాస్టర్’ని చూస్తే మొట్టబుద్దవుతుంది.
బాగున్నవి:: స్టోరీ బ్యాక్ గ్రౌండ్ విజయ్ స్టైల్స్ ప్రీ ఇంటర్వెల్ సీన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ ,దానికిఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విజయ్ సేతుపతి ఫెరఫార్మెన్స్, ఫైట్స్
బాగోలేనవి:: బోర్ కొట్టేంచేంత రన్ టైమ్ రొటీన్ క్లైమాక్స్ నీరసంగా నడిచే కథనం
దర్శకత్వం,మిగతా విభాగాలు:: విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్, లుక్స్.. పెర్ఫామెన్స్ స్టైలిష్ గా బాగున్నాయి. యాక్షన్ సీన్స్ లో ..సాంగ్స్ లో విజయ్ ఫ్యాన్స్ కోసం కష్టపడిన విధం కనపడుతుంది.మాళవిక మోహన్ కు చెప్పుకుటేనంత సీన్స్ లేవు..సీనూ లేదు. ఇక విజయ్ సేతుపతి నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది. అందరినీ డామినేట్ చేసేసాడు. అతని డైలాగ్స్ కే విజిల్ వేయాలనిపిస్తుంది. జువైనల్ హోంలో ఖైదీగా అర్జున్ దాస్ నటన బాగుంది.
దర్సకుడుగా లోకేషన్ కనకరాజు..స్టార్ ని డీల్ చేయటంలో తేలిపోయాడనే చెప్పాలి. తన మార్క్ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. రొటీన్ మాస్ మసాలా ఎంటర్టైనర్ ని తీర్చిదిద్దాడు. విజయ్ ఫ్యాన్స్ కు సినిమా నచ్చితే చాలు అనుకునేటట్లు సీన్స్ డిజైన్ చేసాడు. ఇంతోటి దానికి తనే ఎందుకు... విజయ్ తో సినిమాలు చేసే ఏ డైరక్టర్ అయినా సరిపోతాడనే విషయం మర్చిపోయాడు.
టెక్నికల్ గా..:: ఈ సినిమాకు అనిరిధ్ అందించిన సంగీతం ఆల్రెడీ పాపులర్ అయ్యిందే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదరకొట్టాడు. విజయ్ సేతుపతి వచ్చినప్పుడు ఇచ్చే స్కోర్ అయితే హాంట్ చేస్తుంది. మిగతా టెక్నికల్ డిపార్మెంట్ కూడా బాగా కష్టపడింది. సినిమాటోగ్రఫీ బాగుంది, ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్ చేసి ,ట్రిమ్ చేసి ఉంటే ఆడియన్స్ కొద్దిలో కొద్ది రిలీఫ్ ఫీలవుదురు.
ఫైనల్ థాట్ :: సర్లేగానీ..జేడి, భవాని పేర్లు, కాలేజీ ఎలక్షన్స్..,కుర్రాళ్లని ఉపయోగించుకుని విలన్ భవాని క్రైమ్స్ చేయటం వంటవి చూస్తూంటే వర్మ 'శివ ' గుర్తుకురావటం లేదూ. Rating:2 ---సూర్య ప్రకాష్ జోశ్యుల
ఎవరెవరు..:: నటీనటులు: విజయ్, విజయ్ సేతుపతి, మాళవిక మోహనన్, భాగ్యరాజ్, అర్జున్ దాస్, నాజర్, రమ్య సుబ్రమణియన్ తదితరులు సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్ సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్ ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్ నిర్మాత: జేవియర్ బ్రిట్టో కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: లోకేశ్ కనకరాజ్ బ్యానర్: ఎక్స్‌బీ ఫిల్మ్ క్రియేటర్స్, సెవెన్ స్క్రీన్స్ స్టూడియో, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ విడుదల: 13-01-2021