త్రివిక్రమ్ మాటలు, సినిమాలు విన్నప్పుడు, చూసినప్పుడు మామూలుగానే అనిపిస్తాయి. కానీ ఆ తర్వాత నెమ్మదిగా మనలోకి ఎక్కుతుంటాయి. మాటల మాంత్రికుడిగా పాపులర్ అయిన త్రివిక్రమ్ దర్శకుడిగా గత కొన్ని సినిమాల నుంచి ఓ సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నాడు. అదే ఇద్దరు హీరోయిన్ల సెంటిమెంట్.
అవును `జల్సా` సినిమా నుంచి ఆయన ఇద్దరు హీరోయిన్ల సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నారు. ఒకరు బాగా క్రేజ్ ఉన్న స్టార్ హీరోయిన్, మరొకరు కాస్త తక్కువ పేరున్న హీరోయిన్‌ని తీసుకోవడం సెంటిమెంట్‌గా ఫాలో అవుతున్నాడు. ఇది ఆయన సెంటిమెంట్‌గా భావిస్తున్నాడో లేక, గ్లామర్ పరంగా ఆడియెన్స్ ని కనువిందు చేయాలని భావిస్తున్నాడో తెలియదుగానీ, ఇద్దరు హీరోయిన్లు అనేది త్రివిక్రమ్ సెంటిమెంట్ అనే ముద్ర పడిపోయింది.
`జల్సా` సినిమాలో పవన్ సరసన ఇలియానా మెయిన్ హీరోయిన్ అయితే, ఆ గ్లామర్ సరిపోలేదనుకునే వారికి కమలిని ముఖర్జీ రూపంలో కాసేపు యాడ్ చేశాడు. అలాగే పార్వతి మెల్టన్‌కి కూడా ఓ పాత్ర ఇచ్చి గ్లామర్ పరంగా అభిమానులను ఖుషీ చేశారు. ఓ ఇమేజ్ ఉన్న స్టార్ హీరో ముందు హీరోయిన్లు ఆనరు. అందుకేనేమో త్రివిక్రమ్ ఇలా ఇద్దరు, అవసరమైతే ముగ్గురిని చూపిస్తున్నాడు.
`ఖలేజా`, `జులాయి` చిత్రాల్లో ఆ సెంటిమెంట్‌ని పక్కన పెట్టేశాడు మాటల మాంత్రికుడు. కానీ `అత్తారింటికి దారేదీ`లో మళ్లీ రిపీట్ చేశారు. ఇందులో పవన్ సరసన మెయిన్ లీడ్‌గా సమంతని, రెండో హీరోయిన్‌గా ప్రణీతా సుభాష్‌ని తీసుకున్నాడు. అయితే మొదట ఇద్దరు హీరోయిన్లు హీరో చుట్టూ తిరుగుతున్నట్టు చూపించి, చివరికి వేరే నటుడితో సెకండ్ హీరోయిన్‌కి ముడిపెట్టేస్తుంటాడు. ఇందులోనూ అలానే చేశాడు త్రివిక్రమ్.
ఆ తర్వాత `సన్నాఫ్ సత్యమూర్తి`లో ఏకంగా ముగ్గురు హీరోయిన్లని దించాడు త్రివిక్రమ్. బన్నీ సరసస సమంత మెయిన్ లీడ్ చేసింది. ఆ తర్వాత నిత్యామీనన్, ఆమెతోపాటు చిన్న గెస్ట్ రోల్‌లో ఆదాశర్మని తీసుకున్నాడు.
అలాగే నితిన్‌తో చేసిన `అ..ఆ` సినిమాలోనూ సేమ్. సమంత మెయిన్ హీరోయిన్. ఆమెతోపాటు అనుపమా పరమేశ్వరన్‌ని దించాడు. ఉన్నది కాసేపే అయినా, కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రే అయినా హీరోయిన్‌ని మించిన క్రెడిట్ కొట్టేసింది అనుపమా పరమేశ్వరన్.
దీంతోపాటు పవన్ కళ్యాణ్‌తో తీసిన `అజ్ఞాతవాసి` చిత్రంలోనూ ఇద్దరు హీరోయిన్లనే పెట్టాడు. ఇందులో కీర్తిసురేష్, అను ఇమ్మాన్యుయెల్ నటించారు. కీర్తి కాస్త ట్రెడిషనల్ రోల్ చేస్తే, అనుని గ్లామర్ పరంగా బాగాచూపించారు. కానీ ఈ సినిమా వర్కౌట్ కాలేదు.
ఎన్టీఆర్‌తో చేసిన `అరవింద సమేత`లోనూ ఇద్దరు హీరోయిన్లు. ఇందులో పూజా హెగ్డే, ఈషారెబ్బాలను తీసుకున్నాడు. పూజా మెయిన్ ఫీమేల్ లీడ్ చేస్తే, ఆమెకి చెల్లిని రెండో హీరోయిన్‌గా ఈషా చేసింది. ఇందులోనూ ఈషా కూడా బాగానే ఆకట్టుకుంది.
మరోవైపు గతేడాది బన్నీతో చేసిన `అల వైకుంఠపురములో` సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్లు మెరిశారు. మెయిన్ హీరోయిన్‌గా పూజా హెగ్డే చేస్తే, సెకండ్ హీరోయిన్‌గా నివేదా పేతురాజ్ నటించింది. అయితే ఇందులోనూ చివరికి నివేదాని సుశాంత్‌కి ముడిపెట్టాడు.
ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి ఆ సెంటిమెంట్‌ని మహేష్ సినిమా విషయంలో రిపీట్ చేస్తున్నాడు. ఇదే నిజమైతే మహేష్‌తో గ్లామర్ సెంటిమెంట్ ఇదే ఫస్ట్ టైమ్ కాబోతుంది.
గతంలో చేసిన `అతడు`, `ఖలేజా`లో ఇద్దరు హీరోయిన్లు లేరు. కానీ త్వరలో తెరకెక్కించబోతున్న సినిమాలో మాత్రం ఇద్దరు హీరోయిన్లని రిపీట్ చేయబోతున్నాడు. ఇందులో ఓ హీరోయిన్‌గా మాళవిక మోహనన్ పేరు వినిపిస్తుంది.
మరోవైపు పూజా హెగ్డే పేరు, అలాగే ఓ బాలీవుడ్ బ్యూటీ జాన్వీని కూడా దించాలనుకుంటున్నారట. ఈ ముగ్గురిలో ఒకరు మెయిన్ లీడ్‌గా, నివేదా థామస్‌ని రెండో హీరోయిన్‌గా తీసుకోవాలనుకుంటున్నారట. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.