బిగ్ బాస్ సీజన్ 5 రన్నరప్ షణ్ముఖ్, అతడి సోదరుడు సంపత్ గంజాయితో పోలీసులకు దొరకడం సంచలనంగా మారింది. ఊహించని పరిణామాల మధ్య వీళ్ళిద్దరూ పోలీసులకు చిక్కారు. షణ్ముఖ్ సోదరుడు మౌనిక అనే అమ్మాయిని కొద్ది రోజుల్లో ఫిబ్రవరి 28న పెళ్లి చేసుకోవాల్సి ఉంది. కానీ అతడు మరొక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు.
తనకి కాబోయే భర్త ఇలా చీటింగ్ చేయడంతో మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో సంపత్ ని అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులకు షణ్ముఖ్ కూడా గంజాయితో దొరికేశాడు.అయితే ఈ కేసులో ప్రస్తుతం షణ్ముఖ్ పరిస్థితి ఉత్కంఠ కలిగిస్తోంది. షణ్ముఖ్ తరపున ప్రముఖ న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర వాదిస్తున్నారు.
తీవ్ర ఉత్కంఠ నడుమ షణ్ముఖ్ కి డ్రగ్స్ కేసులో బెయిల్ మంజూరు అయింది. ఈ మేరకు కళ్యాణ్ దిలీప్ సుంకర పోస్ట్ చేశారు. అయితే గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయితే బెయిల్ ఎలా మంజూరు అయింది అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. షణ్ముఖ్ కి, అతడి సోదరుడు సంపత్ కి వైద్య పరీక్షలు నిర్వహించగా కొంతకాలంగా వీరిద్దరూ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తేలినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ కేసులో అసలు ఏం జరిగిందో అనే వివరాలు ఒకసారి పరిశీలిస్తే.. షణ్ముఖ్, అతడి సోదరుడు సంపత్ హైదరాబాద్ లోని పుప్పాలగూడలో నివాసం ఉంటున్నారు. షణ్ముఖ్ ద్వారా సంపత్ కి వైజాగ్ కి చెందిన మౌనిక అనే వైద్యురాలితో పరిచయం ఏర్పడింది. ఆమె గీతూ రాయల్ కి కూడా స్నేహితురాలు. సంపత్, మౌనిక పరిచయం ప్రేమగా మారింది. గత ఏడాదే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
ఎట్టకేలకు ఈ ఏడాది ఫిబ్రవరి 28న పెళ్లి ఫిక్స్ అయింది. కానీ అదే సమయానికి తమ కొడుక్కి మరో యువతితో పెళ్లి చేస్తున్నట్లు సంపత్ తల్లిదండ్రులు మౌనికకి చెప్పారట. దీనితో మౌనిక తాను మోసపోయానని తెలుసుకుంది. ఆల్రెడీ సంపత్ కి వేరే యువతితో సంబంధం ఉన్నట్లు గ్రహించింది. దీనితో మౌనిక సహించలేక గురువారం రోజు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీనితో పోలీసులు సంపత్ ఫ్లాట్ కి వెళ్లారు. కానీ అక్కడ అనూహ్యంగా షణ్ముఖ్ డ్రగ్స్ తో దొరికిపోయాడు. దీనితో ఈ కేసు మరో మలుపు చోటు చేసుకుంది. అక్కడ షణ్ముఖ్ కాసేపు పోలీసులతో దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.
అయితే పోలీసులు చెబుతున్న దాని ప్రకారం షణ్ముఖ్ వద్ద దొరికిన గంజాయి మోతాదు చాలా తక్కువ. తక్కువైనా ఎక్కువైనా నేరం నేరమే. ఇది డ్రగ్స్ కి సంబంధించిన వ్యవహారం. అలాగే షణ్ముఖ్ సోదరుడిపై మౌనిక చేసిన ఫిర్యాదు మేరకు కూడా చర్యలు తీసుకుంటాం అని పోలీసులు చెబుతున్నారు. వీళ్ళిద్దరిది వైజాగ్ కాబట్టి కేసు వైజాగ్ పరిధిలోకి వస్తే అక్కడికి బదిలీ చేస్తాం అని పోలీసులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా షణ్ముఖ్ తరపున న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర మాత్రం.. అతడు డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని అంటున్నారు. అక్కడున్న ప్రత్యక్ష సాక్షిని విచారించగా షణ్ముఖ్ కి డ్రగ్స్ తో సంబంధం లేదని చెబుతున్నారు. అయితే మీడియాలో డ్రగ్స్ వాడినట్లు వస్తున్న వార్తల్లో క్లారిటీ లేదని కళ్యాణ్ దిలీప్ చెబుతున్నారు. మొత్తంగా షణ్ముఖ్ కి బెయిల్ లభించడం కొంత ఊరటే అని చెప్పొచ్చు.