మణిరత్నం గతేడాది రూపొందించిన హిస్టారికల్ విజువల్ వండర్ `పొన్నియిన్ సెల్వన్`(పీఎస్ 1) ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు. తమిళనాడు చరిత్రకి చెందిన కథ కావడంతో తెలుగుతో సహా ఇతర భాషల వారికి పెద్దగా అర్థం కాలేదు. దీంతో అది తమిళంకే పరిమితమయ్యింది. ప్రారంభం నుంచి ఈ సినిమాని రెండు పార్ట్ లుగా తెరకెక్కించారు మణిరత్నం. `పీఎస్1`కి కొనసాగింపుగా `పీఎస్2`ని రూపొందించారు. హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన రెండో పార్ట్ `పీఎస్ 2` నేడు శుక్రవారం( ఏప్రిల్ 28న) ఈ సినిమా పాన్ ఇండియా తరహాలో విడుదలైంది. మొదటి భాగంలో నటించిన విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష, శోభితా దూళిపాల, ఐశ్వర్య లక్ష్మి, శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, రెహమాన్ వంటి ప్రధాన తారాగణం రెండో పార్ట్ లోనూ భాగమయ్యారు. మరి సినిమా మెప్పించిందా? లేక మొదటి భాగం లాగే కన్‌ఫ్యూజ్ చేసిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథః
లంక నుంచి తిరిగి ఛోళారాజ్యానికి బయలు దేరే క్రమంలో అరుణ్ మోళి(పొన్నియిన్ సెల్వన్-జయం రవి), వల్లవరాయ(కార్తి)లపై రాణి నందిని పంపిన శత్రువులు సముద్రంలో దాడి చేస్తారు. దీంతో పొన్నియిన్, వల్లవరాయ నీటిలో మునిగిపోతారు. సముద్రం నుంచి పొన్నియిన్ సెల్వన్‌ని వన దేవత(సీనియర్ ఐశ్వర్య) కాపాడుతుంది. కానీ పొన్నియిన్ సెల్వన్ చనిపోయాడనే వార్త రాజ్యానికి చేరుతుంది. ఇదే అదనుగా మధురాంతకుడు(రెహమాన్) ఛోళ సామ్రాజాన్యి తన సొంతం చేసుకునేందుకు శత్రువుల అండకు చేరతాడు. మరోవైపు పొన్నియిన్ సెల్వన్‌ని బౌద్ధ ఆశ్రమంలో ఉంచి ఆయన్ని కాపాడతాడు వల్లవరాయ. ఇంకో వైపు ఆదిత్య కరికాలుడు(విక్రమ్), ఛోళ చక్రవర్తి సుందర ఛోళుడు(ప్రకాష్ రాజ్), కుందవై(త్రిష)లకు పొన్నియిన్ బతికే ఉన్నాడనే సమాచారం అందిస్తారు వల్లవరాయ. పాండ్య రాజు వీర పాండియన్‌ని చంపిన ఆదిత్య కరికాలుడుని, సుందర ఛోళుడు, కుందవైలను చంపేందుకు నందిని(ఐశ్వర్య రాయ్) కుట్ర పన్నుతుంది. పాండ్యవులతో చేతులు కలిపి పథక రచన చేస్తుంది. నందినిపై ఉన్న ప్రేమతో ఆదిత్య కరికాలుడు తనకు ప్రాణహాని ఉందని తెలిసినా ఆమె వద్దకు వెళ్తాడు? మరి తన ముందు నిలిచిన ఆదిత్య కరికాలుడిని నందిని చంపిందా? ఛోళరాజ్య సింహాసనం అధిష్టించాలన్న మధురాంతకుడి కల నెరవేరిందా? ఇంతకి పొన్నియిన్ సెల్వన్‌ని కాపాడిన ఆ వన దేవత ఎవరు? నందిని ఎవరు? అంతిమంగా `పీఎస్2` కథలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి? ఎలాంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయనేది మిగిలిన కథ.
విశ్లేషణః
`పొన్నియిన్ సెల్వన్` కల్కి రాసిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా దర్శకుడు మణిరత్నం రూపొందించారు. మొదటి భాగంలో పాత్రలని ఎస్టాబ్లిష్ చేయడానికి టైమ్ తీసుకున్నారు. పైగా మనకి పెద్దగా తెలియని కథ కావడం, పాత్రలు పేర్లు విచిత్రంగా ఉండటంతో మొదటి భాగం చాలా వరకు అర్థం లేదు. దీంతో చాలా విమర్శలు, నెగటివిటీ వచ్చింది. దాన్ని దర్శకుడు మణిరత్నం దృష్టిలో పెట్టుకున్నట్టుంది. రెండో భాగంపై చాలా కేర్ తీసుకున్నారు. కథనాన్ని చాలా నీట్‌గా సాగేలా జాగ్రత్తలు పడ్డారు. కన్ ఫ్యూజన్‌కి తెరపడేలా కథ, కథనాలను తీసుకెళ్లాడు. దీంతో పాత్రల తీరుతెన్నులు, అవి సాగే తీరు, పాత్రల మధ్య సంఘర్షణ, కథ నడిచే తీరు మొదటి భాగంతో పోల్చితే చాలా వరకు ఆడియెన్స్ కి అర్థమయ్యేలా సాగుతాయి. `పీఎస్ 2` విషయంలో మణిరత్నం సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అయితే మొదటి భాగం చూసిన వారికే రెండో భాగం అర్థమవుతుంది.
చాలా వరకు సినిమాని ఎమోషనల్‌గా నడిపించాడు దర్శకుడు. పాత్రల మధ్య బాండింగ్‌ని ఎస్లాబ్లిష్ చేశాడు. దీనికి సంబంధించిన అనుబంధాలు, భావోద్వేగాలకు పెద్దపీట వేశారు. అదే ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. ముఖ్యంగా రెండో భాగంలో విక్రమ్, ఐశ్వర్య రాయ్ ప్రేమ కథ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. హృదయాన్ని తాకేలా ఉంటుంది. ఈ ఇద్దరి కలిసినప్పుడు వచ్చే ఫీల్ పీక్‌లో సాగుతుంది. దీంతో గుండె బరువెక్కుతుంది. మరోవైపు కార్తి, త్రిష ప్రేమ సన్నివేశాలు కూడా అద్బుతమైన ఫీల్‌ని కలిగిస్తాయి. వీటికితోడు ప్రకాష్ రాజ్, సీనియర్ ఐశ్వర్య రాయ్ మధ్య వచ్చిన సీన్లు సైతం అదే ఫీలింగ్‌ని తీసుకెళ్తాయి. ఆడియెన్స్ ని కథ లోపలికి తీసుకెళ్లిన ఫీలింగ్ కలిగిస్తాయి. ఈ సన్నివేశాలు సినిమాకి మెయిన్ హైలైట్‌గా నిలిచాయి. కార్తి కామెడీ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ. జయరాం, కార్తిల మధ్య సీన్లు నవ్వులు పూయిస్తాయి. సినిమా అసలు కథ మొత్తం రెండో భాగంలోనే ఉండటంతో స్క్రీన్ ప్లే చాలా టైట్‌గా సాగుతుంది. ఎక్కడా ఆడియెన్స్ కథ నుంచి బయటకు రానివ్వకుండా ఉంటుంది. మరోవైపు విక్రమ్ మరణించిన అనంతరం వచ్చే సన్నివేశాలు గుండెల్ని బరువెక్కిస్తాయి. ఎమోషన్స్ ని పీక్‌లోకి తీసుకెళ్తాయి.
నిజానికి విక్రమ్ పాత్ర చనిపోవడంతోనే సినిమా అయిపోయిందనిపిస్తుంది. కానీ మళ్లీ అరగంట వరకు కథ సాగడం, పైగా అది కన్విన్సింగ్‌గా లేకపోవడంతో పెద్దగా ఎక్కలేదు. చరిత్ర కావడంతో ఆయా సన్నివేశాలు చూపించాలని చూపించారు తప్పితే, కథలో పెద్దగా ఇంపార్టెంట్‌గా అనిపించలేదు. ఈ `పీఎస్2` లో.. ఫస్టాఫ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. కానీ సెకండాఫ్‌లో కథ ఎంత సేపు అక్కడక్కడే తిరిగినట్టు ఉంటుంది. అక్కడ దర్శకుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇది కన్‌ఫ్యూజన్‌కి దారితీస్తుంది. దీంతో చాలా బోర్ ఫీలింగ్‌ని తెప్పిస్తాయి. కథనం స్లోగా సాగే తీరు కూడా బోర్ కి కారణమవుతుంది. సెకండాఫ్‌ని అంతే క్రిస్పీగా తీసుకెళ్లడంలో మణిరత్నం విఫలమయ్యాడు. క్లైమాక్స్, వార్ సీన్లు కూడా అంతగా ఆకట్టుకునేలా లేవు. ఏదో ముగింపు కోసం ఉన్న సీన్ల మాదిరిగానే ఉండటం సినిమాకి మైనస్. మొదటి భాగం మాదిరిగానే రెండో భాగాన్ని తెరకెక్కించి ఉంటే కచ్చితంగా ఇది నెక్ట్స్ సినిమా అయ్యేది. అయితే విజువల్ పరంగా సినిమా వండర్‌గా తీర్చిదిద్దారు. అదే బిగ్గెస్ట్ అసెట్. పాటలు ఫర్వాలేదు, కానీ గుర్తిండిపోయేవి కావు. బీజీఎం సినిమాకి మరో ప్లస్. అదే సినిమా ఎమోషన్స్ ని డ్రైవ్ చేసింది.
నటీనటులుః
ఆదిత్య కరికాలుడి పాత్రలో విక్రమ్ ఒదిగిపోయారు. పాత్రలో జీవించి చివరగా కన్నీళ్లు పెట్టించాడు. సినిమాకి ఇదే ప్రాణం. మరోవైపు కార్తి వల్లవరాయగా ఎంటర్‌టైన్‌మెంట్‌ని పంచుతూనే తనదైన నటనతో, యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకున్నాడు. ఎంటర్‌టైన్‌మెంట్ పార్ట్ ని తీసుకున్నాడు. పొన్నియిన్ సెల్వన్‌గా జయం రవి బాగా చేశాడు. మరోవైపు నందినిగా ఐశ్వర్య రాయ్ అందరి హృదయాలను కొల్లగొట్టింది. సెకండ్ పార్ట్ లో ఆమె పాత్రనే హైలైట్. కుందవైగా త్రిష పాత్రకి పెద్దగా స్కోప్ దొరకలేదు. కానీ మెప్పించింది. ప్రకాష్ రాజ్, జయరాం, రెహమాన్, ప్రభు, శరత్ కుమార్, శోభితా, ఐశ్వర్య లక్ష్మి వంటి వారు పాత్రల మేరకు మెప్పించారు. పాత్రలో ఒదిగిపోయారు.
టెక్నీకల్‌గాః
టెక్నీకల్‌గా సినిమా చాలా బ్రిలియంట్ అని చెప్పాలి. మణిరత్నం ఈ సినిమాపై చాలా కేర్ తీసుకున్నారని, చాలా శ్రమించారని అర్థమవుతుంది. అయితే ఇంకాస్త క్లారిటీగా ట్రై చేస్తే ఇది తమిళంలోనే కాదు, పాన్ ఇండియా లెవల్‌లోనూ ఒకేలా కనెక్ట్ అయ్యేది. ఈ ఏడాది సంచలనాత్మక చిత్రాల్లో ఒకటిగా నిలిచేది. రెహ్మాన్ బీజీఎం సినిమాకి మరో అసెట్. అలాగే రవివర్మన్ కెమెరా, విజువల్ అద్భుతం. ఆ చరిత్రలోకి ఆడియెన్స్ ని తీసుకెళ్లారు. కథతో ట్రావెల్ అయ్యేలా చేయడంలో కెమెరా వంద శాతం సక్సెస్ అయ్యింది. ఇక తోటతరణి ఆర్ట్ వర్క్ ఎక్స్ టార్డినరి. ఎడిటింగ్‌పై ఇంకా ఫోకస్ పెట్టాల్సింది. ఓ పది పదిహేను నిమిషాలు కట్ చేస్తే ఇంకా బాగుండేది. నిర్మాణ విలువలకు పేరు పెట్టేదేం లేదు.
ఫైనల్‌గాః ఓపికతో చూడాల్సిన హిస్టారికల్ ఎమోషనల్ డ్రామా. మణిరత్నం మార్క్ విజువల్ ట్రీట్.
రేటింగ్‌ః 2.75
నటీనటులు : విక్రమ్, 'జయం' రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, శోభితా ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మి, ప్రకాష్ రాజ్, పార్థిబన్, ప్రభు, జయరామ్, విక్రమ్ ప్రభు, శరత్ కుమార్, రెహమాన్, లాల్, నాజర్, కిశోర్ తదితరులు.
కథ : కల్కి కృష్ణమూర్తి 'పొన్నియిన్ సెల్వన్' నవల
మాటలు : తనికెళ్ళ భరణి (తెలుగులో)
పాటలు : అనంత శ్రీరామ్ (తెలుగులో)
కెమెరా : రవి వర్మన్
సంగీతం: ఏఆర్ రెహమాన్
తెలుగులో విడుదల : దిల్ రాజు( శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ )
నిర్మాతలు : మణిరత్నం, సుభాస్కరన్
దర్శకత్వం : మణిరత్నం