తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రస్థాయి నటుడు, మెగాస్టార్ (Chiranjeevi)కి గణతంత్ర దినోత్సవం (Republic Day celebrations)సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మ విభూషణ్’ Padma Vibhushan Awardను ప్రకటించింది. నిన్న రాత్రి 2024 పద్మ పురస్కారాలను (Padma Awards 2024) జాబితాను వెల్లడించారు. ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్ తో పాటు 110 మందికి పద్మశ్రీ అవార్డులు అందాయి.
పద్మవిభూషణ్ అందుకున్న ప్రముఖుల్లో ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఒకరు కావడం అభిమానులకు పట్టలేని ఆనందాన్ని ఇస్తోంది. ఆయన నాలుగు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమకు సేవలు అందిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ పై ఆయన తిరుగులేని స్టార్ డమ్ అనుభవించారు. అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన్ని అనేక అవార్డులు, రివార్డులు వరించాయి.
భారత ప్రభుత్వం 2006లో మూడవ అతిపెద్ద పౌర పురస్కారం అయిన పద్మ భూషణ్ తో చిరంజీవిని సత్కరించింది. అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా చిరంజీవి పద్మభూషణ్ Padma Bhushan అవార్డు అందుకున్నారు. ఇక కరోనా సమయంలో మెగా స్టార్ చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించింది.
2024 పద్మ అవార్డుల్లో మెగాస్టార్ కి పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. చిరంజీవి కూడా స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. మరింత బాధ్యత పెరిగిందని, దేశంలో రెండో అత్యున్నత పౌరపురస్కారం తనకు లభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇక చిరంజీవి జర్నీ మొదటి నుంచి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండింది.
1955 ఆగస్టు 22న జన్మించారు చిరంజీవి. ఆయన అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. వృత్తి పరంగా తన పేరును చిరంజీవిగా మార్చుకున్నారు. తొలుత మద్రాసులోని ఒక నటనా సంస్థలో శిక్షణ పొందాడు. తర్వాత సినిమాల్లోకి ప్రవేశించి నెంబర్ స్టార్ గా ఎదిగారు. 1978లో ‘పునాదిరాళ్ళు’ సినిమాతో తన నట జీవితాన్ని ప్రారంభించారు. ‘ఖైదీ’ సినిమా స్టార్‌డమ్‌ని తెచ్చిపెట్టింది.
1992లో విడుదలైన “ఘరానా మొగుడు” బాక్సాఫీస్ కలెక్షన్లలో 10 కోట్ల రూపాయలను అధిగమించిన తొలి తెలుగు చిత్రంగా మెగాస్టార్ సినిమా నిలిచింది. ఈ విజయం ఆ సమయంలో భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడి హోదాకు చిరంజీవి ఎదిగారు. నేషనల్ మీడియా చిరును అప్పట్లో ప్రశంసించింది. ఇక ప్రజా సేవకూ అంకితమయ్యారు.
2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి 2009 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీచేశారు. కొన్ని కారణాల వల్ల 2014లో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. 1998లో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ (CCT)ని కూడా స్థాపించారు. దాంతో చాలా మందికి సేవలు చేస్తున్నారు. మొన్నటి కరోనా సమయంలోనూ సినీ ఆర్టిస్టులకు సేవలందించారు.
అవార్డుల విషయానికొస్తే... బెస్ట్ యాక్టర్ గా మూడు నంది అవార్డులు అందుకున్నారు. 2006లో ఆయనని ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్ తో సత్కరించింది. అదే ఏడాది కేంద్ర ప్రభుత్వం ‘పద్మ భూషణ్’ను ప్రకటించింది. తాజాగా ‘పద్మ విభూషణ్’ వరించింది. 2022లో 53వ IFFIలో IFFI ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. ఇలా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను అందుకున్నారు. మరింత స్ఫూర్తినిచ్చేలా ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి ‘మెగా156’ చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు.