రంగ్ దే యూఎస్ ప్రీమియర్ రివ్యూ

First Published | Mar 26, 2021, 8:27 AM IST

హీరో నితిన్, కీర్తి సురేష్ కాంబినేషన్ లో దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ రంగ్ దే. ఈ మూవీ టీజర్స్, ట్రైలర్స్ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. హీరో నితిన్ తో పాటు, దర్శక నిర్మాతలు మూవీ హిట్ కావడం ఖాయం అంటూ భరోసాగా మాట్లాడటం జరిగింది. 
 

రంగ్ దే మూవీ కథ విషయానికి వస్తే... చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన అర్జున్(నితిన్) అను(కీర్తి సురేష్) లకు ఒకరంటే మరొకరికి అసలు పడదు. వీళ్ళ మధ్య ఎప్పుడూ ఇగో వార్ నడుస్తూ ఉంటుంది. ఒకరిపై మరొకరు పై చేయి సాధించడానికి, రివేంజ్ తీర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. చదువు, కెరీర్ విషయంలో ఇద్దరి మధ్య యుద్ధం నడుస్తున్నా, అను మాత్రం అర్జున్ పై ప్రేమ పెంచుకుంటుంది. ఈ క్రమంలో కుటుంబం ఒత్తిడి మేరకు తనకు ఏమాత్రం ఇష్టం లేని అనును అర్జున్ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. మరి టామ్ అండ్ జెర్రీ కథలో కపుల్ గా అర్జున్, అను ఎలా బంధాన్ని కొనసాగించారు? భార్య భర్తలుగా వీరి కథ ఎలా ముగిసింది? అనేది మిగతా స్టోరీ...
ప్రయోగాలు చేసిన ప్రతిసారి నితిన్ ప్రతికూల రిజల్ట్ అందుకుంటున్నారు. గతంలో ఆయన చేసిన లై, ఇటీవల విడుదలైన చెక్ అందుకు నిదర్శనం. నితిన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా ఉన్న అ ఆ, ఇష్క్ మరియు గుండెజారి గల్లంతయ్యిందే... రొమాంటిక్ అండ్ కామెడీ జోనర్ లో తెరకెక్కాయి. రంగ్ దే సైతం అదే జోనర్ లో తెరకెక్కింది. దర్శకుడు వెంకీ ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ, రొమాన్స్ తో నడిపించే ప్రయత్నం చేశారు. సెకండ్ హాఫ్ మాత్రం ఫ్యామిలీ ఎమోషన్స్ తో అను, అర్జున్ ల కథను సుఖాంతం చేయాలని అనుకున్నాడు.

నితిన్, అర్జున్ ల మధ్య వచ్చే సన్నివేశాలు, ఫస్ట్ హాఫ్ లో కామెడీ ఆకట్టుకున్నాయి. నితిన్, కీర్తి మధ్య రొమాన్స్ తో పాటు, కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. భార్య భర్తలుగా నితిన్, కీర్తి జంట చాలా బాగున్నారు. నితిన్ తో పాటు కీర్తి నటన అద్భుతం అని చెప్పాలి. కమెడియన్ అభినవ్ మరియు సీనియర్ నటుడు నరేష్ తమ నటనతో సినిమాకు మంచి సపోర్ట్ ఇచ్చారు.
రంగ్ దే మూవీలో ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నప్పటికీ ఇది రొటీన్ కథ కావడం పెద్ద మైనస్ గా నిలిచింది. ఎటువంటి మలుపులు లేని రంగ్ దే మూవీ గొప్ప అనుభూతిని పంచలేకపోయింది. ఫ్లాట్ అండ్ స్లో నేరేషన్ ఇబ్బంది పెట్టాయి.  రంగ్ దే నెక్స్ట్ సీన్ ఏమిటో ప్రేక్షకుడికి ఇట్టే అర్థం అయిపోతుంది. పాత కాలపు అదే పచ్చడిని కొత్త జాడీలో వడ్డించినట్లు ఉంది రంగ్ దే  తీరు.  తొలి ప్రేమ లాంటి సినిమా తీసిన దర్శకుడు నుండి ఇలాంటి సినిమా ప్రేక్షకులు ఆశించలేదు.
ఇక తన మ్యూజిక్ తో సినిమా విజయంలో కీలక రోల్ పోషించే దేవిశ్రీ పాటలు, మ్యూజిక్ నిరాశ పరిచాయి. ఒకటి రెండు సాంగ్స్ పర్వాలేదనిపించినా, మొత్తంగా సినిమా మ్యూజిక్ ఆకట్టుకోలేదు. పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ మాత్రం అలరిస్తుంది.
మొత్తంగా రంగ్ దే మూవీ రొటీన్ స్టోరీతో వచ్చిన రొమాంటిక్ కామెడీ చిత్రం. అక్కడక్కడా నవ్వులు, చివర్లో కొన్ని ఎమోషన్స్ ఆకట్టుకున్నాయి. కీర్తి, నితిన్ నటన సినిమాకు ప్లస్ అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ప్రేక్షకుల టాక్ యావరేజ్ అని వినిపిస్తున్నా.. యూత్ తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులు నచ్చే అంశాలు ఉన్న నేపథ్యంలో రంగ్ దే బాక్సాఫీస్ వద్ద పుంజుకునే అవకాశమ్ కలదు. అదే సమయంలో రోటీన్ సినిమా అని ప్రేక్షకులు పక్కన పెట్టేసే అవకాశం కూడా లేకపోలేదు.

Latest Videos

click me!