రాజమౌళి రూపొందించిన అద్భుత కళాఖండం `ఆర్‌ఆర్‌ఆర్` విజయవంతంగా రన్ అవుతుంది. ఇది మూడు రోజుల్లోనే ఐదు వందల కోట్లు వసూలు చేసి విజయవంతంగా రన్ అవుతుంది. ఐదు రోజుల్లో ఇది దాదాపు ఆరు వందల కోట్ల(గ్రాస్)కి రీచ్ అయినట్టు ట్రేడ్ వర్గాల టాక్. అయితే క్రమంగా కలెక్షన్లు దారుణంగా పడిపోతున్నాయి. ఇప్పటికే సినీ ప్రియులంతా సినిమాని చూసేశారు. దీంతో కలెక్షన్లు తగ్గుతూ వస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ పాత్రల తర్వాత బాగా పాపులర్ అయిన రోల్ `మల్లి` పాత్ర. నిజానికి `ఆర్‌ఆర్‌ఆర్` మొత్తం ఈ అమ్మాయి చుట్టూతే నడుస్తుంది. సినిమా కథ ప్రారంభం `మల్లి` పాత్రతోనే కాగా, ముగింపు కూడా ఆమెని బ్రిటీషర్ల నుంచి తీసుకురావడంతో జరుగుతుంది. ఆ అమ్మాయి కోసమే అటు కొమురంభీమ్‌గా ఎన్టీఆర్, ఎన్టీఆర్ కోసం, మల్లి కోసం అల్లూరిగా రామ్‌చరణ్ పోరాడతారు.
అంతగా పాపులారిటీ సొంతం చేసుకున్న `మల్లి` పాత్రలో నటించిన ఆ చిన్నారి ఎవరనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఆమె గురించి తెలుసుకునేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. గూగుల్‌లో బాగా సెర్చింగ్ చేస్తున్నారు. దీంతో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
మల్లి పాత్రలో నటించిన బాలనటి పేరు ట్వింకిల్ శర్మ. ఆమె ఛండీగర్ రాష్ట్రానికి చెందిన బాల నటిగా కావడం విశేషం. డాన్స్ ఇండియా డాన్స్ రియాలిటీ షోతో బాగా పాపులారిటీని పొందింది. అయితే ఆమె ఫ్లిప్‌కార్డ్ యాడ్ కూడా చేసింది. ఇందులో ట్వింకిల్ శర్మని చూసిన రాజమౌళి `ఆర్‌ఆర్‌ఆర్` కోసం ఆడిషన్ చేసి మల్లి పాత్రకిగానూ ఎంపిక చేశారు.
`ఆర్‌ఆర్‌ఆర్` సినిమాలో ఆదిలాబాద్ అడవులకు వేట కోసం తన వచ్చిన బ్రిటీష్ గవర్నర్ భార్య చేతికి అద్బుతమైన పెయింటింగ్ వేసి ఆకట్టుకుంటుంది మల్లి. అంతేకాదు ఆమె పాట కూడా అద్భుతంగా పాడుతుంది. దీంతో ఫిదా అయిన గవర్నర్ భార్య ఆ పాప తమతో తీసుకెళ్దామని అడగ్గా, కొద్దిగా డబ్బు ఇచ్చి బలవంతంగా మల్లిని ఢిల్లీలోని తమ బ్రిటీష్ కోటకి తీసుకెళ్తారు.
ఇది తెలిసిన కొమురంభీమ్ ఆ పాపని తీసుకువచ్చేందుకు ఢిల్లీ వెళ్లి బ్రిటీష్ వారితో పోరాడి, ఈ క్రమంలో అల్లూరి పాత్రలో కనిపించే రామ్‌చరణ్‌తో ఫ్రెండ్ షిప్ చేసి, వీరిద్దరు అంతిమంగా ఆ పాపని తీసుకొస్తారు. దీంతో ఇటు పాపని కాపాడాలనే భీమ్ కోరిక, తమ వారికి తుపాకులు ఇవ్వాలనే అల్లూరి ఆశయం నెరవేరడంతో సినిమా ముగుస్తుంది. ఇందులో ఎన్టీఆర్‌తో `నన్ను ఈడ ఇడిసిపోకన్న.. అమ్మా యాదికొస్తోంది` అంటూ ఆ చిన్నారి చెప్పిన డైలాగ్ ప్రేక్షక హృదయాలను కదిలించింది. సినిమా మొత్తంలో అత్యంత ఎమోషనల్ సన్నివేశంగా నిలిచింది.
పాత్ర నిడివి కాసేపే అయినా మల్లిగా అద్భుతంగా నటించి మెప్పించింది ట్వింకిల్ శర్మ. దీంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకుంది. మరి ఈ సందర్భంగా ఆమె బ్యాక్ గ్రౌండ్ చూస్తే మామూలుగా లేదని చెప్పొచ్చు. ఛండీగర్‌కి చెందిన ట్వింకిల్ శర్మ చిన్నప్పటి నుంచే మంచి టాలెంటెడ్.
డాన్స్ ఇండియా డాన్స్ లిటిల్ మాస్టర్‌గా 2014లో పాల్గొని ఆకట్టుకుంది. దీంతోపాటు 2015లో డీహెచ్‌డీ డాన్సు షోలో విన్నర్‌గానూ నిలిచింది. 2016లో ఇండియాస్ బెస్ట్ డ్రామెబాజ్ లో టాప్ 8వ స్థానంలో నిలిచింది. 2017-18ల ఫ్లిప్‌కార్ట్ యాడ్‌లో మెరిసింది. వీటితోపాటు జీ టీవీ ఈవెంట్లలో, స్టార్ ప్లస్‌లో వచ్చే ఇండియాస్ నెక్ట్స్ సూపర్‌స్టార్ ప్రోగ్రామ్‌లో మెరిసింది. అలాగే మరికొన్ని చిన్న చిన్న ఈవెంట్లు, షోలలోనూ డాన్సర్‌గా, నటిగా మెప్పించింది ట్వింకిల్ శర్మ. మొత్తంగా `ఆర్‌ఆర్‌ఆర్`తో ఆమె బిగ్ బ్రేక్‌తోపాటు లైఫ్ వచ్చిందని చెప్పొచ్చు.