`నేను స్టూడెంట్‌ సర్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌.. బెల్లంకొండ హీరో హిట్‌ కొట్టాడా?

First Published | Jun 2, 2023, 2:39 PM IST

`స్వాతిముత్యం` చిత్రంతో మెప్పించిన బెల్లంకొండ గణేష్‌.. ఇప్పుడు `నేను స్టూడెంట్‌ సర్‌` అనే సినిమాతో వచ్చారు. రాకేష్‌ ఉప్పలపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు(జూన్‌ 2న) రిలీజ్‌ అయ్యింది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

నిర్మాత బెల్లంకొండ సురేష్‌ తనయులు బెల్లంకొండ శ్రీనివాస్‌, గణేష్‌ హీరోలుగా రాణించేందుకు ఇంకా స్ట్రగుల్‌ పడుతున్నారు. అందులో చిన్న కొడుకు గణేష్‌ తొలి చిత్రం `స్వాతిముత్యం`తో మెప్పించాడు. ఇప్పుడు `నేను స్టూడెంట్‌ సర్‌` చిత్రంతో వచ్చాడు. కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేస్తున్నాడు. ఈ చిత్రానికి రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు శుక్రవారం(జూన్‌2న) విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందనేది రివ్యూ(Nenu Student Sir Movie Review)లో తెలుసుకుందాం. 
 

కథః
సుబ్బు(బెల్లంకొండ గణేష్‌) యూనివర్సిటీ స్టూడెంట్‌. ఐఫోన్‌ కొనుక్కోవాలనేది అతని డ్రీమ్‌. రాత్రింబవళ్లు కష్టపడి, అనేకరకాల జాబులు చేసి ఎట్టకేలకు ఐఫోన్‌ కొట్టాడు. దాన్ని ఓ తమ్ముడిగా భావిస్తుంటాడు. అంతటి ఇష్టం ఆ ఫోన్‌ అంటే. ఫోన్‌ కొన్న రోజే కాలేజ్‌కి వెళ్లగా, ఆ రోజు కాలేజీలో రెండు గ్రూపుల మధ్య గొడవ కారణంగా పోలీసులు స్టూడెంట్స్ ని అరెస్ట్ చేస్తారు. వారి ఫోన్లన్నీ తీసుకుంటారు. అలా సుబ్బు ఫోన్‌ కూడా పోలీసులు బలవంతంగా తీసుకుంటారు. ఆ తర్వాత తిరిగి ఇచ్చే క్రమంలో సుబ్బు ఐఫోన్‌ మిస్‌ అవుతుంది. ఆ విషయాన్ని ఏకంగా పోలీస్‌ కమిషనర్‌(సముద్రఖని)కే కంప్లెయింట్‌ చేస్తాడు. ఈ క్రమంలో కమిషనర్‌కి, సుబ్బుకి చిన్న వాగ్వాదం జరుగుతుంది. తన ఫోన్‌ కమిషనర్‌ వద్ద ఉందని తెలిసి ఆయన కూతురు శృతి(అవంతిక)ని ప్రేమిస్తాడు. బర్త్ డే రోజు గిఫ్ట్ గా కమిషనల్‌ రివాల్వర్‌ని తీసుకురమ్మని చెప్పగా, ఆమె సుబ్బు కోసం రివాల్వర్‌ తెస్తుంది. ఆ రోజే యూనివర్సిటీ లీడర్‌ ఒకడు పోలీస్‌ కమిషనర్‌ రివాల్వర్‌తో హత్య చేయబడతాడు. ఆ కేసులో సుబ్బుని ఇరికిస్తారు. ఆ కేసుకి, సుబ్బుకి సంబంధమేంటి? ఆ లీడర్‌ని చంపిందెవరు? తన వద్ద ఉన్న కమిషనర్‌ రివాల్వర్‌ కి, ఆ హత్యకి సంబంధం ఉందా? ఈ హత్యకి, సుబ్బుకి, బ్యాంక్‌లో అక్రమాలకు సంబంధమేంటి? ఈ కేసు నుంచి సుబ్బు బయటపడ్డాడా? దొరికిపోయాడా? అనేది మిగిలిన కథ. (Nenu Student Sir Movie Review)
 


విశ్లేషణః

ఒక చిన్న పాయింట్‌కి రకరకాల అంశాలు జోడించి సినిమాగా తీయడం ఇటీవల కామన్‌ అయిపోయింది. ఓటీటీ కాన్సెప్ట్ లు సినిమాలుగా వస్తున్న రోజులివి. `నేను స్టూడెంట్‌ సర్‌` కూడా అలాంటి జోనర్‌కి చెందినదే. ఇందులో ఐఫోన్‌ మిస్సింగ్‌ అనే పాయింట్‌ని ఎత్తుకుని చివరికి బ్యాంక్‌ లో అన్‌ క్లైమ్డ్ అకౌంట్స్, దాని వెనకాల జరిగే పెద్ద స్కామ్‌ గురించి చర్చించిన చిత్రమిది. ఓ రకంగా ఎత్తుకున్న కథకి, ముగింపుకి సంబంధమే లేదు. ఫోన్‌ మిస్సింగ్‌ అనే పాయింట్‌ నుంచి బ్యాంకుల్లో జరిగే అక్రమాలను బయటపెట్టారనేది సింపుల్‌గా ఈ సినిమా లైన్‌. కథగా చాలా చిన్న పాయింటే, దాన్ని రెండున్నర గంటలపాటు లాగడమే ఇక్కడ సాహసోపేతమైన అంశం. ఈ క్రమంలో సినిమా చాలా ల్యాగ్‌గా, స్లోగా, బోరింగ్‌గా సాగుతుంది. ఇంట్రెస్టింగ్‌ ఫ్యాక్టర్స్ మిస్‌ అయ్యాయి. ఎత్తుకున్న పాయింటే చాలా సిల్లీగా ఉంది. ఐఫోన్‌ కోసం ఏకంగా కమిషనర్‌కి ఎదురెళ్లడం వంటి సీన్లు నమ్మశక్యంగా లేవు. పైగా ఆ ఫోన్‌ని తను ఎమోషనల్‌గా ఫీలవడం కనెక్టింగ్‌గా అనిపించదు.
 

ఫోన్‌పై ఎమోషన్ అనేది బలంగా చూపిస్తే అది ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతుంది. కానీ అలాంటి సన్నివేశాలేం లేవు. ఇక ఫోన్‌ పోయిందని, కమిషనర్‌ ఇవ్వడం లేదని, ఏకంగా ఆయన కూతురుని లవ్‌ చేయడం, ఆమె చేత ఏకంగా కమిషనర్‌ రివాల్వర్‌ని తెప్పించుకుని బ్లాక్‌ మెయిల్‌ చేయడమనేది మరింత సిల్లీగా ఉంది. అదే సినిమాలో విషయం లేదని తేల్చేస్తుంది. అయితే ఇంటర్వెల్‌ లో వచ్చే చిన్న ట్విస్ట్ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ ఎపిసోడ్‌తో కథ పూర్తిగా మరో టర్న్ తీసుకుంటుంది. మర్డర్‌ కేసు హీరో మెడకి చుట్టుకోవడం, అతన్ని పోలీసులు వెతకడం, ఎన్‌కౌంటర్‌ ప్లాన్‌ చేయడం, దీనికి యూనివర్సిటీ గొడవలు ఇన్‌వాల్వ్ చేయడం, పైగా కమిషనర్‌పై విద్యార్థులు ఎటాక్‌ చేయడం వంటి సీన్లు అలా ఒకదాని తర్వాత అలా వచ్చిపోతుంటాయి. దాని వెనకాల జరిగే కొన్ని సీన్లు ఇంట్రెస్ట్ ని, ఉత్కంఠని పెంచుతుంటాయి. దాన్ని బ్యాంకుల్లో జరిగే అవకతవకలకు లింక్‌ చేశారు. ఆ స్కామ్‌ని బయటకు తీసేందుకు సెకండాఫ్‌ మొత్తం తీసుకున్నారు. ఇందులో అన్‌ క్లెయిమ్డ్ అకౌంట్ల నుంచి డబ్బుని బ్యాంకులు తీసుకుని భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నారనే అంశాన్ని చూపించారు. (Nenu Student Sir Movie Review)
 

క్లైమాక్స్ కి వెళ్లే కొద్ది ఉత్కంఠ పెరుగుతుంది. దీని వెనకాల ఎవరో పెద్ద వ్యక్తి ఉన్నారని, ఇదొక పెద్ద స్కామ్‌ అని, ఇంకా ఏదో బయటపడబోతున్నారనే ఉత్కంఠ క్రియేట్‌ చేసి, క్లైమాక్స్ కోసం ఆడియెన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేసే క్రమంలో చివరికి తుస్సుమనిపించారు. పస లేని క్లైమాక్స్ తో ఆడియెన్స్ ఆశలను నీరు గార్చారు. దీంతో ఉసూరుమన్న ఫీలింగ్‌ కలుగుతుంది. ఊరించి ఉసూరమనిపించారే అనే నిరాశ ఆడియెన్స్ కి తప్పదు. అయితే బ్యాంక్‌లో జరిగే ఈ అక్రమాలకు సంబంధించిన ఓ కొత్త పాయింట్‌ని ఈ సినిమాలో చర్చించడం అభినందనీయం. అది మంచి సందేశంగా నిలుస్తుంది. అవగాహన కల్పించేలా ఉంటుంది. కానీ దాన్ని బలంగా, ఇంట్రెస్టింగ్‌గా నడిపించి ఉంటే బాగుండేది. దీనికారణంగా సినిమాగా ఆడియెన్స్ దాన్ని అంతగా ఫీల్‌ కాలేరు. ఎంటర్‌టైన్‌మెంట్‌కి పెద్దగా స్కోప్‌ లేకపోవడం, లవ్‌ స్టోరీలో ఫీల్‌ లేకపోవడం, కిక్‌ ఇచ్చే ట్విస్ట్ లు లేకపోవడం. ఉన్న ఒకటి రెండు కూడా అందులో బలం లేకపోవడం మైనస్‌గా చెప్పొచ్చు. దీంతో ఇదొక ఫీల్‌ లేని, ఎమోషన్స్ లేని, వినోదం లేని రొటీన్‌ మూవీగా మారిపోయింది. 
 

నటీనటులుః

సుబ్బుగా బెల్లంకొండ గణేష్‌ ఫర్వాలేదనిపించాడు. ఇన్నోసెంట్‌ పాత్రకి యాప్ట్ గా నిలిచాడు. కానీ ఫేస్‌ లో ఎక్స్ ప్రెషన్స్ సినిమా మొత్తం ఒకేలా ఉంది. నటన పరంగా ఇంకా ఇంప్రూవ్‌ కావాల్సింది. హీరోయిన్‌ సినిమాకి మైనస్‌. సముద్రఖని తన దైన పాత్రలో మెప్పించారు. గణేష్‌ ఫ్రెండ్‌గా నటించిన కుర్రాడు ఫర్వాలేదనిపించాడు. కానీ అతన్నుంచి కామెడీ వర్కౌట్‌ కాలేదు. ఇక రాంప్రసాద్‌, శ్రీకాంత్‌ అయ్యంగర్‌ ఓకే అనిపించారు. సునీల్‌తో కామెడీ ట్రై చేశారు. కానీ ఎక్కువగా ఉపయోగించుకోలేదు. ఇందులో చిత్ర నిర్మాత సతీష్‌ వర్మ సైతం డీజీపీగా మెరవడం విశేషం. 

టెక్నీకల్‌గా..
టెక్నీకల్‌గా సినిమాకి దర్శకత్వం తప్ప మిగిలినవన్నీ హెల్ప్ అయ్యాయి. బలమైన కథ లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్‌. ఉన్నదాన్ని ఇంట్రెస్టింగ్‌గా తీసుకెళ్లలేకపోయారు. పైగా మొదటి భాగం ఒకలా, రెండో భాగం మరోలా సాగడం గమనార్హం. దీంతో ఒకేటికెట్‌కి రెండు సినిమాలను చూపించిన ఫీలింగ్‌ కలుగుతుంది. బలమైన ఎమోషన్స్, మంచి ఫీల్‌ని, సోల్‌ని సినిమాలో మిస్‌ అయ్యాయి. బలమైన సంఘర్షణ లేదు. ఇవన్నీ మిస్‌ కావడంతో ఆత్మలేని బాడీలా మిగిలిపోయింది. దీంతో ఆడియెన్స్ సినిమా పెద్దగా కనెక్ట్ కాదు. సాగర్‌ మహతి మ్యూజిక్‌ ఓకే అనిపించేలా ఉంది. పాటలు లేకపోవడమే బెటర్‌. ఉంటే పెద్ద నస అయ్యేవి. బీజీఎం ఉన్నంతలో ఫర్వాలేదు. ఎడిటింగ్‌ పరంగా మరింత కేర్‌ తీసుకోవాలి. కథని వేగంగా సాగించేలా చేస్తే బాగుండేది. నిర్మాణం పరంగా క్వాలిటీ కనిపిస్తుంది. చాలా తక్కువ బడ్జెట్‌లోనే ఎక్కువ క్వాలిటీ కనిపిస్తుండటం విశేషం. (Nenu Student Sir Movie Review)
 

ఫైనల్‌గాః ఫీల్‌, ఇంట్రెస్టింగ్‌గా లేని `స్టూడెంట్‌`.
రేటింగ్‌ః 2

నటీనటులు : బెల్లంకొండ గణేష్, అవంతిక దాసాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, రామ్‌ ప్రసాద్‌ తదితరులు.
కెమెరామెన్‌ : అనిత్ కుమార్
మ్యూజిక్‌ : మహతి స్వర సాగర్
నిర్మాత : నాంది సతీష్ వర్మ
రచన : కృష్ణ చైతన్య
దర్శకత్వం : రాకేష్ ఉప్పలపాటి
 

Latest Videos

click me!