మహానటి సావిత్రి గురించి ఈ విషయాలు మీకు తెలుసా?..జయంతి స్పెషల్‌

First Published | Dec 6, 2020, 1:38 PM IST

మహానటి సావితి.. తెలుగు సినిమాపై ఆమెది చెరగని ముద్ర. తెలుగుపాటు దక్షిణాది భాషల్లో సైతం అద్భుతమైన అభినయంతో మెస్మరైజ్‌ చేసి ప్రేక్షక హృదయాల్లో నిలిచిపోయింది. సినిమాల్లో సజీవంగానే ఉంది. విషాదాంతంతో ముగిసిన ఆమె జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం. నేడు మహానటి సావిత్రి జయంతి. ఈ సందర్భంగా ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలు చూద్దాం. 

సావిత్రి తాడేపల్లి మండల్లం చిర్రావూరులో 1937 డిసెంబర్‌ 6న జన్మించారు. తాను పుట్టకముందే తండ్రి గురువయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో చిర్రావూరులో ఉన్న సావిత్రి పెద్దమ్మ అన్నపూర్ణమ్మ దత్త కుమారుడు నర్సయ్య పిన్నమ్మ సుభద్రమ్మను ఇంటికి తీసుకొచ్చి పెంచి ఆదరించారు.
సావిత్రి తల్లిపేరు సుభద్రమ్మ. సుభద్రమ్మకు ఇద్దరు అక్కలు అన్నపూర్ణమ్మ, దుర్గాంబ, ఒక్క చెల్లెలు వెంకట సుబ్బమ్మ, మరో సోదరుడు అల్లాడి సుబ్బారావు. పెద్దక్క దావులూరి అన్నపూర్ణమ్మ దత్తత కుమారుడు దావులూరి నర్సయ్య. సావిత్రి తల్లి సుభద్రమ్మకు రేపల్లె తాలూకా చింతలపూడికి చెందిన హరికథా కళాకారుడు నిశ్శంకర గురవయ్యతో వివాహమైంది. వీరికి మారుతీ, సావిత్రి అనే ఇద్దరు ఆడబిడ్డలు కలిగారు.

సావిత్రి దాదాపు పదకొండేళ్ల ప్రాయం వరకు చిర్రావూరులోనే పెరిగారు. ఆమె పుట్టిన ఇల్లు నేడు కాస్త రూపుమారి ఓ చిన్నపాటి డాబాగా దర్శనమిస్తోంది. ప్రస్తుతం చిర్రావూరులో సావిత్రి బంధువర్గం నలుగురు ఉన్నారు. వరుసకు మేనకోడలయ్యే మాదాసు నర్స మ్మ, మనుమరాలు వరుసయ్యే దావులూరి పార్వతి, ముది మనుమల వరుసయ్యే చంద్రశేఖర్‌, అనిల్‌కుమార్‌ ఇక్కడ ఉంటున్నారు.
సావిత్రి తల్లి సుభద్రమ్మ గ్రామంలో కొన్నాళ్లు బడ్డీ పెట్టుకుని కూరగాయలను అమ్మేవారట! సావిత్రి చిన్ననాటి నుంచి బాగా హుషారుగా ఉండేదట. ఆటపాటలతో కృష్ణా కరకట్ట వెంట ఉన్న గంగానమ్మ గుడి వరకు వెళ్లి పేడ తెచ్చేదట.
తరచుగా కృష్ణా లంకల్లోకి వెళ్లి రేగుపండ్లను కోసి తెచ్చుకునేది. ఆ రేగుపండ్లంటే ఆమెకు మహా ఇష్టమట! రేగుపండ్లు, పండుమిర్చి గుజ్జుతో కలిపి చేసిన పచ్చళ్లంటే సావిత్రికి ఇంకా ఇష్టమని చిర్రావూరులోని ఆమె బంధువులు తెలిపారు. సావిత్రి నటిగా ఎదిగిన తరువాత కూడ నర్సయ్య చిర్రావూరు నుంచి ఈ పచ్చళ్లను తయారు చేయించి మద్రాసు వెళ్లి సావిత్రికి ఇచ్చి వచ్చేవారట. వీటితోపాటు సాయి పసుపు కొట్టి వజ్రకాయంగా తయారుచేసిన మిశ్రమాన్ని సావిత్రి తనకిష్టమైన మేకప్‌ పేస్టుగా వాడుకునేవారట!
సావిత్రి ఐదో తరగతి వరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే చదివిందని అంటారు. సావిత్రిలోని చలాకీతనం ఆమె పెద్దమ్మ దుర్గాంబను బాగా ఆకట్టుకుంది. ఆ రోజుల్లోనే దుర్గాంబ కృష్ణా జిల్లా మానికొండకు చెందిన కొమ్మారెడ్డి వెంకట్రామయ్య చౌదరిని ప్రేమించి కులాంతర వివాహమాడింది. ఈ జంట విజయవాడలోని విజయాటాకీస్‌ వెనుక వైపు కాపురముండేవారు.
సావిత్రికి శాస్ర్తీయ సంగీతం, నృత్యం నేర్పించాలనే ఉద్దేశ్యంతో పెద్దమ్మ దుర్గాంబ తన సోదరి సుభద్రమ్మను ఇద్దరు ఆడపిల్లలతో కలిసి తన వద్దకు రప్పించుకుందట. ఇలా సావిత్రి తన 11వ యేట చిర్రావూరు నుంచి విజయవాడకు మారింది.
సావిత్రి నృత్యం బాగా చేయడం గమనించిన వెంకట్రామయ్య ఆమెను పూర్ణయ్య దగ్గర నృత్య శిక్షకురాలిగా చేర్చారు. దీంతో పదేళ్ళు వచ్చేసరికే నాట్య ప్రదర్శనలు ఇచ్చేస్తాయికి ఎదిగింది. కొంగర జగ్గయ్య ఒకసారి ఆమె ప్రదర్శన చూసి తమ నాటకపరిషత్‌లో అవకాశం ఇచ్చారు.
13 ఏళ్ల వయస్సులోనే కాకినాడలో జరిగిన ఆంథ్రనాటక పరిషత్ ఉత్సవాలలో పాల్గొనడం ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధిగా వచ్చిన ఫృధ్పీరాజ్ కపూర్ ఆమెను సినిమాలలో చేరమని సలహా ఇవ్వడంతో 1949లో మద్రాసుకు ట్రైన్ ఎక్కేసింది సావిత్రి. ఆ తరువాత పెదనాన్న కేవీ చౌదరి ప్రోత్సాహంతో సావిత్రి నాటకాభినయం చేస్తూ సినీరంగ ప్రవేశం చేసింది.
స్టార్‌గా ఎదిగిన తర్వాత కేవలం రెండు సార్లు మాత్రం రావూరుకి వచ్చారట. నర్సయ్య సోదరుడు వెంకటేశ్వరరావు వివాహానికి చిర్రావూరు వచ్చి డాన్స్‌ ప్రోగ్రాం కూడా ఇచ్చిందని బంధువులు తెలిపారు.
మొదట యల్‌వి ప్రసాద్ `సంసారం` అనే సినిమాలో అవకాశం ఇవ్వగా కొన్ని షాట్లు తీసిన తరువాత వయస్సు తక్కువగా ఉందనే కారణంతో ఆమెను తీసేశారు. తర్వాత `పాతాళభైరవి` అనే సినిమాలో కనబడీ కనబడని పాత్రలో నటించింది.
`పెళ్ళిచేసి చూడు` సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నా.. అది రెండవ కథానాయిక పాత్ర. 1953 సంవత్సరం ఆమె జీవితాన్ని మరో మలుపుతిప్పింది. ఉర్రూతలూగించిన `దేవదాసు` సినిమాలో పార్వతి పాత్రకు ఎన్నికైంది సావిత్రి. అది కూడా అనుకోకుండా వచ్చిన అవకాశం. మొదట షావుకారు జానకిని తీసుకుంటే ఏవో ఇబ్బందలవల్ల ఆమె తప్పుకోవడంతో ఆ అవకాశం సావిత్రికి దక్కింది.
దీంతో ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు సావిత్రికి. సావిత్రి 30 ఏళ్ల సినీ కెరీర్‌లో 252 సినిమాల్లో నటించారు. 1950-60లలో ఆమె ఇండియాలో ఎక్కువ ఆదరణ కలిగిన నటిగా కీర్తించబడ్డారు. ఇదిలా ఉంటే రెండేళ్ల క్రితం సావిత్రి జీవితకథను `మహానటి` చిత్ర రూపంలో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ రూపొందించారు. ఇది భారీ ఆదరణ పొందింది. ఇందులో సావిత్రిగా నటించిన కీర్తిసురేష్‌కి జాతీయ అవార్డు రావడం విశేషం.
సావిత్రి వైవాహిక జీవితంలో ఓడిపోయారు. ఆమె జెమినీ గణేష్‌ ప్రేమలో పడి పెళ్ళి చేసుకున్నారు. ఆయన సావిత్రిని మోసం చేశాడనే విషయం తెలిసిందే. నా అనుకున్న వారంతా మోసం చేశారు. మరోవైపు సినిమాలు నిర్మించి నష్టపోయారు. దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడ్డారు.
మరో సందర్భంలో వచ్చిందన్నారు. తనకు సావిత్రితో పరిచయముందని తన తండ్రి నర్సయ్యతో కలిసి మద్రాసు వెళ్లి సావిత్రిని కలిసిన సందర్భాలు వున్నాయని సావిత్రికి మేనకోడలయ్యే నర్సయ్య కుమార్తె మాదాసు నర్సమ్మ తెలిపారు. మహానటి సావిత్రి తల్లి స్వగ్రామమైన గుంటూరు జిల్లా రేపల్లె మండలం వడ్డివారిపాలెంలో ఆమె గుర్తుగా శ్రీమతి సావిత్రి గణేష్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను 1962లో స్థాపించారు.
1965లో ఢిల్లీలో తన ఒంటిపై ఉన్న నగలన్నింటిని లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చి తన గొప్ప మనసుని చాటుకుంది. కానీ తన చివరి రోజుల్లో మాత్రం ఎవరూ లేక ఒంటరిగా 1981 డిసెంబర్ 26న కోమాలోకి వెళ్ళి తుది శ్వాస విడిచారు.

Latest Videos

click me!