1931లో తొలి తెలుగు టాకీ సినిమా `భక్తప్రహ్లాద` విడుదల అయ్యింది. ఆ తర్వాత నాలుగేండ్లకే 1935 జులై 25న కైకాల(Kaikala Satyanarayana) జన్మించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో ఆయన జన్మించారు. తెలుగు సినిమాతోపాటు ఆయన పెరిగారు. అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాయి. కళామతల్లి ఒడిలోనే ఆరు దశాబ్దాలు బతికారు కైకాల. గుడివాడ, విజయవాడలో ప్రైమరీ ఎడ్యూకేషన్‌ని పూర్తి చేశారు. గుడివాడ కాలేజ్‌లో డిగ్రీ కంప్లీట్ చేశాడు. 25ఏళ్ల వయసులో 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మని వివాహం చేసుకున్నాడు కైకాల. ఆయనకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులున్నారు.
హీరోగా సినిమా రంగానికి పరిచయం అయినా.. ఆ సినిమా నిరాశపర్చడంతో విలన్ గా మారడానికి తటపటాయించలేదు. జానపద బ్రహ్మ విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన ఎన్నెన్నో జానపద చిత్రాల్లో సత్యనారాయణ విలన్ పాత్రలు పోషించారు. ఆ తర్వాత సోషల్ పిక్చర్స్ లో కూడా విలన్ పాత్రలు వచ్చాయి. సత్యనారాయణ నవ్వు పాపులర్ విలనీ ట్రేడ్ మార్క్ అయింది. కెరీర్ తొలిదశలోనే ఆయనకి పౌరాణిక పాత్రలు చేసే అవకాశం లభించింది. `లవకుశ`లో భరతుడిగా, `శ్రీకృష్ణార్జున యుద్ధం`లో కర్ణుడిగా, `నర్తనశాల`లో దుశ్శాసనుడిగా నటించారు.
`శ్రీ కృష్ణపాండవీయం`లో ఘటోత్కచుడి పాత్ర తొలిసారి ధరిస్తే మళ్ళీ 1995లో ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన `ఘటోత్కచుడు` చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. `శ్రీకృష్ణావతారం` చిత్రంలో తొలిసారి దుర్యోధనుడి పాత్ర పోషించారు. ఆ తర్వాత `కురుక్షేత్రం`లో దుర్యోధనుడిగా అద్భుతంగా నటించి రక్తి కట్టించారు. అలాగే రావణాసురుడిగా `సీతాకళ్యాణం`లో, భీముడిగా `దానవీరశూరకర్ణ`లో, మూషికాసురుడిగా `శ్రీ వినాయక విజయం` చిత్రాల్లో నటించారు. `కథానాయిక మొల్ల`లో శ్రీకృష్ణదేవరాయలు పాత్ర పోషించారు.
యమధర్మరాజు అంటే తెలుగు తెరకి సత్యనారాయణ తప్ప మరొకరు గుర్తురారు. `యమగోల` సినిమాతో ప్రారంభమైన ఈ పాత్ర జైత్రయాత్ర `యముడికి మొగుడు`, `యమలీల`, `రాధామాధవ్`, `దరువు` చిత్రాల వరకూ సాగింది. `మోసగాళ్ళకు మోసగాడు`, `దొంగల వేట` మొదలైన సినిమాల్లో ఆయన విలన్ పాత్రలు మర్చిపోలేనివి. ఉమ్మడి కుటుంబం, దేవుడు చేసిన మనుషులు, శారద చిత్రాలతో ఆయన ఇమేజ్ మారింది. సాత్వికమైన పాత్రలకు కూడా సత్యనారాయణ బెస్ట్ ఆప్షన్ అయ్యారు. `తాత.. మనవడు`, `సంసారం..సాగరం`, `రామయ్య తండ్రి`, `జీవితమే ఒక నాటకరంగం`, `దేవుడే దిగివస్తే`, `సిరి సిరి మువ్వ`, `తాయారమ్మ`, `బంగారయ్య`, `పార్వతీ పరమేశ్వరులు` మొదలైన చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి విలన్ ఇమేజ్ నుంచి బయటపడి ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు.
కమెడియన్ నగేష్ డైరెక్టర్ గా డి.రామానాయుడు నిర్మించిన `మొరటోడు` చిత్రంతో హీరోగా మారారు. `నా పేరే భగవాన్`, `ముగ్గురు మూర్ఖులు`, `ముగ్గురు మొనగాళ్ళు`, `కాలాంతకులు`, `గమ్మత్తు గూఢచారులు`, `తూర్పు పడమర`, `సావాసగాళ్ళు` లాంటి చిత్రాల్లో హీరోతో సమాంతరమైన పాత్రలు పోషించారు కైకాల సత్యనారాయణ. కాకపోతే హీరోగా సక్సెస్ కాలేకపోయారు. `చాణక్య చంద్రగుప్త`లో రాక్షస మంత్రిగా నటన విశ్వరూపం చూపించారు. `నా పిలుపే ప్రభంజనం`లో ముఖ్యమంత్రి పాత్రతో విస్మయపరిచారు. తన నటనలోని అన్ని యాంగిల్స్ చూపించారు. నటుడిగా తన జైత్ర యాత్రని సాగించారు.
సుభాష్ ఘాయ్ డైరెక్ట్ చేసిన హిందీ సినిమా `కర్మ`లో విలన్ గా నటించారు. ఈ సినిమాలో శ్రీదేవి తండ్రి పాత్ర ధరించారు. తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్ లతో కొన్ని చిత్రాలతో పాటుగా కన్నడ, హిందీ సినిమాల్లో కూడా కైకాల సత్యనారాయణ నటించడం విశేషం. ఓ రకంగా సంపూర్ణమైన నటుడు కైకాల. నటుడిగా ఆయన దాహం తీరిందని చెప్పొచ్చు. ఆయన పోషించని పాత్రంటూ లేదంటే అతిశయోక్తి కాదు. కైకాల సత్యనారాయకి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డ్ తో గౌరవించుకుంది. కానీ ఆయనకు దక్కాల్సిన గౌరవం దక్కలేని చెప్పొచ్చు.