
`హేమ కమిటీ` అనేది గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కేరళ చిత్ర పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి జస్టీస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక పెను దుమారం రేపుతుంది. ఇందులో బిగ్ ఆర్టిస్టు లు సైతం లైంగిక ఆరోపణలు ఎదుర్కోవడంతో ఇది మలయాళ చిత్ర పరిశ్రమని కుదిపేస్తుంది.
చిన్న ఆర్టిస్ట్ ల నుంచి బిగ్ స్టార్స్ వరకు అలజడికి గురయ్యారు. అంతేకాదు ఏకంగా మోహన్‌లాల్ వంటి వారు మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(అమ్మా) అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి రావడం గమనార్హం. దీంతోపాటు ఎగ్జిక్యూటివ్ కమిటీని కూడా రద్దు చేశారు.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్, ఇంట్రెస్టింగ్ వార్తల కోసం ఇక్కడ చూడండి.
దీనిపై బిగ్ స్టార్స్ స్పందిస్తున్నారు. మమ్ముట్టి, రజనీకాంత్, రాధికా, సుమలత వంటి వారు స్పందించారు. కమిటీకి మద్దతు తెలియజేస్తూ తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా కేరళ హైకోర్ట్ దీనిపై స్పందించింది. కేరళ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిటీ వేసి నాలుగేళ్లు అవుతున్న చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారని, ఇంత కాలం ఏం చేశారని ప్రశ్నించింది.
హేమ కమిటీ మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపుల విషయాలను బయటపెట్టినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై హైకోర్ట్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఏం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నాలుగేళ్లు ఖాళీగా కూర్చున్నారా? అంటూ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్రం నిర్లక్ష్య వైఖరి ఆందోళనకు గురి చేస్తుందని, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు మీరు ఏం చేస్తున్నారు? మనలాంటి రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉండటం దారుణమని,
రాష్ట్రంలో మహిళల జనాభానే అధికం అని, ఈ వేధింపుల వ్యవహారం చిన్న విషయం కాదని, సిట్ అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలని తెలిపింది. ప్రస్తుతం ఉన్న చట్టాలతో సమస్యలకు పరిష్కారం లభించకపోతే కొత్త చట్టాలను తీసుకురావడం గురించి ప్రభుత్వం ఆలోచించాలని పేర్కొంది హైకోర్ట్. కోర్ట్ వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి.
ఈ నేపథ్యంలో అసలు హేమ కమిటీ ఏంటి? ఎందుకు వేశారు? ఎప్పుడు వేశారు? మలయాళ చిత్ర పరిశ్రమలో అసలేం జరిగిందనేది చూస్తే..
హీరో దిలీప్‌పై ఆరోపణలు మూలం..
2017లో మలయాళ నటి కిడ్నాప్ కేసు పెద్ద సంచలనంగా మారింది. రౌడీలతో కలిసి ఆ నటిపై హీరో దిలీప్ లైంగికంగా వేధించాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలే మాలీవుడ్‌లో పెను ప్రకంపణలు సృష్టించాయి. ఈ కేసులో దిలీప్‌ని అరెస్ట్ చేశారు. ఆ సమయంలోనే ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల ఒత్తిడి మేరకు దీన్ని విచారించేందుకు,
ముఖ్యంగా మాలీవుడ్‌లో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలు, వారి రక్షణ, లైంగిక వేధింపుల అనేది సమగ్రంగా విచారించేందుకు కేరళా ప్రభుత్వం 2019లో జస్టీస్ హేమ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. చిత్ర పరిశ్రమలో మహిళల సమస్యలు, వర్కింగ్ కండీషన్లు, పారితోషికాలు, టెక్నికల్‌గా మహిళల భాగస్వామ్యం వంటి అంశాలపై కమిటీ సమగ్రంగా అధ్యయనం చేసింది.
ఇటీవల ఆగస్ట్ 19న ఈ రిపోర్ట్ ని అందించింది. ఇందులో మహిళల స్థితిగతులకు సంబంధించి పలు షాకింగ్ విషయాలను బయటపెట్టింది. సాక్షులు తెలిపిన సమాచారం మేరకు 235 పేజీల నివేదకని కేరళా ప్రభుత్వానికి సమర్పించింది హేమ కమిటీ.
హేమ కమిటీ రిపోర్ట్ లో అసలేమున్నాయి..
వేధింపు, దుర్వినియోగం..
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, దోపిడీలు, వేధింపులు వంటి సమస్యలను ఈ నివేదిక హైలైట్ చేసింది. సినిమాల్లో అవకాశం కోసం వచ్చే అమ్మాయిలను కొందరితో సన్నిహితంగా మెలగాలని ముందే చెబుతారని, అందుకు అంగీకరిస్తేనే సినిమాల్లో ఛాన్స్ వస్తుందని పలువురు నటీమణులు తెలిపారు.
పైగా ఇందుకు `అడ్జస్ట్‌మెంట్స్`, `కాంప్రమైజ్` అనే పదాలు వాడటం మాలీవుడ్‌లో సర్వసాధారణమని ఈ కమిటీ గుర్తించింది. పరిశ్రమలోని చాలా మంది మహిళలు అనుచితమైన ప్రవర్తనను అనుభవించారని, ఈ విషయాలను చెబితే, వాళ్లని ఎదురిస్తే అవకాశాలు రావు అనే ఉద్దేశ్యంతో, బెదిరింపులకు దిగుతారు, కెరీర్‌ని నాశనం చేస్తారనే ఉద్దేశ్యంతో ఆయా విషయాలను చెప్పేందుకు వెనకడుగు వేస్తున్నారని తెలిపింది.
పని పరిస్థితులు మహిళలకు ప్రతికూలంగా ఉన్నాయని కమిటీ గుర్తించింది. ఇందులో సుదీర్ఘమైన, క్రమరహిత పని గంటలు, సెట్‌లో ప్రాథమిక సౌకర్యాల కొరత, సరిపడని భద్రతా చర్యలు ఉన్నాయని చెప్పింది.
లింగ వివక్ష..
పరిశ్రమలో లింగ వివక్షపై కూడా నివేదిక వెల్లడించింది. మహిళలకు చాలా వరకు మగవారితో పోల్చితే తక్కువ వేతనాలు అందిస్తున్నారని తెలిపింది. అదే సమయంలో అవకాశాలు కూడా తక్కువగా ఉంటున్నాయని చెప్పింది. నటీనటుల ఎంపిక నుంచి చెల్లింపుల వరకు సినీ పరిశ్రమలోని అన్ని అంశాల్లో లింగ సమానత్వం అవసరమని కమిటీ నొక్కి చెప్పింది.
చిత్ర పరిశ్రమలో మహిళల కోసం బలమైన, సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ లేకపోవడం హేమ కమిటీ ముఖ్యమైన అన్వేషణలలో ఒకటి ఉంది. అనేక మంది మహిళలు సమస్యలను నివేదించడానికి, న్యాయం కోరడానికి సరైన వేదిక లేదని భావించారు. ఇది వేధింపులు, వివక్షను శాశ్వతంగా కొనసాగించడానికి దోహదపడిందని చెప్పింది.
సిఫార్సులు..
మలయాళ చిత్ర పరిశ్రమలో పరిస్థితిని మెరుగుపరిచేందుకు కమిటీ పలు సిఫార్సులు చేసింది. అవేంటనేది చూస్తే.. వేధింపులు, వివక్షకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి బలమైన, స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయడం. కార్మికులందరికీ, ముఖ్యంగా మహిళల భద్రత, గౌరవాన్ని నిర్ధారించడానికి సినిమా షూటింగ్ సెట్‌లలో కఠినమైన ప్రవర్తనా నియమావళిని అమలు చేయడం.
నిర్మాతలు, దర్శకులు, నటీనటులతో సహా పరిశ్రమలోని సభ్యులందరికీ లింగ సున్నితత్వ శిక్షణను అందించడం. సినిమాల్లో మహిళలకు సమాన వేతనం, అవకాశాలను కల్పించడం. సినిమా పరిశ్రమలో పనిచేసే మహిళల చట్టపరమైన హక్కుల గురించి అవగాహన కల్పించడం.
హేమ కమిటీ నివేదిక అనంతరం బయటకొచ్చిన ఘటనలు..
హేమకమిటీ నివేదిక పెద్ద దుమారం రేపిన నేపథ్యంలో చాలా మంది నటీమణులు బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాలను, వేధింపులను, చేదు అనుభవాలను బయటపెడుతున్నారు. అందులో భాగంగా మలయాళ చిత్ర దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్ తనని వేధించాడని చెప్పి నటి శ్రీలేఖ మిత్ర ఆరోపణలు చేసింది. దీంతో ఆయన కేరళ రాష్ట్ర ఫిల్మ్ అకాడీ చైర్మెన్ పదవికి రాజీనామా చేశారు.
నటులు సిద్దిక్, రియాజ్ ఖాన్‌లు తన విషయంలో అనుచితంగా ప్రవర్తించారని చెప్పి నటి రేవతి సంపత్ ఆరోపించారు. దీంతో సిద్ధిక్ `అమ్మా` జనరల్ సెక్రెటరీ పదవి నుంచి రాజీనామా చేశారు. వీరితోపాటు దర్శకుడు తులసీదాస్, నిర్మాత అరోమా మోహన్‌లపై నటి గీతా విజయన్ ఆరోపణలు చేసింది.
శ్రీదేవిక సైతం దర్శకుడు తులసీదాస్‌పై ఆరోపణలు చేశారు. అలాగే దర్శకుడు వీకే ప్రకాష్, జయసూర్య,ముఖేష్ మణియంపిళ్ల రాజు, ఎడవెల బాబులపై మిను మునీర్ ఆరోపణలు చేసింది.