`బొమ్మరిల్లు` భామ జెనీలియా తెలుగులోకి రీఎంట్రీ.. హీరోని కూడా ఫిక్స్ చేసుకుందట?

First Published | Apr 21, 2021, 5:28 PM IST

`బొమ్మరిల్లు` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ లో `హాసిని`గా నిలిచిపోయిన జెనీలియా చాలా గ్యాప్‌తో రీఎంట్రీ ఇవ్వబోతుందట. తెలుగులో ఈ అమ్మడు ఓ సినిమా చేయబోతుందని, తనకు సూపర్‌ హిట్‌ అందించిన హీరోతోనే తిరిగి తెలుగు ఆడియెన్స్ ని పలకరించబోతుందని తెలుస్తుంది. 

జెనీలియా మ్యారేజ్‌ తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. అడపాదడపా ఒకటి రెండు సినిమాల్లో గెస్ట్ గా మెరిసినా, పూర్తి స్థాయి నటిగా నటించింది లేదు. ఇటీవల ఆమె మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. హిందీలో ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది.
తాజాగా తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తుంది. తనకు హిందీ కంటే తెలుగు చిత్ర పరిశ్రమే మంచి పేరుని తీసుకొచ్చింది. `బొమ్మరిల్లు`, `రెడీ`, `ఢీ`, `సై`, `సత్యం`, `శశిరేఖ పరిణయం`, `కథ`, `ఆరెంజ్‌` చిత్రాల్లో మెరిసింది. దాదాపు అందరు స్టార్లతోనూ ఆడిపాడిందీ సన్నజాజి అందాల భామ.

కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడే మ్యారేజ్‌ చేసుకుంది. బాలీవుడ్‌ నటుడు రితేష్‌ దేశ్‌ముఖ్‌ని ప్రేమించి 2012లో మ్యారేజ్‌ చేసుకుంది. మ్యారేజ్‌ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసింది. ప్రస్తుతం ఆమె ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినా ఈ అమ్మడి అందం మాత్రం ఏమాత్రం తగ్గలేదు.
ఇంకా రెట్టింపు అందం ఆమె సొంతమైందనే చెప్పాలి. ఫిట్‌గా, గ్లామరస్‌గా, మరింత సెక్సీగా రెడీ అయ్యింది. ఇటీవల జెనీలియా ఇచ్చిన ఫోటో షూట్‌ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సామాజిక మాధ్యమాల్లో మంచి ఫాలోయింగ్‌ని పెంచాయి. ఈ బ్యూటీ సినిమాలు చేయకపోయినా రెగ్యూలర్‌గా సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్ కి టచ్‌లోనే ఉంది. దీంతో ఆ క్రేజ్‌ ఇప్పటికీ అలానే మెయింటేన్‌ చేస్తుంది జెనీలియా.
అయితే తనకు మంచి లైఫ్‌ ఇచ్చిన జెనీలియా ప్రస్తుతం తెలుగులో ఎంట్రీకి దాదాపు సర్వం సిద్ధం చేసుకుందనే వార్త వినిపిస్తుంది. హీరో ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ సరసన హీరోయిన్‌గా నటించబోతుందట. వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే `రెడీ` వంటి సూపర్‌ హిట్‌ చిత్రం వచ్చింది.
ఆ మ్యాజిక్‌ని మళ్లీ రిపీట్‌ చేయాలని భావిస్తున్నారట. అందుకే రామ్‌తో రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తుందట జెనీలియా. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే గతంలో ఒకటి రెండు సార్లు జెనీలియా రీఎంట్రి ఇవ్వబోతుందనే వార్తలొచ్చాయి. ఇప్పటి వరకు దానిపై క్లారిటీ రాలేదు. మరి ఇప్పుడైనా నిజమవుతుందా? లేదా అనేది చూడాలి.

Latest Videos

click me!