భిన్నపాత్రలతో ఆకట్టుకుంటున్న నటుడు ఆదిపినిశెట్టి(Aadi Pinishetty). హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన నటనలోని విలక్షణతని చాటుకుంటున్నారు. అందులో భాగంగా ఆయన హీరోగా నటించిన చిత్రం `క్లాప్`. పృథ్వీరాజ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఆకాంక్ష సింగ్(AAkaksha Singh) హీరోయిన్‌గా నటించారు. అథ్లెటిక్(రన్నింగ్) ప్రధానంగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం మార్చి 11న ఓటీటీ(Soni)లో విడుదలయ్యింది. మరి సినిమా ఎలా ఉంది. ఆది పినిశెట్టి హీరోగా మెప్పించాడా? లేదా అన్నది `ఏషియా నెట్` రివ్యూ(Clap Movie Review)లో తెలుసుకుందాం.
కథః
తన కుమారుడు విష్ణు(ఆదిపినిశెట్టి) అథ్లెట్(రన్నింగ్)లో నేషనల్ ఛాంపియన్‌గా నిలవాలనేది తండ్రి(ప్రకాష్‌రాజ్) కల. అందుకోసం చిన్నప్పట్నుంచి విష్ణుని ట్రైన్ చేయిస్తుంటాడు. ట్రైనింగ్ ఇప్పించి స్టేట్ లెవల్ వరకు ఛాంపియన్‌గా నిలిచేలా చేస్తాడు. అయితే నేషనల్ ఛాంపియన్ షిప్‌లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించాలనేది ఆయన డ్రీమ్. ఊహించని విధంగా జరిగిన యాక్సిడెంట్ లో ప్రకాష్ రాజ్ చనిపోతాడు. ఆదిపినిశెట్టి కుడికాలుని కోల్పోవల్సి వస్తుంది. దీంతో నేషనల్ అథ్లెట్స్ లో పాల్గొనలేకపోయాయనే బాధతో కుంగిపోతుంటాడు ఆది. ఈ క్రమంలో అతనికి ఓ గర్ల్ అథ్లెట్ గురించి తెలుస్తుంది. తాను సాధించలేనిది ఆ అమ్మాయి చేత సాధించాలని, నేషనల్ ఛాంపియన్‌గా నిలవాలని భావిస్తాడు. తల్లిదండ్రుల మరణం వల్ల ఆ గ్రామీణ అమ్మాయి శిక్షణ తీసుకోలేని, స్పోర్ట్స్ లో పాల్గొనలేని పరిస్థితుల్లో ఉంటుంది. దీంతో ఆ అమ్మాయిని ట్రైన్ చేసి, తాను సాధించలేనిది ఆ అమ్మాయి చేత ఎలా సాధించాడు? ఆ అమ్మాయికి శిక్షణ ఇవ్వడానికి ఏ ఒక్క కోచ్ ఎందుకు ముందుకు రాలేదు? ఆదికి, నేషనల్ అథ్లెట్ సెలెక్టర్ నాజర్‌కి మధ్య గొడవేంటి? ఆకాంక్ష సింగ్‌తో లవ్ స్టోరీ కథేంటి? అనేది మిగిలిన సినిమా. Clap Movie Review.
విశ్లేషణః
స్పోర్ట్స్ నేపథ్యంలోని సినిమాలంటే.. హీరో తన జీవితంలో ఛాంపియన్‌గా నిలవాలనుకుంటాడు. ఈ క్రమంలో తనని ఎవరో కొందరు పై అధికారులు అడ్డుకోవడం, వారిపై తిరుగుబాటు చేయడం, తాను సాధించలేనిది తన పిల్లల ద్వారానో, ఇతరుల ద్వారానో సాధించాలనుకోవడం ప్రధానంగా సాగుతుంటాయి. కానీ వాటిలో ఉండే ఎమోషన్, డ్రామా చాలా కీలకం. దాన్ని ఎంత నాటకీయంగా, భావోద్వేగభరితంగా, వినోదాత్మకంగా ఆవిష్కరిస్తేనే సినిమా ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతుంది. హిట్ అవుతుంది. `క్లాప్` చిత్ర కథ కూడా అదే అయినా, దాన్ని ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దడంలో విఫలమయ్యారు దర్శకుడు ఆదిత్య.
ఈ చిత్రంలో ఎమోషనల్ ఏమాత్రం పండలేదు. హీరో లక్ష్యాన్ని బలంగా చూపించలేకపోయాడు. తాను అథ్లెట్‌గా ఎదిగిన విధానాన్ని, తను స్ట్రగుల్ అయిన విధానాన్ని కనెక్ట్ అయ్యేలా చూపించలేకపోవడం పెద్ద మైనస్. సినిమాలో నాటకీయత లోపించింది. సహజత్వం మిస్ అయ్యింది. దీంతో అంతా కెమెరా ముందు యాక్ట్ చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఏ సన్నివేశం కూడా పండలేదు. ఇలాంటి చిత్రాలకు ఎమోషన్స్, డ్రామా చాలా ముఖ్యం. కానీ అవే లోపించాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌కి స్కోప్ లేదు. అదే సమయంలో చిన్న పాయింట్‌ని మరీ లాగిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో జరిగే ప్రతి అంశాన్ని డిటెయిల్‌గా వివరించి చెప్పే క్రమంలో, పదే పదే అవే సన్నివేశాలను చూపించడం బోర్ ఫీలింగ్‌ని తెప్పిస్తాయి.
స్లో నెరేషన్ సినిమాకి పెద్ద మైనస్. సినిమా అంతా సీరియస్ మూడ్‌లో సాగుతుంది. ఎంటర్ టైన్‌మెంట్స్ లేకపోవడం మరో పెద్ద మైనస్. ఆర్టిస్టుల డబ్బింగ్ కూడా సరిగా కుదరలేదు. అయితే ఈ చిత్రాన్ని బైలింగ్వల్‌గా యూనిట్ చెప్పినా తమిళంలో తెరకెక్కించి తెలుగులో డబ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. చాలా చోట్ల డబ్బింగ్ సింక్ కాలేదు. డైలాగ్‌లు కూడా చాలా రొటీన్‌గా ఉన్నాయి. ఏ ఒక్క కొత్త అంశం కనిపించింది. ఆది, ఆయన భార్య ఆకాంక్ష ఎందుకు మాట్లాడుకోరో బలంగా చెప్పలేకపోయారు, ఆదిని, ఆయన తీసుకొచ్చిన క్రీడాకారిణిని ఇతర కోచ్‌లు ఎందుకు రిజెక్ట్ చేస్తారో క్లారిటీగా చెప్పలేకపోయారు. తనకు జరిగిన అవమానం కారణంగానే ఆదిని ఎదగనివ్వకుండా నాజర్ చేస్తున్నారనే పాయింట్ బలంగా చెప్పలేకపోయారు. దీంతో `జెర్సీ`, `బిగిల్`, `కైసల్య కృష్ణమూర్తి` వంటి స్పోర్ట్స్ డ్రామా చిత్రాల్లోని కొన్ని కొన్ని సన్నివేశాలను కలిపి చూసినట్టుగా ఉందీ `క్లాప్`.
నటీనటులు, సాంకేతిక వర్గం పనితీరుః
విష్ణు పాత్రలో ఆదిపినిశెట్టి పాత్రకి ప్రాణం పోశాడు. ఆయన పాత్ర ప్రధానంగానే సినిమా సాగుతుంది. పాత్రకి న్యాయం చేశాడు. సెటిల్డ్ నటనతో ఆకట్టుకున్నారు. హీరోయిన్ ఆకాంక్ష సింగ్ ఉన్నంతలో ఆకట్టుకుంటుంది. గర్ల్ అథ్లెట్‌గా కృష్ణకురుప్ ఇన్నోసెంట్ రోల్‌లో మెప్పించింది. సహజమైన నటన ప్రదర్శించింది. నాజర్, ప్రకాష్‌రాజ్, బ్రహ్మాజీ పాత్రలు ఓకే అనిపించాయి. సినిమాకి మ్యూజిక్ మైనస్. ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. కానీ ఆయన తాలుకూ మ్యూజిక్ ఎక్కడా కనిపించదు. దీంతో సన్నివేశాలు తేలిపోయాయి. కెమెరా వర్క్ సైతం ప్రొఫెషనల్‌గా లేదు. ఎడిటింగ్‌లోపాలు చాలా ఉన్నాయి. ఇక దర్శకుడు ఆదిత్యకి అనుభవ లేమి సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. సన్నివేశాల్లో సహజత్వం మిస్ కావడంతో భావోద్వేగ సన్నివేశాలు పండలేదని చెప్పొచ్చు. నిర్మాణ విలువలు చాలా నాసిరకంగా ఉన్నాయి. దీంతో `క్లాప్` మూవీ బోరింగ్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా నిలిచింది. Clap Movie Review.
రేటింగ్-1.75
తారాగణం:
ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్, కృష్ణ కురుప్, నాజర్, ప్రకాష్ రాజ్, రాందాస్, బ్రహ్మాజీ
సాంకేతిక బృందం:
దర్శకత్వం: పృథివి ఆదిత్య
నిర్మాతలు: రామాంజనేయులు జవ్వాజి, ఎం. రాజశేఖర్ రెడ్డి
సమర్పణ: బిగ్ ప్రింట్ పిక్చర్స్ ఐ.బి. కార్తికేయన్
బ్యానర్స్: శర్వంత్ రామ్ క్రియేషన్స్, శ్రీ షిర్డీసాయి మూవీస్
సంగీతం: మేస్ట్రో ఇళయరాజా
సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కుమార్
ఎడిటింగ్: రాగుల్
ఆర్ట్: వైరబాలన్, ఎస్. హరిబాబు
ఫైట్స్: ఆర్. శక్తి శరవణన్
కొరియోగ్రఫీ: దినేష్ మాస్టర్