ప్రతి ఒక్కరికి తమకి ఇష్టమైన హీరో, హీరోయిన్ ఎవరో ఒకరు ఉండి ఉంటారు. అలాంటి స్టార్‌ని మనం కలిస్తే ఎంత బాగుంటుందో అని ఊహించి ఉంటాం. ఊహ చాలా మందికి కలగానే మిగిలిపోతుంది. కొంత మందికే అది నిజమవుతుంది.
అలా నిజమైన వారిలో హిమజ ఒకరు. ఈ బిగ్‌బాస్ బ్యూటీ తాజాగా పవన్ కళ్యాణ్‌ని కలిసే అవకాశమే కాదు, ఏకంగా నటించే అవకాశమే వరించింది. ఇంక హిమజ ఆనందానికి ఆకాశమే హద్దు అయ్యింది.
హిమజకి పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న క్రిష్ చిత్రంలో నటించే అవకాశం దక్కింది. ఇందులో ఆమెకి కీలక పాత్ర వచ్చిందని సంబరపడుతుంది. ఈ విషయాన్ని తాజాగా ఇన్‌స్టా ద్వారా వెల్లడించింది. పవన్‌తో దిగిన ఫోటోలను పంచుకుని తన హ్యాపీనెస్‌ని పంచుకుంది.
`ఓ మై గాడ్. ఈ రోజు నా కల నిజమైంది. `తొలి ప్రేమ` సినిమాలో పవన్ కళ్యాణ్ ని చూసినప్పుడు ఆయన్ని కనీసం డైరెక్ట్ గా చూస్తానా అనుకున్నా. కానీ ఇప్పుడు ఏకంగా ఆయన 27వ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు క్రిష్‌కి కృతజ్ఞతలు` అని పేర్కొంది.
ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న విడుదల చేయనున్నారు. ఏ.ఎం.రత్నం ఈ సినిమాని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది.
ఇక నటి హిమజ బిగ్‌బాస్‌తో పాపులర్ అయ్యింది. టీవీలో పలు షోస్‌లో స్పెషల్ గెస్ట్ గా, కంటెస్టెంట్‌గా మెరుస్తూ ఆకట్టుకుంటుంది.
మరోవైపు సినిమాలతోనూ బిజీగా ఉందీ అమ్మడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తుంది. ప్రస్తుతం నాగశౌర్య నటిస్తున్న `వరుడు కావలెను`, సునీల్ `కనబడుట లేదు` చిత్రాల్లో నటిస్తుంది.
మరోవైపు తన గ్లామరస్ ఫోటోలతో అలరిస్తుంది హిమజ. మరీ పొట్టి డ్రెస్సులు కాకుండా సాధ్యమైనంత వరకు ట్రెడిషనల్ దుస్తుల్లో, హాఫ్ శారీలో మెరుస్తూ ఆకట్టుకుంటుంది.