అల్లరి నరేష్ ‘నాంది’ రివ్యూ

First Published | Feb 19, 2021, 2:38 PM IST


‘గ‌మ్యం’, ‘శంభో శివ శంభో’ త‌దిత‌ర సినిమాల‌తో న‌టుడిగా త‌న‌దైన ముద్ర వేసారు అల్లరి నరేష్. మళ్లీ చాలా రోజుల త‌ర్వాత మ‌రోసారి అలాంటి క‌థ‌ని ఎంచుకుని ‘నాంది’ చేశారు. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది?ఈ మధ్యకాలంలో  స‌రైన హిట్ లేని అల్ల‌రి న‌రేశ్‌కి ఈ చిత్రం ఎలాంటి ఫ‌లితాన్నిచ్చింది? 

అల్లరి నరేష్ ఏమిటి ఇంత హఠాత్తుగా కామెడీని వదిలేసి నగ్న ప్రదర్శన చేస్తూ కనిపించాడు. సీరియస్ సినిమాని సీరియస్ గా నమ్మి మన ముందుకు వస్తున్నాడు....సాహసం చేసాడా...లేక.. ఓ సారి చూద్దామని ధైర్యం చేసాడా? ఇలాంటి పాత్రలు చేయటానికి తెలుగులో చాలా మంది హీరోలు ఉన్నారు కదా మళ్లీ అదే రూట్ లోకి ఎందుకు వెళ్తున్నాడు? సినిమా లవర్స్ కు ఇలాంటి ప్రశ్నలు ఈ సినిమా గురించి బోలెడు ఉన్నాయి. అయితే ఆ ప్రశ్నలే ఈ సినిమాకు ఎక్కడలేని క్రేజ్ ని తెచ్చిపెట్టాయనటంలో సందేహం లేదు. నరేష్ సినిమాని చాలా కాలం తర్వాత జనం గుర్తు పెట్టుకుని ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని రిలీజ్ డేట్ ని మైండ్ లో ఫిక్స్ చేసుకునే స్దాయిలో ఈ సినిమాకు పబ్లిసిటీ జరిగింది.
Naandi movi ముఖ్యంగా సోషల్ మీడియా జనం ఈ సినిమా ట్రైలర్స్ ని తెగ మెచ్చేసుకున్నారు. వారు థియోటర్ కు వచ్చి సినిమా చూస్తారా లేదా అనేది ప్రక్కన పెడితే మంచి బజ్ అయితే క్రియేట్ అయ్యింది. ఈ బజ్ ని ఈ సినిమా కంటెంట్ క్యాష్ చేసుకోగలిగితే కాస్తంత ప్లాఫ్ లకు బ్రేక్ ఇవ్చచ్చు. ఆర్ట్ తరహాలో సాగే తమిళ సినిమాలను గుర్తు చేస్తున్న ‘నాంది’ కథేంటి,నగ్నంగా నరేష్ కనిపించాల్సిన అవసరం కథ లో ఉందా, పబ్లిసిటీ ట్రిక్కా, ఎప్పటిలాగే నరేష్ సినిమాలకు ఫ్యామిలీలు వెళ్లి పండుగ చేసుకునేలా ఉంటుందా, ఓ వర్గానికే పరిమితం అవుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.e

కథ: అండ‌ర్ ట్ర‌య‌ల్ ఖైదీ గా మర్డర్ కేసులో చంచల్ గూడ జైలు కు 14 రోజుల రిమాండ్ కి వెల్తాడు బండి సూర్య ప్రకాష్ (అల్లరి నరేష్). ఆ తర్వాత అతని జీవితం అక్కడే గడిచిపోతూంటుంది. ఐదు సంవత్సరాలు గడిచాక యూట్యూబ్ ఛానల్ లో పనిచేసే( ప్రియదర్శి) జైలు లోకి వస్తాడు. యూట్యూబ్ లో అతని పెట్టే వివాదాస్పద టైటిల్స్ వల్ల కేసులు ఫైల్ అయి జైలుకు వచ్చి వెళ్తూంటాడు. అక్కడి నుండి కథ టర్న్ తీసుకొని సూర్య ప్రకాష్ ప్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది.
సాఫ్ట్ వేర్ ఎంప్లాయి అయిన బండి సూర్య ప్రకాష్ (అల్లరి నరేష్)ది హ్యాపీ లైఫ్. మీనాక్షి (నవమి)తో ప్రేమలో పడతాడు. నిశ్చితార్దం కూడా అవుతుంది. అంతా బాగుంది అనుకున్న టైమ్ లో జీవితం అనుకోని మలుపు తీసుకుంటుంది. అతన్ని ఓ రోజు పోలీస్ లు వచ్చి అరెస్ట్ చేస్తారు. పౌర హక్కుల సంఘం కార్యకర్త రాజగోపాల్ (సీవీఎల్ నరసింహరావు) ని హత్య చేసావంటారు. సూర్య ప్రకాష్ నేరం ఒప్పుకోడు. కానీ సాక్ష్యాలు క్రియేట్ చేసి జైల్లో ఉంచేస్తారు. ఆ తర్వాత చిన్నాభిన్నమైన సూర్యప్రకాష్ జీవితం నరకం అయ్యిపోతుంది. ఏం చేయాలో తోచదు. ఎలా బయిటపడాలో అర్దం కాదు. అసలు తనెందుకు అన్యాయంగా ఈ జైల్లో మ్రగ్గిపోతున్నాడో అసలు తెలియదు.
ఇక జీవితం అక్కడే ముగిసిపోతుందేమో అనుకునే సమయంలో లాయిర్ ఆధ్య(వరలక్ష్మీ శరత్ కుమార్) అతన్ని బయిటకు తీసుకురావటానికి ప్రయత్నం మొదలెడుతుంది. ఆమె ప్రయత్నం ఫలించిందా..ఆ కేసు డీల్ చేస్తున్న సిఐ కిషోర్(హరీష్ ఉత్తమన్) కు నరేష్ ని ఇరికించాల్సిన అవసరం ఏమొచ్చింది. చివరకు సూర్య ప్రకాష్ ఎలా నిర్దోషిగా బయిటపడ్డాడు..బయటకి వచ్చి అన్నీ కోల్పోయిన సూర్య ప్రకాష్ ఏం చేశాడు? తనని కేసులో ఇరికించన వారిని ఏం చేసాడు..? ఆధ్య ఈ కేసు డీల్ చేయటానికి కారణమేంటి.. రాజ్‌ గోపాల్ హత్య కేసుకు మాజీ హోమంత్రి నాగేందర్ (వినయ్ వర్మ)కు లింక్ ఏమిటి? వంటివిషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్ ...షాక్ ట్రీట్మెంట్: అప్పట్లో 'పాపియాన్' పేరుతో ఫ్రెంచి భాషలో హెన్రీ షారియార్ రచించిన ఓ ఆత్మకథ వచ్చింది. ఆ నవల మానవతా విలువలను ఎన్నో కోణాల నుంచి ఆవిష్కరించింది. యావజ్జీవ ప్రవాసశిక్షకు గురైన ఈ రచయిత, ప్రాణం కంటే స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇవ్వడం ఇందులోని కథాంశం. శిక్షాస్మృతిలో దాగుండే కుళ్ళిపోయిన భాగాలనూ, కారాగారాల్లో సాగే కిరాతకత్వాలను ఎత్తిచూపింది.దాన్ని రెండు సార్లు సినిమాలుగా తీసారు. అలాంటి నవలలు మనకు రావటం లేదు...సినిమాలు లేవు. అయితే నాంది ఆ లోటుని కొద్దిగా తీర్చిందనే చెప్పాలి.
ఇక ఓ అమాయికుడు చేయిని నేరంలో ఇరుక్కుపోయే కథలు మనకు గతంలోనూ జగపతిబాబు మనోహరం, రవితేజ షాక్ లోనూ కనపడతాయి. అయితే అవి రెండూ An Innocent Man (1989) ని దేశీయ వెర్షన్ లాగ అనిపిస్తాయి. అయితే ఈ సినిమా మాత్రం దేశీయ వైద్యంలా అనిపిస్తుంది. ఏదో ఇరుక్కుపోయాడు..బయిటకు వచ్చాడంటే..బయిటకు వచ్చాడని కాకుండా చట్టం,న్యాయం, సెక్షన్స్ తో మనకు నాలెడ్జ్ పంచే ప్రయత్నం చేసారు. భార‌తీయ శిక్షా స్మృతిలోని సెక్ష‌న్ 211 ని పరిచయం చేసారు. కాస్తంత లోతుగానే వెళ్లి సబ్జెక్టులో ఈత కొట్టారని చెప్పాలి. జీవితం అనుకోని పరిస్దితుల్లోకి మనని హఠాత్తుగా తోసేస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో చూపించారు.
నరేష్ పాత్ర పైకి ప్యాసివ్ గా కనిపిస్తున్నా, అతని పెయిన్, సమస్య నుంచి బయిటపడేందుకు చేసే ప్రయత్నం..బయిటపడ్డాక చేసే పోరాటం అతన్ని హీరోగా నిలబెడతాయి. ఫస్టాఫ్ పరుగు పెట్టినా, సెకండాఫ్ ఎమోషన్ కంటెంట్ పైన పూర్తిగా ఫోకస్ పెట్టి, కోర్టు సీన్ లను కాస్తంత లాగాడు. అలాగే అప్పటిదాకా రియలిస్టిక్ గా అనిపించిన కథ ఒక్కసారిగా హీరోయిజం వైపు మళ్లటం,ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో ఇబ్బందిగా అనిపిస్తుంది. అప్పటిదాకా ఓ పేస్ లో వెళ్లిన సినిమా..పేస్ మారటం కాస్త డైజెస్ట్ కాదు. క్లైమాక్స్ ఎందుకంత హడావిడిగా చుట్టేసారో అర్దంకాదు. ఇక విలన్ ని చూపెట్టినప్పుడు...కౌంటర్ ఎటాక్ మరింత స్ట్రాంగ్ గా ఉంటే హీరోయిజం గా ఉండే సీన్స్ ఇంకా బాగా పండేవి. అలా లేనప్పుడు వాటిని అసలు ఎత్తుకోకుండా ఉండాల్సింది.
హైలెట్స్: ఈ సినిమాలో హైలెట్ మాత్రం అల్లరి నరేష్. అతన్ని ఆ పాత్రకు ఊహించిన దర్శకుడు చాతుర్యం. ‘నేను’, ‘గమ్యం’, ‘శంభో శివ శంభో’ వంటి చిత్రాల్లో నరేష్ చేసిన పాత్రలు ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆ లిస్ట్ లోనే ఈ సినిమా చేరుతుంది. కిందటేడాది ‘మహర్షి’ సినిమాలో ఒక మంచి పాత్ర పోషించిన నరేష్.. ఇప్పుడు ఈ విధ్యమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తనలోని నటుడుని మరోసారి ఆవిష్కరింపచేసుకున్నారు. అలాగే ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ లాయర్‌ ఆద్య పాత్రలో జీవించిందనే చెప్పాలి. రాధా ప్రకాశ్‌గా ప్రియదర్శి, కిషోర్‌ అనే పోలీస్‌ పాత్రలో హరిశ్‌ ఉత్తమన్‌, సంతోష్‌గా నటుడు ప్రవీణ్‌ అదరకొట్టారు.
మైనస్ లు: సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే డల్ గా అయ్యింది. స్పీడు తగ్గింది.అలాగే సీన్స్ కొంత రొటీన్‌గానే సాగుతాయి. పెద్ద ఎక్సైటింగ్ గా అనిపించవు. క్లైమాక్స్ కూడా సినిమాకు తగినంత స్ట్రాంగ్ కంటెంట్ తో లేదన్నది నిజం. అలాగే సినిమా మొత్తం ఎక్కడా రిలీఫ్ అనేది ఇవ్వరు. చాలా సీరియస్ గా నడిపారు.
టెక్నికల్ గా : తొలి చిత్రం దర్శకుడు విజయ్ తన సత్తా మొత్తం ఈ సినిమాలో చూపించారు. అన్ని డిపార్టమెంట్స్ నుంచి పూర్తి స్దాయి అవుట్ ఫుట్ తీసుకున్నారు. డైలాగులు సినిమాకు ప్రాణంగా నిలిచాయి. శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీతం జస్ట్ ఓకే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది, సిధ్‌ కెమెరా వర్క్, ఆర్ట్ డిపార్మెంట్ బాగున్నాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.
ఫైనల్ థాట్ : 'సామాజిక ఔన్నత్యానికి గీటురాయి సంపద, నాగరికతలు కావు; అందులో కనిపించే మానవతా విలువలు' మానవ హక్కుల మీద అప్పుడెప్పుడో వచ్చిన అంకురం సినిమా..మళ్లీ ఇన్నాళ్లకు ఓ నాంది. కమర్షియల్ గా వర్కవుట్ అయితేనే ఇలాంటివి మరిన్ని వస్తాయి. ---సూర్య ప్రకాష్ జోశ్యుల Rating:2.75
సంస్థ‌: ఎస్వీ 2 ఎంట‌ర్‌టైన్‌మెంట్‌; నటీనటులు: అల్లరి నరేశ్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌, ప్రియదర్శి, హరీశ్‌ ఉత్తమన్‌, ప్రవీణ్‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, విన‌య్ వ‌ర్మ తదితరులు సంగీతం: శ్రీచరణ్‌ పాకాల; ఎడిటింగ్‌: చోటా కె ప్రసాద్‌; సినిమాటోగ్రఫీ: సిధ్‌; పాట‌లు: చైత‌న్య ప్ర‌సాద్‌, శ్రీమ‌ణి; క‌ళ‌: బ‌్ర‌హ్మ క‌డ‌లి; మాటలు: అబ్బూరి రవి, కథ: తూమ్‌ వెంకట్‌, నిర్మాత: సతీశ్‌ వేగేశ్న; దర్శకత్వం: విజయ్‌ కనకమేడల; విడుదల: 19-02-2021

Latest Videos

click me!