టాలీవుడ్ ని మరోసారి డ్రగ్స్ అంశం కలవరపెడుతోంది. నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో అతడి నుంచి పోలీస్ లు మరింత సమాచారం రాబడుతున్నారు. ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో తెలుసుకునేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది సినీతారలు, వ్యాపారవేత్తల పేర్లు బయటకి వస్తున్నాయి.
అషురెడ్డి, సురేఖ వాణి, ఆమె కుమార్తె సుప్రీత, నటి జ్యోతి లాంటి వారి ఫోన్ నంబర్స్ కేపీ చౌదరి కాల్ లిస్ట్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీనితో ఆ కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఇంతలోనే వీరందరికి కేపీ చౌదరితో సంబంధాలు ఉన్నట్లు కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనితో డ్రగ్స్ తో కూడా వీరికి సంబంధం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పటికే అషురెడ్డి ఈ వివాదంపై స్పందించి తనపై వస్తున్న వార్తలని తీవ్రంగా ఖండించింది. ఆ నిర్మాతతో తనకి సంబంధమే లేదని సోషల్ మీడియాలో అషురెడ్డి పోస్ట్ చేసింది. నిజం నిరూపించుకునేందుకు అవసరం అయితే విచారణకి కూడా తాను సిద్ధం అని అషురెడ్డి తెలిపింది.
తాజాగా నటి జ్యోతి కూడా ఈ వివాదంపై స్పందించింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రొమాంటిక్ కామెడీ పాత్రలతో నటి జ్యోతి మంచి గుర్తింపు తెచ్చుకుంది. జ్యోతి వ్యాంప్ తరహా పాత్రలు కూడా చేసింది. ఆమె ఎలాంటి వ్యాంప్ రోల్ చేసినా అందులో కాస్త కామెడీ టచ్ ఉంటుంది. ఎవడిగోల వాడిది చిత్రంలో 'సమర్పించేసుకుంటాను' అంటూ నవ్వించిన జ్యోతి ఆ తర్వాత దరువు, అల్లరి నరేష్ యముడికి మొగుడు లాంటి చిత్రాల్లో మెరిసింది.
ఈ వివాదంపై జ్యోతి మాట్లాడుతూ.. నిన్నటి నుంచి మీడియాల్లో నా అనుమతి లేకుండా నా ఫోటోలని ప్రచురిస్తూ హంగామా చేస్తున్నారు. మహిళని కాబట్టి ఈజీగా టార్గెట్ చేస్తున్నారు. అసలు విచారణలో ఉన్న కేసులో ఎలాంటి వాస్తవాలు తేలకముందే నాకు సంబంధం ఉన్నట్లు ఎలా ప్రచురిస్తారు. అంత ధైర్యం ఏంటి.. మహిళని కాబట్టి టార్గెట్ చేయొచ్చు అనుకున్నారా అంటూ ప్రశ్నించింది. నాకు డ్రగ్స్ తో ఎలాంటి సంబంధం లేదు అని జ్యోతి తెలిపింది.
కానీ నిర్మాత కేపీ చౌదరితో మాత్రం పరిచయం ఉన్నట్లు అంగీకరించింది. అతడు నాకు ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళ అబ్బాయిని మాయా ఇంట్లో వదిలేసి వెళతారు. మా అబ్బాయితో వాళ్ళ అబ్బాయి బాగా ఆడుకుంటాడు. అలాగే మేము ఫోన్ లో కూడా మాట్లాడుకుంటాం. బావున్నారా, మీ ఫ్యామిలీ మెంబర్స్ బావున్నారా అంతవరకే మాట్లాడుకుంటాం.
కావాలంటే నా కాల్ డేటా నేను డిలీట్ చేయలేదు. చెక్ చేసుకోవచ్చు. అతనితో పరిచయం ఉన్నంత మాత్రాన డ్రగ్స్ తో నాకు సంబంధం ఉన్నట్లు ఎలా చిత్రీకరిస్తారు అని జ్యోతి ప్రశ్నించింది. నాకు ఆల్కహాల్ కూడా పెద్దగా అలవాటు లేదు. ఎప్పుడైనా పార్టీలలో మాత్రమే అది కూడా కొద్దిగానే అని జ్యోతి తెలిపింది. ఇలా తప్పుడు వార్తలు వేస్తే మాకు కుటుంబ సభ్యులు ఉంటారు.. వాళ్ళు ఎంతగా భాదపడతారో అని ఆలోచించారా అని జ్యోతి ప్రశ్నించింది.
నేను నటిని.. ఆయన నిర్మాతగా ఉన్నారు. కాబట్టి నటీనటులు, నిర్మాతల మధ్య ఫోన్ కాంటాక్ట్స్ సహజంగానే ఉంటాయి అని జ్యోతి క్లారిటీ ఇచ్చింది. డ్రగ్స్ తో తనకి సంబంధం ఉన్నట్లు తప్పుడు వార్తలు రాయొద్దని జ్యోతి కోరింది.