బెంగళూరు రేవ్ పార్టీ సంఘటన నటి హేమని వదిలిపెట్టడం లేదు. హేమ జైలు నుంచి బెయిల్ పై బయటకి వచ్చింది. ఈ వివాదం కాస్త సద్దుమణిగింది. మా అసోసియేషన్ కూడా నటి హేమపై ఉన్న సస్పెన్షన్ ని ఎత్తివేసింది. ఇక అంతా ఓకె.. హేమకి డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో ఊరట లభించినట్లే అని అంతా అనుకున్నారు.
కానీ తాజాగా బెంగళూరు పోలీసులు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చారు. బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంపై పోలీసులు తాజాగా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అందులో నటి హేమ తో పాటు మొత్తం 88 మందిని నిందితులుగా పేర్కొన్నారు. హేమకి ఊహించని షాక్ ఇస్తూ ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. దీనివల్ల హేమకి మరిన్ని చిక్కులు తప్పేలా లేవు.
మొత్తం 1000కి పైగా పేజీలతో పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. హేమ వాడిన డ్రగ్స్ గురించి కూడా పోలీసులు ఛార్జ్ షీట్ లో ప్రస్తావించారు. ఆమె ఎండీఎంఏ డ్రగ్స్ వాడినట్లు నిర్దారణ అయిందని పేర్కొన్నారు. ఎండీపీఎస్ సెక్షన్ 27 కింద హేమపై పోలీసులు కేసు నమోదు చేశారు. హేమ మాత్రం తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని ఇటీవల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ అయిన నేపథ్యంలో హేమ ఎలా స్పందిస్తుందో చూడాలి.
హేమ రేవ్ పార్టీలో పాల్గొనడం, డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించడం, ఆమె అరెస్ట్ కావడం లాంటి వ్యవహారాలతో మా అసోసియేషన్ కఠిన నిర్ణయం తీసుకుంది. హేమ మా సభ్యత్వాన్ని తొలగిస్తూ సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే హేమ బెయిల్ పై విడుదల అయ్యాక తాను నిర్దోషిని అంటూ పలు మీడియా ఇంటర్వ్యూలలో పేర్కొంది. దీనితో మా అసోసియేషన్ ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేసింది. ఇప్పుడు మళ్ళీ హేమపై ఛార్జ్ షీట్ దాఖలు కావడంతో మా అసోసియేషన్ నిర్ణయం ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తిగా మారింది.