రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీల‌కు ఆ పేర్లు ఎలా వ‌చ్చాయో తెలుసా?

First Published | Oct 15, 2024, 10:31 PM IST

Cricket Sporting Legacy Story: క్రికెట్ భార‌త జాతీయ క్రీడ కాక‌పోయినా మన దేశంలో అంత‌కుమించిన ఆద‌ర‌ణ ఉంది. క్రికెట్ టోర్నీ ఏదైనా భార‌త్ లో బ్ర‌హ్మ‌ర‌థం ప‌డ‌తారు. అయితే, భార‌త క్రికెట్ చ‌రిత్ర‌ను గ‌మ‌నిస్తే చాలా ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు ఉన్నాయి. దేశ‌వాళీ టోర్న‌మెంట్లు అయిన రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీల‌కు ఆ పేర్లు ఎలా వ‌చ్చాయ‌నే విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.
 

Sachin Tendulkar, MS Dhoni, virat kohli

Cricket Sporting Legacy Story : భారత క్రికెట్ చరిత్రలో రంజీ, దులీప్ ట్రోఫీలకు చాలా ముఖ్యమైన స్థానం ఉంది. ఈ టోర్నమెంట్‌లకు ఈ పేర్లు రావ‌డం వెనుక ఒక రాజ కుటుంబ క్రీడాకారుల నేప‌థ్యం ఉంది. ఈ రెండు టోర్న‌మెంట్లు రావ‌డానికి  ఇద్ద‌రు గొప్ప ఆటగాళ్లు నేరుగా గుజరాత్‌లోని జామ్‌నగర్ రాజ కుటుంబంతో సంబంధం క‌లిగి ఉన్నారు. ఇదే రాజకుటుంబం వారసుడిగా భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజాను ఎంచుకుంది.

ఇప్పుడు సింహాసనాన్ని అజయ్ జడేజాకు అప్పగిస్తున్నట్లు జామ్‌నగర్ రాజకుటుంబం ఇటీవల ప్రకటించింది. ఈ అనుబంధం క్రికెట్ చరిత్రను, ఈ రాజకుటుంబాన్ని మరింత ఉత్తేజపరుస్తుంది. జామ్‌నగర్ రాజకుటుంబంతో రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీలు ఎలా ముడిపడి ఉన్నాయ‌నే విష‌యాలు గ‌మ‌నిస్తే ఆసక్తిని కలిగించే విషయాలు ఉన్నాయి. 

మహారాజ్ రంజిత్‌సిన్హ్జీ (రంజీ ట్రోఫీ)

భారత క్రికెట్ పితామహుడిగా పరిగణించబడే జామ్‌నగర్ (1872–1933) మహారాజా కుమార్ శ్రీ రంజిత్‌సిన్హ్జీ గౌరవార్థం రంజీ ట్రోఫీకి పేరు పెట్టారు. 'రంజీ' అని కూడా పిలువబడే మహారాజ్ రంజిత్‌సిన్హ్జీ భారత క్రికెట్‌లోని అత్యంత ప్రసిద్ధ పేర్లలో ఒకరు. ఆయ‌న భారత క్రికెట్ జట్టులో సభ్యుడు కానప్పటికీ, అతను ఇంగ్లాండ్ తరపున టెస్ట్ క్రికెట్ ఆడాడు. అక్కడి క్రికెట్ ప్రపంచంలో గొప్ప బ్యాట్స్‌మెన్‌గా పేరు పొందాడు.

రంజిత్‌సిన్హ్జీ తన అపూర్వమైన ఆట‌ నైపుణ్యంతో క్రికెట్‌లో బ్యాటింగ్‌లో కొత్త ప్రమాణాలను నెలకొల్పాడు. అతను 'లెగ్ గ్లాన్స్' షాట్‌కు ప్రసిద్ధి చెందాడు, ఇది అప్పట్లో బ్యాట్స్‌మెన్‌లకు కొత్త శైలి. 1934లో భారత దేశవాళీ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నీకి అతని గౌరవార్థం 'రంజీ ట్రోఫీ' అని పేరు పెట్టారు.


మహారాజ్ దులీప్ సిన్హ్జీ (దులీప్ ట్రోఫీ)

దులీప్ ట్రోఫీకి రంజిత్ సిన్హ్జీ మేనల్లుడు మహారాజ్ కుమార్ శ్రీ దులీప్ సిన్హ్జీ (1905-1959) పేరు పెట్టారు. దలిప్‌సిన్హ్జీ కూడా అద్భుతమైన క్రికెటర్. అత‌ని మామ రంజిత్‌సిన్హ్‌జీ మాద‌రిగానే ఆయ‌న కూడా ఇంగ్లండ్ తరపున టెస్ట్ క్రికెట్ ఆడాడు. దులీప్ సింగ్జీ తన అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్‌కు ప్రసిద్ధి చెందాడు. అతని శైలి కూడా రంజీని ప్రతిబింబిస్తుంది.

దులీప్ సింగ్జీ చిన్న వయస్సులోనే క్రికెట్‌లో గొప్ప విజ‌యాలు అందుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు గాయాల కారణంగా అతని క్రికెట్ కెరీర్ చాలా కాలం కొనసాగలేదు. అతని క్రికెట్ సేవలను గౌరవించటానికి, 'దులీప్ ట్రోఫీ' 1961లో ప్రవేశపెట్టారు. ఇది భారత దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్టాత్మకమైన ఫస్ట్-క్లాస్ టోర్న‌మెంట్. 

Sachin-Dhoni-Ashwin

దిలీప్ సింగ్ 1920 లలో ఇంగ్లండ్‌కు వెళ్లి కళాశాల స్థాయిలో క్రికెట్ ఆడాడు. బ్యాట్స్‌మెన్‌గా అరంగేట్రం చేసిన దిలీప్ బౌలింగ్ కూడా బాగా చేయగలడు. కాలేజీ స్థాయిలో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగులకు ఏడు వికెట్లు కూడా తీశాడు. తరువాత అతను ససెక్స్ కౌంటీ క్లబ్‌కు ఆడటం ప్రారంభించాడు. తన చివరి సీజన్ 1932లో ససెక్స్ కెప్టెన్‌గా కూడా అయ్యాడు. 

అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ భారతదేశంలో ప్రచారం పొందడం ప్రారంభించడంతో దిలీప్ కూడా భారతదేశానికి తిరిగి వచ్చాడు. అతను టీమ్ ఇండియా చీఫ్ సెలక్టర్‌గా పనిచేశాడు. స్వాతంత్య్రం తరువాత, అతను భారత ప్రభుత్వంలో పనిచేశాడు. విదేశీ వ్యవహారాల శాఖలో భాగంగా దిలీప్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలోని భారత రాయబార కార్యాలయంలో పనిచేశారు.

క్రికెట్‌కు జామ్‌నగర్ రాజ కుటుంబం అందించిన సేవ‌లు

జామ్‌నగర్‌లోని రాజకుటుంబానికి క్రికెట్‌తో లోతైన అనుబంధం ఉంది. రంజిత్‌సిన్హ్జీ, దులీప్ సిన్జీ మాత్రమే గొప్ప క్రికెటర్లు, కానీ ఈ కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా క్రీడలతో సంబంధం కలిగి ఉన్నారు. జామ్‌నగర్‌కు చెందిన ప్రస్తుత జామ్ సాహెబ్ శత్రుసల్యసింగ్‌జీ, దిగ్విజయ్‌సింగ్‌జీ రంజిత్‌సింగ్‌జీ జడేజా కూడా ఫస్ట్‌క్లాస్ క్రికెటర్లు. ఇప్పుడు, ఈ క్రికెట్ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళుతూ అజయ్ జడేజా జామ్‌నగర్ రాజకుటుంబానికి వారసుడిగా ప్రకటించారు.

అజయ్ జడేజా అంటే భారత క్రికెట్‌లో సుపరిచితమైన పేరు. అతను భారతదేశం కోసం చాలా ముఖ్యమైన మ్యాచ్‌లు ఆడాడు. అతని దూకుడు బ్యాటింగ్, వ్యూహాత్మక చతురతకు ప్రసిద్ధి చెందాడు. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో అజయ్ జడేజా మొత్తం 15 టెస్ట్ మ్యాచ్‌లతో సహా 196 వన్డేల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. టెస్ట్ క్రికెట్‌లో మొత్తం 24 ఇన్నింగ్స్‌లలో సగటు 26.18తో  576 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో 37.47 సగటుతో 5359 పరుగులు చేశారు. మొత్తంగా అజయ్ జడేజా తన కెరీర్ లో 6 సెంచరీలు, 30 అర్ధ సెంచరీలతో దాదాపు 6,000 అంతర్జాతీయ పరుగులు సాధించాడు. 

Latest Videos

click me!