స్టేట్ బ్యాంక్ కస్టమర్లే టార్గెట్ :
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులు, ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్ ఉన్నవారిని టార్గెట్ చేస్తూ మోసగాళ్లు మళ్లీ రంగంలోకి దిగారు. రివార్డ్ పాయింట్ల పేరుతో మోసాలు చేస్తున్నారు. రివార్డ్ పాయింట్లు వచ్చాయని, వెంటనే వాడుకోవాలని ఎస్ఎంఎస్ పంపి మోసం చేస్తున్నారు.
ఉదాహరణకు మీకు 9,000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన రివార్డ్ పాయింట్లు వచ్చాయని... ఈ పాయింట్లు వాడుకునేందుకు గడువు ఈరోజుతో ముగుస్తుందని నమ్మిస్తారు. వెంటనే వీటిని ఉపయోగించుకోవడానికి కింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని మెసేజ్ ఉంటుంది. డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఖాతా నంబర్, మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ వంటి బ్యాంక్ ఖాతా వివరాలు అడుగుతారు.
ఇది నిజమేనని నమ్మి వివరాలను అందిస్తే అంతే సంగతి... ఈ సమాచారం సైబర్ మోసగాళ్లకు చేరుతుంది. దీంతో కేటుగాళ్లు క్షణాల్లో మన బ్యాంక్ ఖాతాను ఖాళీ చేస్తారు. అంతేకాదు మన బ్యాంక్ అకౌంట్ ని ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కూడా ఉపయోగించవచ్చు.
ప్రస్తుతం పండగ సీజన్ కాబట్టి చాలామంది డెబిట్, క్రెడిట్ కార్డులతో చెల్లింపులు చేస్తారు. కాబట్టి మెసేజ్ రాగానే నిజంగానే రివార్డ్ పాయింట్లు వచ్చాయని కస్టమర్లు నమ్ముతారు... దీంతో చాలా ఈజీగా మోసపోతున్నారు.