మీరు కాండీ క్రష్ ఆడుతున్నారా? అయితే డేంజర్‌లో ఉన్నారు

First Published | Jan 15, 2025, 7:44 PM IST

మొబైల్ మీ చేతిలో ఉందంటే మీకు ప్రైవసీ లేనట్టే. ఎందుకంటే అందులో ఉండే కాండీ క్రష్ లాంటి కొన్ని యాప్స్ మీ పర్సనల్ డేటాని తీసుకొని మనల్ని వాచ్ చేస్తున్నాయి. ఇదేదో మామూలుగా చెబుతున్న మాట కాదు. ఓ ప్రముఖ మీడియా వెల్లడించిన వివరాల్లో ఈ సమాచారం ఉంది. ఈ స్కామ్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం రండి. 
 

కాండీ క్రష్ సాగా, టిన్డర్ వంటి ప్రముఖ యాప్‌ల నుండి వినియోగదారుల సమాచారం లీకైనట్లు వస్తున్న వార్తలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన ఈ గేమింగ్ యాప్ లను కోట్లాది మంది ఆడుతున్నారు. మరి అంతమంది వ్యక్తిగత సమాచారం దొంగతనం జరిగిందంటే ఇదెంత పెద్ద స్కామో అర్థం చేసుకోవచ్చు. 
 

ఒకప్పుడు గేమ్స్ అంటే చక్కగా ఓ చోట కూర్చొని నలుగురు కలిసి ఆడుకొనేలా ఉండేవి. ఇప్పుడు కూడా ఫ్రీ ఫైర్, పబ్జీ లాంటి కొన్ని గేమ్స్ నలుగురు కూర్చొని కలిసి ఆడుకుంటున్నారు. ఇవి ఎంత డేంజరో ఇప్పటికే జరిగిన కొన్ని సంఘటనలు రుజువు చేస్తున్నాయి. అందుకే పబ్జీ లాంటి గేమ్స్ ని ఇండియాలో బ్యాన్ చేశారు. ఇంకా బ్యాన్ కాని ఎన్నో ప్రమాదకరమైన గేమ్స్ మొబైల్ లో దర్శనమిస్తూనే ఉన్నాయి. కొన్ని గేమ్స్ మైండ్ రిలాక్సేషన్ కోసం ఆడేవిగా ఉంటే, మరికొన్ని తెలివి తేటలు పెంచుకొనేవిగా ఉంటాయి. 
 


ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది ప్రతిరోజూ ఉపయోగించే కొన్ని యాప్‌లు, గేమ్‌లు మనం అనుకున్నంత సురక్షితంగా ఉండవు. జనవరి 9న 404 మీడియా విడుదల చేసిన నివేదిక ఇలాంటి నిజాలను వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘించి ప్రజాదరణ పొందిన కొన్ని యాప్‌లు తమ వినియోగదారుల రియల్-టైమ్ లొకేషన్‌లను యాక్సెస్ చేసి, వారి చర్యలను వాచ్ చేస్తున్నాయని ఈ నివేదిక షాకింగ్ విషయాలు వెల్లడించింది. 
 

ఈ డేటా ఉల్లంఘనకు సంబంధించి కచ్చితమైన వివరాలు ఇంకా తెలియనప్పటికీ హ్యాకర్ విడుదల చేసిన నమూనా డేటాలో కాండీ క్రష్ సాగా, టిన్డర్ వంటి ప్రముఖ యాప్‌లు ఉన్నాయి. ఆ నివేదిక ప్రకారం హ్యాకర్ గ్రేవి అనలిటిక్స్ ద్వారా అనేక టెరాబైట్ల వినియోగదారుల డేటాను యాక్సెస్ చేశారు. ఇది అమెజాన్ క్లౌడ్ ఎన్విరాన్‌మెంట్ ద్వారా యాక్సెస్ అయినట్లు తెలుస్తోంది. 

ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC) గ్రేవి అనలిటిక్స్, దాని అనుబంధ సంస్థ వెన్టెల్‌ ఏం చేసిందంటే.. వినియోగదారుల అనుమతి లేకుండా వారి లొకేషన్ డేటాను సేకరించి అమ్మేసింది.

వైట్ హౌస్, క్రెమ్లిన్, వాటికన్ సిటీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక సైనిక స్థావరాలతో సహా 30 మిలియన్లకు పైగా లొకేషన్ డేటా పాయింట్‌లు లీక్ అయిన డేటాబేస్‌లో ఉన్నాయని నివేదికలో ఉంది. 

గ్రేవి అనలిటిక్స్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు సాధారణంగా వినియోగదారు సమాచారాన్ని సేకరించవు. దానికి బదులుగా ఆండ్రాయిడ్, iOS పరికరాల్లో వినియోగదారు డేటాను యాక్సెస్ చేయడానికి వారు తరచుగా సేవా ఏజెన్సీలతో కలిసి పనిచేస్తారు. 

మీ వ్యక్తిగత డేటాను మీరు రక్షించుకోవాలంటే ఇకపై మీరు ఏ యాప్ ఇన్ స్టాల్ చేసినా అవసరమైన అనుమతులు మాత్రమే ఇవ్వండి. ప్రతి దానికి పర్మీషన్ ఇచ్చేస్తే మీ వ్యక్తిగత సమాచారం దొంగతనానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఐఫోన్ వాడుతూ ఉంటే "Ask Apps Not to Track" ఫీచర్‌ని ఉపయోగించండి.
 

Latest Videos

click me!