గూగుల్ నివేదిక ప్రకారం CIBIL స్కోర్ తెలుసుకోవడానికి ఇండియన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. చెక్ ఫీచర్ ప్రారంభించినప్పటి నుండి 5 కోట్ల మందికి పైగా భారతీయులు దీన్ని ఉపయోగించారు. మీరు హోమ్ లోన్, కార్ లోన్, మరేదైనా లోన్ తీసుకోవాలనుకుంటే మంచి సిబిల్ స్కోర్ కలిగి ఉండటం తప్పనిసరి. అయితే సిబిల్ స్కోర్‌ని ఎలా చెక్ చేయాలో మీకు తెలుసా? చాలా మంది లోన్ తీసుకునేటప్పుడు మాత్రమే సిబిల్ స్కోర్ చెక్ చేసుకుంటారు. సిబిల్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం చాలా అవసరం. దీన్ని బట్టి ఫైనాన్షియల్ వ్యవహారాలను ఎలా నిర్వహించాలో ఒక అవగాహన ఉంటుంది.
సిబిల్ స్కోర్ ఎంత ఉందో తెలుసుకోవాలంటే చాలా బ్యాంకులు ఛార్జ్ వసూలు చేస్తాయి. కొన్ని బ్యాంకులు సంవత్సరానికి ఒకసారి చెక్ చేసుకోవడానికి ఎలాంటి ఛార్జ్ చేయవు. అయితే ఎక్కువ సార్లు సిబిల్ చెక్ చేస్తే మాత్రం మినిమం ఫీ కట్టాల్సి ఉంటుంది.
Google Pay ద్వారా CIBIL స్కోర్ చెక్ చేసుకోవచ్చు
Google Pay ద్వారా CIBIL స్కోర్‌ను సులభంగా, ఉచితంగా తనిఖీ చేయవచ్చు. గూగుల్ పే సిబిల్ స్కోర్‌ను చూపించడమే కాకుండా నిర్దిష్ట నెల, సంవత్సరంతో సహా ఆలస్య చెల్లింపుల వివరాలను కూడా అందిస్తుంది. భారతీయులు తరచూ సిబిల్ చెక్ చేస్తూ ఉంటారని ఇటీవల గూగుల్ ఓ నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం సిబిల్ స్కోర్ చెక్ ఫీచర్ ప్రారంభించినప్పటి నుండి 5 కోట్ల మందికి పైగా భారతీయులు ఈ సదుపాయాన్ని ఉపయోగించారు.
సిబిల్ స్కోర్ అనేది వ్యక్తి క్రెడిట్ హిస్టరీని ప్రాతిపదికగా సిబిల్ (Credit Information Bureau India Limited) అనే సంస్థ ఇస్తున్న క్రెడిట్ స్కోరింగ్ రిపోర్టు. ఇది 300 నుండి 900 వరకు రేంజ్‌లో ఉంటుంది. స్కోర్ ఎక్కువగా ఉంటే వ్యక్తికి బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ నుండి లోన్స్, క్రెడిట్ కార్డ్స్ పొందడం సులభం అవుతుంది. సాధారణంగా 750 కంటే ఎక్కువ స్కోర్ ఉన్నవారికి మంచి క్రెడిట్ హిస్టరీ ఉందని లెక్క. సిబిల్ స్కోర్ మంచి స్థాయిలో ఉంటే తక్కువ వడ్డీ రేట్లకు కూడా లోన్స్ పొందవచ్చు. సిబిల్ రిపోర్ట్‌లో పాత క్రెడిట్ కార్డ్స్, లోన్స్ చెల్లింపులు, డిఫాల్ట్స్ లేదా లేట్ పేమెంట్స్ వంటి వివరాలు ఉంటాయి. ఇవి సిబిల్ స్కోర్‌ను ప్రభావితం చేస్తాయి.
సిబిల్ స్కోర్‌ను ప్రభావితం చేసే అంశాలు
సమయానికి క్రెడిట్ కార్డ్స్, లోన్స్ పేమెంట్స్ చేస్తే సిబిల్ స్కోర్ బాగా పెరుగుతుంది. మొత్తం క్రెడిట్ లిమిట్ లో ఎంత వాడుతున్నారో అన్న విషయం కూడా చాలా ముఖ్యం. ఎన్ని రకాల లోన్స్ అంటే హోం లోన్, పర్సనల్ లోన్, ఆటో లోన్ ఇలా ఎన్ని లోన్స్ మీరు తీసుకున్నారు? వాటికి సక్రమంగా కడుతున్నారా లేదా అన్న విషయం కూడా సిబిల్ స్కోర్ పై ప్రభావం చూపుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్కువసార్లు క్రెడిట్ కోసం మీరు దరఖాస్తు చేయడం వల్ల మీ సిబిల్ స్కోర్ తగ్గవచ్చు.
సిబిల్ స్కోర్ ఎలా పెంచుకోవాలి?
అన్ని క్రెడిట్ పేమెంట్స్‌ను సమయానికి చెల్లించండి. క్రెడిట్ కార్డు లిమిట్‌ను ఎక్కువగా వాడకుండా ఉండటం ద్వారా మీ సిబిల్ ను పెంచుకోవచ్చు. పాత క్రెడిట్ కార్డ్స్‌ను ఉపయోగించకపోయినా మూసివేయకుండా ఉండటం కూడా మీ సిబిల్ పెరగడానికి ఉపయోగపడుతుంది.
సిబిల్ అధికారిక వెబ్‌సైట్ (CIBIL) ద్వారా నెలకు ఒకసారి ఉచితంగా సిబిల్ స్కోర్‌ను చెక్ చేయవచ్చు.
Google Pay ద్వారా CIBIL స్కోర్‌ను తనిఖీ చేయడం ఎలా?
మొదట Google Pay యాప్‌ను తెరవండి.
హోమ్‌పేజీలో Manage Your Money ఆప్షన్స్ దగ్గరకు వెళ్లండి
Check Your CIBIL score for Free ఆప్షన్ పై క్లిక్ చేయండి.
మొదటిసారి మీరు సిబిల్ స్కోర్‌ని చెక్ చేస్తున్నట్లయితే కొన్ని వివరాలను నమోదు చేయాలి.
మీ PAN కార్డ్ ఆధారంగా పేరు, మీ ఆర్థిక ఖాతాలకు లింక్ చేయబడిన ఫోన్ నంబర్, ఇమెయిల్ ID, PAN కార్డ్ నంబర్‌ను నమోదు చేయండి.
తర్వాత Google Pay మీ CIBIL స్కోర్, క్రెడిట్ నివేదికను స్క్రీన్‌పై చూపిస్తుంది.
దాని కింద మీకు సూచనలు కూడా చేస్తుంది. ఏ విషయంలో మీ సిబిల్ తక్కువగా ఉంది. ఎలా దాన్ని కరెక్ట్ చేసుకోవాలి వంటి విషయాలపై సూచనలు కూడా చేస్తుంది.