మీరు బంగారం అమ్మాలనుకుంటున్నారా? ఈ రూల్స్ తప్పనిసరిగా తెలుసుకోండి

First Published | Nov 30, 2024, 5:14 PM IST

బంగారం ధరలు పెరుగుతుండటంతో చాలా మంది డబ్బులు ఎక్కువ వస్తాయని ఉన్న బంగారాన్ని అమ్మాలని కూడా అనుకుంటారు. అయితే బంగారాన్ని అమ్మేటప్పుడు ఆదాయపు పన్ను శాఖ రూల్స్ పాటించడం తప్పనిసరి. ఆ నియమాలు ఏంటో ఇక్కడ క్లియర్ గా తెలుసుకుందాం రండి. 

బంగారాన్ని ఏ రూపంలో దాచుకున్నా ఆదాయపు పన్ను కట్టాల్సి ఉంటుంది. బంగారం ETFలు, డిజిటల్ గోల్డ్, నగలు, బంగారు బాండ్లు ఇలా వివిధ రూపాల్లో బంగారాన్ని చాలా మంది దాచుకుంటారు. ఆస్తి రూపంలో దాచుకున్న గోల్డ్ కి మాత్రమే టాక్స్ కట్టాలని చాలా మంది అనుకుంటారు. అయితే బంగారాన్ని అమ్మినా టాక్స్ కట్టాలి. దీర్ఘకాలిక, స్వల్పకాలిక మూలధన లాభాల పన్నులు, పన్ను మినహాయింపులు, NRIలకు వర్తించే పన్ను నియమాల గురించి ఇక్కడ తెలుసుకోండి.

గోల్డ్ ETFలు

గోల్డ్ ETFలపై దీర్ఘకాలిక మూలధన లాభాలకు (LTCG) 12.5% పన్ను విధిస్తారు. ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను మినహాయింపు పరిమితి రూ. 1.25 లక్షల వరకే ఉంటుంది. ఆపై విలువ కలిగిన గోల్డ్ ఈటీఎఫ్ లకు టాక్స్ తప్పదు. ఈక్విటీ షేర్ల మాదిరిగా కాకుండా (ఒక సంవత్సరం), గోల్డ్ ETFలకు LTCG వ్యవధి రెండు సంవత్సరాలు ఉంటుంది. స్వల్పకాలిక మూలధన లాభాలకు (STCG) పెట్టుబడిదారుడి ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు.


నగలు, నాణేలు

భారతదేశంలో బంగారు నగలు, నాణేలు, బిస్కెట్ల రూపంలో ఎక్కువ మంది ఆస్తి దాచుకుంటారు. 24 నెలల కంటే ఎక్కువ కాలం పాటు నిల్వ కలిగి ఉన్న బంగారంపై లాభాలను LTCGగా వర్గీకరించి 12.5 % పన్ను విధిస్తారు. 24 నెలల లోపు లాభాలను STCGగా వర్గీకరించి పెట్టుబడిదారుడి ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు.

NRIలు..

ప్రవాస భారతీయులు (NRIలు) బంగారు బాండ్లను మినహాయించి, నగలు, నాణేలు, బిస్కెట్లు, డిజిటల్ గోల్డ్ వంటి ఇతర రూపాల్లో బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. NRIలకు వర్తించే పన్ను రేట్లు భారతీయులకు విధించినట్లుగానే ఉంటాయి. అయితే గోల్డ్ ETFలకు TDS వర్తిస్తుంది.

డిజిటల్ గోల్డ్

డిజిటల్ గోల్డ్.. ఇటీవల బంగారంలో పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన, సురక్షితమైన మార్గంగా మారింది. దీని ద్వారా పెట్టుబడిదారులు ఆన్‌లైన్‌లో బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. అయితే డిజిటల్ గోల్డ్‌పై పన్ను భౌతిక బంగారం మాదిరిగానే ఉంటుంది. 24 నెలల కంటే ఎక్కువ కాలం పాటు కలిగి ఉన్న డిజిటల్ గోల్డ్ లాభాలకు ఆదాయపు పన్ను శాఖ 12.5% పన్ను విధిస్తుంది. స్వల్పకాలిక లాభాలకు పెట్టుబడిదారుడి ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం STCG పన్ను విధిస్తారు.

బంగారు బాండ్లు

బంగారు బాండ్లు ప్రత్యేక ప్రయోజనాన్ని అందిస్తాయి. గడువు ముగిసన తర్వాత పొందిన మూలధన లాభాలకు పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే పెట్టుబడి వ్యవధిలో సంవత్సరానికి 2.5% వడ్డీకి పెట్టుబడిదారుడి ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం ఆదాయపు పన్ను శాఖ ట్యాక్స్ విధిస్తుంది.

బంగారం డెరివేటివ్స్..

కమోడిటీ మార్కెట్లో ట్రేడవుతున్న బంగారం డెరివేటివ్స్ మూలధన లాభాల పన్నుకు లోబడి ఉండవు. వీటిని వ్యాపారేతర ఆదాయంగా పరిగణించి, పెట్టుబడిదారుడి నికర లాభంపై వర్తించే ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు.

బహుమతులకు పన్ను మినహాయింపు

వివాహ సమయంలో బహుమతిగా పొందిన బంగారానికి పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే దానిని తర్వాత అమ్మితే మూలధన లాభాల పన్ను కట్టాల్సి ఉంటుంది.

బంగారం స్థిరమైన పెట్టుబడి అయినప్పటికీ దానిపై వర్తించే పన్ను నియమాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బంగారం నుండి గరిష్ట ప్రయోజనం పొందడానికి పన్ను ప్రభావాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

Latest Videos

click me!