మీరు గోల్డ్‌ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? బంగారంలాంటి ఈ సూచనలు మీ కోసమే

First Published | Sep 3, 2024, 1:13 PM IST

అవసరాలు తీర్చుకోవడానికి బంగారు నగలు తాకట్టు పెట్టడం మనమందరం చేస్తుంటాం కదా. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్ని సార్లు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక్కడ తెలిపిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీ కష్టార్జితానికి సేఫ్ గా ఉండటంతో పాటు మంచి లాభం కూడా పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం రండి.
 

* నమ్మకం ఉన్న సంస్థనే ఎంచుకోవాలి
బంగారు నగలు తాకట్టు పెట్టుకుని నగదు ఇస్తామని బ్యాంకులే కాదు అనేక ప్రైవేటు సంస్థలు కూడా చెబుతుంటాయి. అయితే ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థల విషయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. ప్రభుత్వ గుర్తింపు ఆ సంస్థకు ఉందో లేదో చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని ప్రైవేటు బ్యాంకులు కూడా గోల్డ్‌ లోన్ సదుపాయం కల్పిస్తాయి. అలాంటి వాటికి కూడా ప్రభుత్వ ఆమోదం ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలి. అలాంటి వాటిలో మాత్రమే మీ బంగారు నగలు తాకట్టు పెడితే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు. 
 

* ఒప్పంద పత్రాలను బాగా చదవండి
మీరు బంగారు నగలు తాకట్టు పెట్టేటప్పుడు సదరు బ్యాంకు గాని, ఫైనాన్స్‌ సంస్థ ఇచ్చిన పత్రాలను జాగ్రత్తగా చదవండి. ప్రతి నిబంధనను అర్థం చేసుకోండి. ఎక్కడైన అనుమానాలు ఉంటే వెంటనే అక్కడ అధికారులను అడిని డౌంట్స్‌ తీర్చేసుకోండి. మీరు తాకట్టు పెట్టిన బంగారం సేఫ్‌గానే ఉంటుందని మీకు నమ్మకం కలిగితేనే తాకట్టు పెట్టండి. ముఖ్యంగా వడ్డీ, వేలం విషయంలో విషయాలను అడిగి మరీ తెలుసుకోండి. 

* మారుతున్న వడ్డీ రేట్లపై దృష్టి ఉంచండి
మార్కెట్‌ ఒడిదొడుకులకు అనుగుణంగా వడ్డీ రేట్లు కూడా మారుతుంటాయి. మీరు నగలు తాకట్టు పెట్టినప్పుడు ఎంత ఉంది. తర్వాత పెరిగిందా, తగ్గిందా వంటి వివరాలు ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకుంటూ ఉండాలి. అవే కాకుండా ఇతర ఛార్జీలు కూడా ఎలా వేస్తున్నారో తెలుసుకోవాలి. వీటిని అనుసరించడం వల్ల తాకట్టు ఎప్పుడు విడిపించుకోవాలి, కొనసాగించాలా వంటి విషయాలపై అవగాహన వస్తుంది. దీన్ని బట్టి భవిష్యత్తు కార్యాచరణను అంచనా వేసుకోవచ్చు. 


* ఇన్సూరెన్స్‌ ఉందో లేదో తెలుసుకోండి
మీరు తాకట్టు పెట్టిన బంగారానికి ఇన్సూరెన్స్ ఉందో లేదో తెలుసుకోండి. ఎందుకంటే ప్రమాదాలు ఎప్పుడు వస్తాయో ఎవరికీ తెలియవు. ముందు జాగ్రత్తగా ప్రమాద బీమా ఉందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అదేవిధంగా ఫైనాన్స్‌ కంపెనీ లేదా బ్యాంకు ఉన్న బిల్డింగ్‌కు ఫైర్‌ సేఫ్టీ ఉందో లేదో అక్కడ ఉన్న సిబ్బందిని అడిగి తెలుసుకోండి. దొంగల నుంచి మీ సొత్తును రక్షించేందుకు వారు తీసుకుంటున్న రక్షణ చర్యల గురించి కూడా పూర్తిగా తెలుసుకోండి. ఇలా ఇన్సూరెన్స్ ఉండటం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు మీకు బీమా కవరేజీ లభిస్తుంది. 

* తప్పకుండా రసీదు తీసుకోండి
బంగారం తాకట్టు పెట్టిన తరువాత బ్యాంకు లేదా ఫైనాన్స్‌ కంపెనీ నుంచి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి. హడావుడిలో రసీదు తీసుకోవడం మరిచిపోతే ఇక మీ కష్టాలు మామూలుగా ఉండవు. అలా జరగకుండా అప్రమత్తంగా ఉండి బంగారు నగలు తాకట్టు పెట్టినట్టుగా ధృవీకరణ పత్రం తీసుకోండి. అందులో వివరాలు సరిగా ఉన్నాయో లేదో కూడా ఒకటికి రెండు సార్లు చెక్‌ చేయండి. మీరు పెట్టిన నగల సంఖ్య, బరువు, తీసుకున్న డబ్బు వివరాలు సరిగా ఉన్నాయో లేదో పరిశీలించండి. ఏమాత్రం అర్థంకాకపోయినా, తప్పుగా ఉన్నా వెంటనే సిబ్బందికి తెలపండి. ఇంటికి వెళ్లిపోయిన తర్వాత చెక్‌ చేసుకొని తేడాలున్నాయని మళ్లీ వస్తే బ్యాంకు, ఫైనాన్స్‌ సిబ్బంది మిమ్మల్నే తిరిగి అనుమానించే పరిస్థితి కలగవచ్చు. అప్రమత్తంగా ఉండండి. 

* స్వచ్ఛమైన బంగారాన్నే తాకట్టు పెట్టండి 
తక్కువ రకాల బంగారపు ఆభరణాలను తాకట్టు పెట్టడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలుంటాయి. అందుకే నాణ్యమైన బంగారాన్ని అంటే 22 కేరట్, 18 కేరట్ల బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టడం మంచిది. దీని వల్ల మీకు నగదు కూడా ఎక్కువ వస్తుంది. ఇంప్యూర్‌ నగలు తాకట్టు పెడితే సంస్థ చెక్‌ చేసి వాటి ధరకంటే తక్కువ డబ్బు ఇస్తుంది. 

* సమయానికి రుణాన్ని తీర్చండి
మీరు బంగారు నగలు తాకట్టు పెట్టేటప్పుడే ఎప్పుడు రుణం తీర్చాలన్న విషయంపై ఒక నిర్ణయానికి రండి. ఒకసారి పరిస్థితులు అనుకూలించక మీరు గోల్డ్‌ లోన్‌ తీర్చలేని పరిస్థితి ఏర్పడితే వడ్డీ అయినా గడువు ప్రకారం సక్రమంగా కట్టేయండి. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో మళ్లీ మీరు రుణం తీసుకోవాలంటే ఆ బ్యాంకులు, ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థలు మీపై నమ్మకం ఉంచుతాయి. వాల్యూడ్‌ కస్టమర్‌ అంటూ గౌరవంగా ట్రీట్‌ చేస్తాయి. వడ్డీ కట్టక, రుణం తీర్చకపోతే మీరు మీ బంగారాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.

Latest Videos

click me!