బ్యాంకులో లాకర్‌ ఓపెన్‌ చేయాలనుకుంటున్నారా? ఇవి తప్పనిసరి

First Published | Sep 8, 2024, 4:05 PM IST

కష్టపడి సంపాదించిన డబ్బు, ఇష్టపడి కొనుక్కున్ననగలు దాచుకోవడానికి ఈ రోజుల్లో ఇళ్లు అంత సేఫ్టీ కాదు. అందుకే చాలా మంది బ్యాంకుల్లోని లాకర్లలో దాచుకోవడానికి ఇష్టపడతారు. అయితే బ్యాంక్ లాకర్‌లో డబ్బు, నగలు పెట్టేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఇవి మీ ఆస్తులను సురక్షితంగా ఉంచడంలో మీకు సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 

* వస్తువుల లిస్ట్ తయారు చేయాలి..
బ్యాంక్ లాకర్‌లో మీరు పెట్టాలనుకున్న ప్రతి వస్తువు, నగలు, డబ్బు వివరాలను ఒక లిస్టులో రాసుకోవాలి. దాన్ని మీకు గుర్తుగా ఉండే ప్లేస్‌లో జాగ్రత్తగా పెట్టుకోండి. ఏదైనా అవసరమైనప్పుడు మీరు ఆ జాబితాను రిఫరెన్స్‌గా తీసుకోవచ్చు.
   
* ఇన్సూరెన్స్ చేయించుకోండి..
బ్యాంక్ లాకర్‌లో ఉన్న వస్తువులకు బీమా చేయించడం ఒక మంచి ఆలోచన.  బ్యాంక్ మీ వస్తువులకు పూర్తి భద్రత కల్పించలేకపోవచ్చు. కాబట్టి మీ ఆస్తులపై ఇన్సూరెన్స్ ఉండడం అవసరం. మరో విషయం ఏంటంటే చాలా బ్యాంకులు లాకర్‌లోని విషయాలకు తాము బాధ్యత వహించమని స్పష్టం చేస్తున్నాయి. ఫలితంగా విలువైన వస్తువులకు బీమా చేయడం మంచిది.
 

* సామగ్రిని సరిగ్గా ప్యాక్ చేయండి
బ్యాంకు లాకర్‌లో పెట్టాలనుకున్న నగలు, విలువైన వస్తువులను ప్యాకింగ్ చేసే సమయంలో వాటిని వేర్వేరు  కవర్లలో ప్యాక్‌ చేయండి. ఆ కవర్లు కూడా గట్టగా, చిరగని వాటిని ఎంచుకోవడం మంచిది. నగల్లో ఉండే కోణాల వల్ల కవర్లు చిరిగిపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో అవి ఎక్కడైన జారి పడినా మీరే నష్టపోవాల్సి వస్తుంది.  లాకర్‌కి తీసుకొచ్చే వస్తువులను సరైన భద్రతా ప్యాకింగ్‌లో ఉంచడం మంచిది.

* బ్యాంక్ రూల్స్ తెలుసుకోండి..
ముందుగా మీరు ఏ బ్యాంకులో లాకర్‌ సౌకర్యం తీసుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకొని ఆ బ్యాంక్ వివరాలు తెలుసుకోవాలి. ఆ బ్యాంక్‌ అనుసరించే నియమాలు, కండిషన్స్ తెలుసుకోవాలి. అంటే లాకర్‌ను ఎంతసేపు ఖాళీగా ఉంచొచ్చు? ఎంత సేపు నోటిఫికేషన్ లేకుండా ఉపయోగించకుండా ఉండొచ్చు వంటి విషయాలపై క్లారిటీ తెచ్చుకోవాలి.
 

Latest Videos


* వస్తువులు తరచుగా చెక్ చేయండి..
మీ బ్యాంక్ లాకర్‌లో ఉంచిన వస్తువులు సురక్షితంగా ఉన్నాయో లేదా అప్పుడప్పుడు వెళ్లి చెక్ చేయండి. ఇటీవల బ్యాంకుల్లోనూ ఫ్రాడ్‌ జరుగుతున్నాయి. ఇటీవల ఒక అతను బ్యాంకులో నగలు పెట్టగా, ఆ బ్యాంకు అధికారే సొంతానికి వాడుకున్నాడన్న వార్తలు వచ్చాయి.  చాలా కాలం వరకు సదరు వ్యక్తి చూసుకోకపోవడంతో ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇలాంటి పరిస్థితులు మీకు ఎదురవ్వకుండా ఉండాలంటే తరచూ లాకర్‌కి వెళ్లి, వస్తువులను పరిశీలించడం అవసరం.

* డ్యూయల్ యాక్సెస్ కీ విధానం బెటర్‌
లాకర్‌ను తెరిచే సమయంలో మీకు ఒక తాళం, బ్యాంక్ మేనేజర్ కు ఒక తాళం ఇస్తారు. దీన్ని డ్యూయల్‌ యాక్సెస్‌ కీ విధానం అంటారు. ఇది అన్ని విధాలుగా మంచి ఆప్షన్‌. ఎందుకంటే అధికారులు ఒక్కరే తాళం తెరవలేదు. మీరు కూడా ఒక్కరే లాక్‌ తీయలేదు. ఇద్దరూ కలిసి ఓపెన్‌ చేస్తేనే లాక్‌ ఓపెన్‌ అవుతుంది. దీనివల్ల ప్రాడ్‌ జరగడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి.  మీ కీని ఎప్పుడూ సురక్షితంగా ఉంచుకోవాలి. దాన్ని ఎవరైనా దొంగిలించినా, మీరు ఎక్కడైనా పడేసినా వెంటనే బ్యాంక్‌కి తెలియజేయాలి.
 

* నామినీకి లాకర్‌ యాక్సెస్ ఇవ్వండి 
మీరు కాకుండా మీ కుటుంబసభ్యుల్లో ఎవరో ఒకరు లాకర్‌ యాక్సిస్‌ చేసేలా బ్యాంక్‌లో రిజిస్టర్ చేయించాలి. మీరు వెళ్లలేని పరిస్థితి ఏర్పడితే అవసరాలకు లాకర్‌లోని డబ్బు, నగదు ఉపయోగించడానికి వీలవుతుంది. బ్యాంకులు మీ లాకర్‌లోని వస్తువుల కోసం పూర్తి భద్రత కల్పించలేవు. కాబట్టి సొంత ఇన్సూరెన్స్ ప్లాన్‌లు తప్పనిసరిగా ఉంచుకోండి.

* పాస్‌వర్డ్‌లు జాగ్రత్త..
మీ బ్యాంక్ లాకర్‌కు సంబంధించిన పాస్‌వర్డ్‌లు, ముఖ్యమైన డాక్యుమెంట్లను సేఫ్‌గా ఉంచుకోవాలి. ఎవరితోనూ పాస్‌వర్డ్‌లు పంచుకోవద్దు. ఒకవేళ అలా జరిగితే సైబర్‌ నేరాలకు ఛాన్స్‌ ఇచ్చినట్లే అవుతుంది. లాకర్లలో డబ్బు సంగతి ఎలా ఉన్నా, మీ అకౌంట్‌ ఖాళీ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సైబర్‌ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అలాంటివి జరగకుండా ఉండేందుకు మీరే జాగ్రత్తలు తీసుకోవాలి. బ్యాంకులు ఎటువంటి బాధ్యత వహించవని గుర్తుపెట్టుకోండి. 
 

* లాకర్‌ తెరవడానికి ఏమేం కావాలి..
లాకర్‌ తెరవాలని మీరు అనుకుంటే ముందుగా మీ ఇంటికి సమీపంలో ఉత్తమ సేవలను అందిస్తున్న బ్యాంకు గురించి తెలుసుకోండి. అక్కడ మీరు సేవింగ్స్‌ అకౌంట్‌ గాని, కరెంట్ అకౌంట్‌ గాని ఓపెన్‌ చేయాల్సి ఉంటుంది. దీని కోసం పాన్ లేదా ఆధార్ కార్డ్ అడుగుతారు. అడ్రస్‌ ప్రూఫ్‌ ఉన్న ఏదైనా కార్డు అడుగుతారు. లేటెస్ట్‌ పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌లను కూడా ఇవ్వాలి. లాకర్ కేటాయించిన తర్వాత ప్రత్యేక కీ ఇస్తారు. 

* లాకర్‌ తీసుకోవడానికి ఖర్చెంత..
లాకర్ అద్దెకు తీసుకోవడానికి అయ్యే ఖర్చు బ్యాంక్ బ్రాంచ్ ఉన్న సెంటర్‌పై ఆధారపడి ఉంటుంది. అంటే సిటీ మధ్యలో ఉంటే ఎక్కువ ఛార్జ్‌ చేస్తారు. అదేవిధంగా లాకర్ కెపాసిటీపై కూడా ఆధారపడి ఉంటుంది. మీకు కావాల్సిన బ్యాంకులో లాకర్ కెపాసిటీ అయిపోతే అదనపు ఫీజు తీసుకొని లాకర్‌ ఇస్తారు. దీని వల్ల కూడా ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. 
 

click me!