వెహికల్స్ నడిపేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అది కారైనా, బైక్ అయినా చాలా జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది. సాధారణంగా ఏ వస్తువైనా తయారు చేసేటప్పుడు వాటిని ఎలా ఉపయోగించాలని ప్రత్యేక సూచనలు ఆ వస్తువు తయారు చేసిన కంపెనీ చెబుతుంది. దాన్నే మనకు బుక్ లెట్ లా తయారు చేసి ఇస్తారు. అయితే దాన్ని 99 శాతం మంది చదవరు. కేవలం కంపెనీ ప్రతినిధులు, సిబ్బంది చెప్పింది విని ఉపయోగించేస్తాం. అయితే వారు అన్ని విషయాలు చెప్పరు. చాలా ఇంపార్టెంట్ విషయమైనా చిన్నదే కదా కొన్ని విషయాలను పట్టించుకోరు.
అలాంటి ఇంపార్టెంట్ విషయం గురించి ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. మనం సాధారణంగా బైక్ పై కాని, కారు మీద కాని ఎంత స్పీడ్ తో వెళ్తాం. ఓ 70 కి.మీ., 80 కి.మీ., వేగంతో వెళతాం. రోడ్డు ఖాళీగా ఉంటే 100, 120 కి.మీ. కూడా క్రాస్ చేసేస్తాం. ఇదే రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. ఏ వెహికల్ మీద ఎంత వేగంతో వెళ్లాలన్న విషయం చాలా మందికి తెలియదు. అందువల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా టైర్లు పేలడం అనే వాహనం వెళ్లే స్పీడ్ పై ఆధారపడి ఉంటుందని చాలా మందికి తెలియక పోవచ్చు. అయితే నిపుణులు చెప్పే విషయం ఏమిటంటే, కార్లు లేదా బైకుల్లోని టైర్లలో గాలి ఎక్కువున్నా, తక్కువున్నా పేలిపోతాయని చెబుతున్నారు.
అసలు వాహనాల టైర్లు పేలిపోవడానికి ముఖ్యమైన కొన్ని కారణాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటంటే టైర్లలో గాలి ఒత్తిడి. ఏ టైర్ కు ఎంత గాలి పట్టాలో వెహికల్ కొన్నప్పుడు కంపెనీ ఇచ్చిన మాన్యువల్ లో ఉంటుంది. కారు, బైకులో గాలి తగ్గితే వెంటనే మనం దగ్గర్లోని మెకానిక్ షాప్ కి వెళ్లి గాలి పట్టమని చెబుతాం. మెకానిక్ సిబ్బంది వాహనాన్ని బట్టి గాలిపడుతుంటారు. చాలా కార్ల టైర్లలో 30-35 PSI గాలి ఒత్తిడిని ఎక్కిస్తారు. అయినప్పటికీ కొన్ని కార్లకు 35-40 PSI వాయు పీడనాన్ని మెయింటెన్ చేస్తుంటారు. టైర్‌లో ఎంత గాలి ఉండాలి అనేది కారు లేదా బైకు మోడల్, టైర్ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది.
టైర్‌లో గాలి ఒత్తిడిని మెయింటెయిన్ చేయడానికి మీరు ప్రతి రెండు వారాలకు ఒకసారి టైర్ గాలిని చెక్ చేయించాలి. ఇది కాకుండా లాంగ్ డ్రైవ్ కి వెళ్లే ముందు టైర్ ఎయిర్ ప్రెజర్ చెక్ చేసుకోవాలి. దీని కోసం మీరు ఎయిర్ ప్రెజర్ గేజ్‌ని కూడా కొనుగోలు చేయవచ్చు. మార్కెట్లో అనేక రకాల పోర్టబుల్ ఎయిర్ ప్రెజర్ గేజ్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని మీరు కారులోనే ఉంచుకోవడం వల్ల అత్యవసర సమయంలో ఉపయోగపడుతుంది.
టైర్లు పేలిపోవడానికి మరో ముఖ్యమైన కారణం ఏంటంటే వెహికల్ స్పీడ్. మీ వాహనం కారు, బైకు ఏదైనా కావచ్చు. కంపెనీతో కూడా సంబంధం లేదు. మీరు వెళ్లే స్పీడ్ ను బట్టి టైర్ ప్రెషర్ కి గురవుతుంది. ఈ ప్రెషర్ ఎక్కువైపోతే టైరు పేలిపోతుంది. మరి ఏ టైరు ఎంత ప్రెషర్ తట్టుకోగలదో తెలుసుకొనేందుకు వాటిని తయారు చేసిన కంపెనీలే ఒక కోడ్ ఇస్తాయి. ఉదాహరణకు 134/76 G 14 75 L ఇలాంటి సీరియల్ నంబర్ ఉంటుంది. వీటిని కంపెనీలు టైర్లపైనే కనిపించే విధంగా ప్రింట్ చేస్తాయి. ఆ కోడ్ చివర ఒక ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లెటర్ టైర్లలో గాలి ఎంత ఉండాలో ఇండికేట్ చేస్తుంది.
ఆ ఆల్ఫాబెట్ L అయితే మాక్సిమం స్పీడ్ 120 కి.మీ. M అయితే 130 కి.మీ, N అయితే 140 కి.మీ., P అయితే 150 కి.మీ., Q అయితే 160 కి.మీ., R అయితే 170 కి.మీ., S అయితే 180 కి.మీ., T అయితే 190 కి.మీ., U అయితే 200 కి.మీ., H అయితే 210 కి.మీ., V అయితే 240 కి.మీ., W అయితే 270 కి.మీ., Y అయితే 300 కి.మీ. స్పీడ్ తో వెళ్లాల్సి ఉంటుంది. ఈ వేగం మించి కారు లేదా బైక్ నడిపితే టైర్లు పేలిపోతాయి. ఇకపై మీ టైరును బట్టి గాలి పట్టించి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండండి.