cyber crime
మారిన కాలంతో పాటు టెక్నాలజీ కూడా మారింది. మారి టెక్నాలజీ మనుషుల శ్రమను తగ్గించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇదే సమయంలో ఈ టెక్నాలజీని దుర్వినియం చేస్తూ కేటుగాళ్లు అమాయకులను దోచుకుంటారు. డిజిటల్ అరెస్ట్, ఓటీపీ స్కామ్, ఓఎల్‌ఎక్స్ స్కామ్ ఇలా రకరకాల పేర్లతో మోసాలకు దిగుతున్నారు.
దీంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు రంగంలోకి దిగుతున్నాయి. డిజిటల్ అరెస్ట్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కాలర్ ట్యూన్స్ ద్వారా కూడా ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా కొత్త రకం మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. జంప్‌డ్ డిపాజిట్ స్కామ్ పేరుతో అమాయకులను నిండా ముంచేస్తున్నారు కేటుగాళ్లు. ఇటీవల ఇలాంటి మోసాల బారినపడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇంతకీ ఏంటీ జంప్‌డ్ డిపాజిట్ స్కామ్.? ఈ స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
యూపీఐ ద్వారా..
ప్రస్తుతం యూపీఐ సేవలు భారీగా విస్తరించిన విషయం తెలిసిందే. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ యూపీఐ సేవలను వినియోగిస్తున్నారు. చిన్న టీ కొట్టు నుంచి పెద్ద పెద్ద షోరూమ్‌ల వరకు డిజిటల్ పేమెంట్స్‌ను యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఇదిగో ఈ యూపీఐని అస్త్రంగా మార్చుకొని మోసాలకు పాల్పాడుతున్నారు. ఈ స్కామ్ ఎలా జరుగుతుందంటే. ముందుగా గుర్తు తెలియని వ్యక్తి నుంచి యూపీఐ ద్వారా కొంత మొత్తంలో డబ్బులు పంపిస్తారు. దీంతో బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నించారో అంతే సంగతులు.
డబ్బులు వచ్చాయన్న ఆతృతతో బ్యాలెన్స్ చెక్ చేసేందుకు పిన్ ఎంటర్ చేస్తుంటారు. అయితే బ్యాలెన్స్ చెక్ చేసే సమయంలోనే యూపీఐ ఐడీలకు పేమెంట్స్ లింక్‌లను పంపిస్తున్నారు. దీంతో పిన్ ఎంటర్ చేయగానే మీ ఖాతాలోని డబ్బు వేరే వాళ్ల అకౌంట్‌లోకి వెళ్లిపోతుంది.
ఈ జాగ్రత్తలు..
ఈ కొత్తరకం స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన మెసేజ్‌లను స్పందించకూడదు. ముఖ్యంగా ఫేక్ పేమెంట్స్ లింక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అకౌంట్ నుంచి డబ్బులు పోతే వెంటనే 1930 నెంబర్‌కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. సంఘటన జరిగిన రెండు గంటల్లోపు ఫిర్యాదు చేస్తే అధికారులు మీ అమౌంట్‌ను ఫ్రీజ్ చేసే అవకాశాలు ఉంటాయి.