ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల ఫార్ములాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా ముందుకు తెచ్చినట్లు కనిపిస్తోంది. అందులో తన రాజకీయ ప్రయోజనాలు కూడా ఇమిడి ఉన్నట్లు తోస్తోంది. తెలుగుదేశం పార్టీని చావుదెబ్బ తీయడమే అందులోని వ్యూహంగా భావిస్తున్నారు. మూడు రాజధానులు అనేది ఆచరణాత్మకంగా సాధ్యామా, అసాధ్యమా అనే విషయాన్ని పక్కన పెడితే జగన్ వ్యూహం టీడీపీ అధినేత చంద్రబాబుకు చిక్కులు తెచ్చి పెట్టే అవకాసం ఉంది.
విశాఖపట్నం ఆడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా ఉంటుందని భావిస్తున్నారు. కర్నూలులో హైకోర్టును నెలకొల్పుతారని చెబుతున్నారు. అమరావతిలో సచివాలయం ఉంటుందని చెబుతున్నారు. ఈ మూడు ప్రాంతాల్లో ముఖ్యమైన కార్యాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా అన్ని ప్రాంతాల ప్రజలను సంతృప్తి పరచాలనేది జగన్ వ్యూహంలో ఒక భాగమైతే, టీడీపీని దెబ్బ తీయడం రెండో భాగం
జగన్ ఫార్ములాలో దేన్ని కాదన్నా చంద్రబాబుపై ఆయా ప్రాంతాల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం ఉంది. జగన్ మూడు రాజధానుల గురించి ప్రకటన చేసినప్పుడు మూడు రాజధానులేమిటి, ఇది పిచ్చి తుగ్లక్ చర్య అని చంద్రబాబు అన్నారు. కానీ ఆ తర్వాత దాని గురించి ఏమీ మాట్లాడడం లేదు. జగన్ ప్రతిపాదనను కాదంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం ఉండడంతో వ్యూహాత్మకంగా చంద్రబాబు మౌనం దాల్చినట్లు భావిస్తున్నారు.
కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్యాయానికి, వివక్షకు గురైన ప్రాంతంగా రాయలసీమను చూస్తున్నారు 1953 అక్టోబర్ 1వ తేదీన మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలును రాజధానిగా ఎంపిక చేశారు. అప్పట్లో శ్రీబాగ్ ఒడంబడిక మేరకు అది జరిగింది. అయితే, 1956 నవంబర్ 1వ తేదీన తెలంగాణను కలుపుకుని ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత హైదరాబాదు రాజధానిగా ఉంటూ వచ్చింది. కర్నూలు రాజధాని హోదాను కోల్పోయింది.
రాష్ట్ర విభజన తర్వాత కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా చేయాలనే డిమాండ్ కూడా వచ్చింది. అయితే, చంద్రబాబు అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. అప్పటి నుంచి రాయలసీమలో టీడీపీ ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతూనే ఉంది. అదే విధంగా విశాఖపట్నం నగరానికి కూడా ఏదో ముఖ్యమైన ఏర్పాటు ఉండాలని భావించారు. కానీ, అది జరగలేదు.
సింగఫూర్ తరహాలో అమరావతిని అభివృద్ధి చేస్తామని, హైదరాబాదు మాదిరిగా రూపొందిస్తామని చంద్రబాబు చెబుతూ వచ్చారు. కానీ, జరిగింది చాలా తక్కువ. తాత్కాలిక నిర్మాణాలు చేసి రాజధానిగా నడిపిస్తూ వస్తున్నారు. ఈ స్థితిలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చి, అమరావతి దృశ్యాన్ని మార్చడానికి సిద్ధపడింది. అమరావతి స్థాయిని తగ్గించడం ద్వారా టీడీపీ నేతల ఆర్థిక పట్టును దెబ్బ తీయాలనే వ్యూహం కూడా వైఎస్ జగన్ కు ఉంది.
మూడు రాజధానుల ప్రతిపాదనతో తెలుగుదేశం పార్టీ నేతలు, ఎమ్మెల్యేల నుంచి కూడా జగన్ కు మద్దతు లభిస్తోంది. రాయలసీమ, ఉత్తరాంధ్రలకు చెందిన ప్రతిపక్షాల నేతలు కూడా ఆయనను సమర్థించే పరిస్థితి వచ్చింది. గంటా శ్రీనివాస రావు బహిరంగంగానే జగన్ ప్రతిపాదనను సమర్థించారు. తమ తమ ప్రాంతాల ప్రజల మనోభావాల కారణంగా వారికి అది తప్పడం లేదు. అలా చూస్తే, జగన్ ఓ తేనెతుట్టెను కదిలించారు. ఉత్తరాంధ్రకు చెందిన కొండ్రు మురళి కూడా జగన్ ప్రతిపాదనను స్వాగతించారు.
జగన్ ప్రతిపాదనను రాయలసీమకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కూడా సమర్థించారు. బిజెపిలో కూడా అదే పరిస్థితి ఉంది. జగన్ ప్రతిపాదనను బిజెపి రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ స్వాగతించారు. బిజెపి రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ కాస్తా భిన్నంగా స్పందించారు. గుంటూరు జిల్లాకు చెందిన ఆయన.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి గానీ పాలనా వికేంద్రీకరణ కాదని అన్నారు.
కాగా, ఏపీ రాజధానిపై ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దీర్ఘకాలంలో విశాఖపట్నం ఏపీ రాజధానిగా అవతరిస్తుందని ఆయన అన్నారు. హైకోర్టు కర్నూలులో ఉంటుందని చెప్పారు. శాసనసభను అమరావతిలో ఉంచి, పరిపాలన రాజధానిగా విశాఖకు మార్చడం, ఆ తర్వాత అమరావతిలో శాసనసభా సమావేశాలు కుదించడం జరుగుతుందని ఆయన వివరించారు. క్రమంగా విశాఖను పూర్తిస్థాయి రాజధానిగా మార్చే వ్యూహమే జగన్ కు ఉందని అంటున్నారు.
ఏమైనా, జగన్ రాజేసిన కుంపటి చంద్రబాబుకు తలనొప్పిగా ఉంది. కరవమంటే కప్పకు కోపం, వద్దంటే పాముకు కోపం అన్న మాదిరిగా ఆయన పరిస్థితి తయారైంది. అమరావతిని మాత్రమే కొనసాగించాలని చంద్రబాబు అంటే, రాయలసీమ, ఉత్తరాంధ్రల నుంచి ఆయనకు తీవ్రమైన వ్యతిరేకత ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అమరావతిలోని రైతులు జగన్ ప్రతిపాదన పట్ల వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. అయితే, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు మాత్రం స్వాగతిస్తున్నారు.