
Special Status for Andhra Pradesh : ఉమ్మడి రాష్ట్ర విభజనతో బాగా నష్టపోయిన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్. అప్పటివరకు కలిసున్న తెలుగు రాష్ట్రానికి రాజధానిగా వున్న హైదరాబాద్ ను విభజన కారణంగా ఏపీ వదులుకోవాల్సి వచ్చింది. ఇలా ఎంతో అభివృద్ది చెందిన హైదరాబాద్ ను కోల్పోవడం ఏపీకి అటు ఆర్థికంగా, ఇటు పాలనాపరంగా పెద్ద ఎదురుదెబ్బే. ఇక విభజన హామీలు కూడా అమలుకు నోచుకోకపోవడంతో ఏపీ పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. ఇలాంటి సమయంలో ఏపీని కాపాడేది 'ప్రత్యేక హోదా' నే అని ప్రతిఒక్కరు నమ్ముతున్నారు. ఆ దిశగా రాజకీయ పార్టీలన్ని ప్రయత్నాలు కూడా చేసాయి... ఇంకా చేస్తూనే వున్నాయి.
అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి. గత లోక్ సభ ఎన్నికల్లో బిజెపికి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఎన్డిఏ కూటమిలో టిడిపి, జెడియూ కీలకంగా మారాయి. ఈ రెండు పార్టీల మద్దతు లేకుండా నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయ్యేవారు కాదు... ఎన్డిఏ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేది కాదు. ఇలా కేంద్రంలో చక్రంతిప్పే అవకాశం వచ్చింది కాబట్టి ఎప్పటినుండో ఇటు ఆంధ్ర ప్రదేశ్, అటు బిహార్ కోరుతున్న ప్రత్యేక హోదా ఈసారి సాధ్యమని అందరూ భావించారు. కానీ అందరికీ షాకిస్తూ దేశ పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
ప్రత్యేక హోదాపై కేంద్రం క్లారిటీ :
కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఇవాళ (సోమవారం) ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బిహార్ అధికార పార్టీ, ఎన్డిఏ భాగస్వామ్య పార్టీ జెడియూకు చెందిన ఓ ఎంపీ ప్రత్యేక హోదాపై ప్రశ్నించారు. ఇందుకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి పేరిట ఓ నోట్ ను విడుదల చేసింది. ఇందులో బిహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని స్పష్టంగా తెలిపింది కేంద్రం.
ఓ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటే నేషనల్ డెవలప్ మెంట్ కౌన్సిల్ ఎలాంటి అర్హతలుండాలని పేర్కొందో ఈ నోట్ లో ప్రస్తావించారు.
1.పర్వతప్రాంతాలు లేదా సంక్లిష్టమైన ప్రదేశాలు ఎక్కువగా కలిగివుండటం
2. అతి తక్కువ జనాభా సాంద్రత లేదంటే గిరిజనులు ఎక్కువగా నివాసముండటం
3. ఇతర దేశాలతో సరిహద్దులు కలిగినవుండటం
4. ఆర్థికంగా లేదంటే సామాజికంగా వెనకబడి మౌళిక సదుపాయాలు కూడా సరిగ్గా లేకపోవడం
5. అత్యల్ప ఆదాయం కలిగివుండాలి.
మొత్తంగా ప్రత్యేక పరిస్థితుల్లోనే ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదా కల్పించే అవకాశం వుంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులేమీ బిహార్ లో లేవు కాబట్టి ప్రత్యేక హోదా కల్పించడం అసాధ్యమని కేంద్రం తేల్చింది. గతంలో 2012 లో బిహార్ ప్రత్యేక హోదా కోరగా దీన్ని పరిశీలించేందుకు ఇంటర్ మినిస్టీరియల్ గ్రూప్ ను ఏర్పాటుచేసారు... నేషనల్ డెవలప్ మెంట్ కౌన్సిల్ నిబంధనలు బిహార్ కు వర్తించడం లేవు కాబట్టి ప్రత్యేక హోదా కల్పించడ సాధ్యంకాదని ఈ గ్రూప్ తేల్చింది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తాజా నోట్ లో ప్రకటించింది.
ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి కూడా అంతేనా..?:
బిహార్ మాదిరిగానే ఆంధ్ర ప్రదేశ్ కూడా ప్రత్యేక హోదాను కోరుకుంటోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామంటూ గతంలో పోటాపోటీ హామీలిచ్చి ఎన్నికల్లో లబ్ది పొందాయి తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ ఎన్నికల్లో రెండు పార్టీలు ప్రత్యేక హోదా సాధన హమీ ఇవ్వకున్నా టిడిపి అత్యధిక ఎంపీలను గెలవడం... కేంద్ర ప్రభుత్వమే ఈ పార్టీపై ఆధారపడటంతో ప్రత్యేక హోదాపై ఆశలు చిగురించాయి. కానీ ఆ ఆశలను మోదీ సర్కార్ ఆదిలోనే తుంచేసింది. సేమ్ టిడిపి లాగే ఎన్డిఏలో జేడియూ కూడా కీలక భాగస్వామి... కాబట్టి ఆ రాష్ట్రానికి నో చెప్పారు కాబట్టి ఏపికి కూడా నో చెప్పినట్లే.
అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా ప్రత్యేక హోదాపై ముందునుండే ఆశలు లేనట్లుంది... అందువల్లే ఆయన ఎన్నికల సమయంలో ఈ ప్రస్తావనే తీసుకురాలేదు. ఇక ఎన్నికల్లో విజయం తర్వాత కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. కేంద్ర నుండి నిధులు తీసుకువస్తామని, పోలవరం నిర్మాణానికి సహాయం వంటి విషయాల గురించి మాట్లాడారు కానీ ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించలేదు. దీన్నిబట్టే ఆయన ప్రత్యేక హోదా అసాధ్యమని ముందే గ్రహించినట్లు అర్థమవుతోంది.
తాజాగా ప్రత్యేక హోదా అంశం తెరపైకి రావడంతో దీనిపై చర్చ మొదలయ్యింది. ఇలా గతంలో ఏ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించారు..? దేని ఆధారంగా ఈహోదా కేటాయించారు..? ఇప్పుడెందుకు ప్రత్యేక హోదా ఇవ్వడంలేదు..? అనే చర్చ జరుగుతోంది.
అసలు ఏమిటీ ప్రత్యేక హోదా..?
ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలకు అనేక ప్రయోజనాలుంటాయి. ఈ హోదా కలిగిన రాష్ట్రాల్లో పరిశ్రమలు పెట్టేవారికి రాయితీలు దక్కుతాయి... దీంతో ఈ రాష్ట్రాల్లో పెట్టుబడులను పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు. తద్వారా ఆ రాష్ట్రాల్లో అభివృద్ది జరగడమే కాదు ఉపాధి అవకాలు కూడా లభిస్తాయి.
ఇక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో కూడా ఈ ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ప్రాధాన్యత వుంటుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో 90 శాతం నిధులను గ్రాంట్లుగా, 10 శాతం నిధులను రుణంగా ఇస్తారు. ఇలా ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రాలకు ఎన్నో ప్రయోజనాలు వుంటాయి.
గతంలో అసోం, నాగాలాండ్, జమ్మూ కాశ్మీర్ లకు ప్రత్యేక హోదా కల్పించారు. ఉత్తరాఖండ్, మిజోరం, మేఘాలయా, హిమాచల్ ప్రదేశ్, అరుణా చల్ ప్రదేశ్, సిక్కిం, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా దక్కింది. 1969లో ప్రత్యేక హోదా అంశం తెరమీదికి వచ్చింది. అప్పటి 5వ ఆర్ధికసంఘం ఈ ప్రత్యేక హోదా సిఫారసులు చేసింది. ఆయా రాష్ట్రాల్లోని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక హోదా కల్పించారు.
1969లో జరిగిన జాతీయ అభివృద్ధి మండలి (NDC) సమావేశంలో ప్రత్యేక హోదా అనే పదం వెలుగులోకి వచ్చింది. ఈ సమావేశంలో గాడ్గిల్ కమిటీ రాష్ట్రాలకు కేంద్ర సహాయం కోసం ఈ ప్రత్యేక హోదా ప్రస్తావనను తీసుకువచ్చింది. అంతకుముందు రాష్ట్రాలకు నిధుల పంపిణీ కోసం ఎలాంటి ప్రత్యేక విధానం ఉండేది కాదు... గ్రాంట్స్ కూడా పథకాల ఆధారంగా ఇవ్వబడేవి. కానీ గాడ్గిల్ కమిటీ సూచనలను ఎన్డిసి ఆమోదించడంతో మొదటిసారిగా అస్సాం, జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా దక్కింది.
కొన్ని ప్రాంతాలు చారిత్రాత్మకంగా ఎదుర్కొన్న ప్రతికూలతలను గుర్తించిన 5వ ఆర్థిక సంఘం ఈ ప్రత్యేక హోదాను పరిగణలోకి తీసుకుంది. ఇలా హోదా ద్వారా కొన్ని వెనుకబడిన రాష్ట్రాలకు కేంద్ర సహాయంతో పాటు పన్ను రాయితీలు వంటి సదుపాయాలను కలిగాయి.
2014-2015 ఆర్థిక సంవత్సరానికి ముందు ప్రత్యేక హోదా ద్వారా 11 రాష్ట్రాలు వివిధ ప్రయోజనాలు, ప్రోత్సాహకాలు పొందాయి. అయితే 2014లో ప్రణాళికా సంఘం రద్దు, నితి ఆయోగ్ ఏర్పాటు తర్వాత 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమలు చేయబడ్డాయి. ఫలితంగా గాడ్గిల్ సూత్రం ఆధారిత గ్రాంట్లు నిలిపివేయబడ్డాయి. అన్ని రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32% నుండి 42%కు పెంచారు. దీంతో ప్రత్యేక హోదా అంశానికి కేంద్ర పుల్ స్టాప్ పెట్టింది.