ఐపిఎస్ సార్లూ...! ఆంధ్రా పోలీసుల పరువంతా తీసారు కదయ్యా

First Published Sep 16, 2024, 6:16 PM IST

సినీనటి కాదంబరి జత్వానీ కేసులో పోలీసుల మెడకు చుట్టుకుంటోంది. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు పోలీసులపై వేటు పడగా తాజాగా మరో ముగ్గురు ఐపిఎస్ లు కూడా సస్పెండ్ అయ్యారు. దీంతో వైసిపి పాలనలో ఆంధ్రా పోలీసుల పరువుతీసేలా వ్యవహరించారంటూ సదరు పోలీసులపై ప్రజలు గరం అవుతున్నారు.

kanthi rana tata

Kadambari Jethwani: ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు ఆంధ్ర ప్రదేశ్ లో కాక రేపుతోంది. ఈ కేసు అటు రాజకీయాల్లోనే కాదు ఇటు పోలీస్ శాఖలోనూ సంచలనంగా మారింది. ఇప్పటికే పలువురు పోలీస్ అధికారులపై వేటు పడగా తాజాగా ముగ్గురు ఐపిఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్  పీఎస్ఆర్ ఇంజనేయులు, విజయవాడ మాజీ కమీషనర్ కాంతి రాణా టాట, మాజీ ఎస్పీ విశాల్ గున్నీలను సస్పెండ్ చేసింది ఏపీ ప్రభుత్వం. 

vishal gunni

నటి జైత్వానీ అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో ఈ ముగ్గురు ఐపిఎస్ అధికారుల పాత్ర వుందని శాఖాపరమైన విచారణలో తేలింది. గతంలో విజయవాడ సిపిగా వున్న కాంతిరాణా, డిసిపి విశాల్ గున్నీలు జత్వాని కేసులో వ్యవహరించిన తీరు సరిగ్గాలేదని... అనేక అనుమానాలకు తావు ఇస్తోందని విచారణలో తేలింది. అలాగే ఆనాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు కూడా తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ ముగ్గురిపై చర్యలు తీసుకున్నారు. 

వైసిపి అధికారాన్ని కోల్పోయి కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నటి జత్వానీ తనకు జరిగిన అన్యాయంపై గొంతెత్తారు. వైసిపి నాయకుడొకరు తనను పోలీసులతో కేసులు పెట్టించడమే కాదు లైంగికంగా వేధించాడని ఆమె ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు సర్కార్ నిజానిజాలు తేల్చాలని పోలీస్ బాస్ ద్వారకా తిరుమలరావును ఆదేశించింది.

పోలీస్ శాఖ పరువు పోయేలా కిందిస్థాయి ఉద్యోగులే కాదు ఏకంగా ఐపిఎస్ అధికారులపై అభియోగాలు రావడంతో ఏపీ డిజిపి తిరుమలరావు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. జత్వానీ వ్యవహారంలో ఐపిఎస్ ల పాత్రపై విజయవాడ పోలీస్ కమీషనర్ రాజశేఖర్ బాబుతో విచారణ జరిపించారు. ఇందులో ఐపిఎస్ లు ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీ తప్పు చేసినట్లు తేలడంతో వెంటనే వీరిని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. 
 

Latest Videos


AP Police

జత్వానీ కేసులో ఐదుకు చేరిన సస్పెన్షన్లు :  

తాజాగా ముగ్గురు ఐపిఎస్ లపై సస్పెన్షన్ వేటు పడటంతో ఈ కేసులో సస్పెండ్ అయిన పోలీసుల సంఖ్య ఐదుకు చేరింది. నటి జత్వానీపై కేసు నమోదు, అరెస్ట్ లో కీలకంగా వ్యవహరించి విజయవాడ ఏసిపి హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సిఐ సత్యనారాయణ ఇప్పడికే సస్పెండ్ అయ్యారు. 

జత్వానీపై కేసు నమోదు నుండి అరెస్ట్ వరకు, ఆ తర్వాత వేధింపులు... ఇలా ప్రతి విషయంలోనూ పోలీసుల తీరు అనుమానాస్పదంగానే వుందనే ఆరోపణలున్నాయి. స్థానిక పోలీసుల నుండి ఐపిఎస్ అధికారుల వరకు అధికార పార్టీ నాయకుడికి కొమ్ము కాసినట్లు పోలీస్ శాఖ విచారణలోనే తేలింది. ఈ కేసును క్షేత్రస్థాయిలో విచారించిన ఇబ్రహీంపట్నం సిఐ సత్యనారాయణ, ఏసిపి హనుమంతరావులు విచారణ జరిపి నిజానిజాలు తెలుసుకోకుండానే ఆనాటి అధికార పార్టీ నాయకులు చెప్పినట్లుగా చేసారని...జత్వానీతో పాటు కుటుంబసభ్యులను అరెస్ట్ చేసారని ఆరోపణలున్నాయి. 

ఈ కేసులో పోలీస్ ఉన్నతాధికారుల పాత్ర కూడా బయటపడింది. స్వయంగా జత్వానీయే తనను ముగ్గురు ఐపిఎస్ అధికారులు వేధించారంటూ సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీ పేర్లను బైటపెట్టారు. వైసిపి నేత కుక్కల విద్యాసాగర్ తో పోలీసులే తప్పుడు ఫిర్యాదులు ఇప్పించారని ఆరోపించారు. వెంటనే తనతో పాటు తల్లిదండ్రులకు ముంబైలో అరెస్ట్ చేసి ఏపీకి తరలించారని... ఇలా జైల్లో పెట్టి తీవ్ర వేధనకు గురిచేసారని జత్వానీ ఆరోపించారు.

Kadambari Jatwani

అసలు ఏమిటీ కేసు :

సినీ నటి కాదంబరి జత్వానీ హనీ ట్రాప్ కు  పాల్పడుతోందని 2019 అంటే వైసిపి అధికారంలోకి వచ్చినవెంటనే పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు కుక్కల విద్యాసాగర్ ఈ ఫిర్యాదు చేసారు.  ఫోర్జరీ పత్రాలను సృష్టించి తన ఐదెకరాల భూమిని కబ్జా చేసేందుకు జత్వానీ ప్రయత్నిస్తోందని విద్యాసాగర్ ఇబ్రహీంపట్నం  పోలీసులకు ఫిర్యాదు చేసారు. 

ఆనాటి అధికారపార్టీకి చెందిన నాయకుడు ఫిర్యాదు  చేయడంతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ముంబైకి వెళ్లి జత్వానీని అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. ఆమె సెల్ ఫోన్లు, ఎలక్ట్రానికి పరికరాలను స్వాధీనం చేసుకుని కోర్టు ఆదేశాలతో విజయవాడ సబ్ జైలుకు  తరలించారు.

ఇలా విజయవాడ పోలీసులు విద్యాసాగర్ ఫిర్యాదుపై వెంటనే స్పందించి జత్వానీని అరెస్ట్ చేసారు. విచారణ పేరిట వేధింపులకు పాల్పడినట్లు జత్వానీ చెబుతున్నారు. తానే కాదు తన కుటుంబసభ్యులు కూడా ఎలాంటి తప్పు చేయలేదు... కానీ వైసిపి నేత, పోలీసుల తీరువల్ల  42 రోజులపాటు నరకం అనుభవించామని జత్వానీ ఆవేదన వ్యక్తం చేసారు. 
 

Chandra Babu

కూటమి అధికారంలోకి రాగానే సీన్ రివర్స్ : 

వైసిపి అధికారంలో వుండగా నటి కాదంబరి జత్వానీని దోషిగా చూపించారు పోలీసులు.   కూటమి అధికారంలోకి రాగానే అప్పటివరకు దోషిగా వున్న జత్వానిని బాధితురాలిగా మారారు. తనపై వైసిపి నేత కుక్కల విద్యాసాగర్ తప్పుడు కేసులు పెట్టించడమే కాదు లైంగికంగా వేధించాడని జత్వాని బైటపెట్టారు. పోలీసులు కూడా అతడికి అండగా నిలిచి తనను, కుటుంబసభ్యులను వేధించారంటూ  కన్నీటిపర్యంతం అయ్యారు. 

ఇటీవల కుటుంబసభ్యులతో కలిసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన జత్వానీ తనను వేధించినవారిపై ఫిర్యాదు చేసారు. వైసిపి నేత కుక్కల విద్యాసాగర్ తో పాటు ఐపిఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాతిరాణా, విశాల్ గున్నీలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన అరెస్ట్ వెనక కుట్రకోణం వుంది...కాబట్టి సమగ్ర విచారణ జరిపి ఇందులో పాత్ర వున్న  ప్రతి ఒక్కరిని శిక్షించాలని కోరారు. తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వాన్ని,పోలీస్ ఉన్నతాధికారులను కోరారు కాదంబరి జత్వానీ. 

కాదంబరి జత్వానీ బయటకు వచ్చి తనపై వేధింపులకు పాల్పడినవారిపై న్యాయపోరాటానికి సిద్దమయ్యారు. అయితే ఈ కేసులో వైసిపి నాయకుడు విద్యాసాగర్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కోవడం... చర్యలుకు కూటమి ప్రభుత్వం సిద్దమవడంతో రాజకీయం రంగు పులుముకుంది. వైసిపి నాయకులు, పోలీస్ అధికారులపై కక్ష సాధింపు కోసమే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లు జత్వానీ కేసును వాడుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.  టిడిపి, జనసేన,బిజెపి నాయకులు మాత్రం  తప్పుచేసిన వారినే ప్రభుత్వం శిక్షిస్తోందని.. ఎలాంటి కక్షసాధింపు లేదని అంటున్నారు. 

click me!