దివిసీమ ఉప్పెన కు 43 ఏళ్లు: ఇంకా వెంటాడుతున్న జ్ఞాపకాలు

First Published | Nov 19, 2020, 10:55 AM IST

కృష్ణా జిల్లాలో దివిసీమ ఉప్పెనకు ఇవాళ్టితో 43 ఏళ్లు నిండాయి. ఈ ఉప్పెన జ్ఞాపకాలు స్థానికులను ఇంకా వెంటాడుతున్నాయి. ఆ తర్వాత కూడ తుఫానులు వచ్చినా కూడ ఈ తరహా తుఫాను ఇంతవరకు చూడలేదని చెబుతున్నారు స్థానికులు

కృష్ణా జిల్లాలో దివిసీమ ఉప్పెనకు ఇవాళ్టితో 43 ఏళ్లు నిండాయి. ఈ ఉప్పెన జ్ఞాపకాలు స్థానికులను ఇంకా వెంటాడుతున్నాయి.
1977 నవంబర్ 19 దివిసీమను ఉప్పెన ముంచెత్తింది. ఆ రోజు రాత్రి సముద్రం ఉగ్రరూపం దాల్చింది. సముద్రం గ్రామాలపై విరుచుకుపడింది. దీంతో గ్రామాలకు గ్రామాలే నీటిలో కొట్టుకుపోయాయి.1977 నవంబర్ 18 సాయంత్రం వాతావరణంలో మార్పులు సంభవించి ఆకాశం మేఘావృతంమై చిరు వర్షపు జల్లులు కురిశాయి.

ఇది వర్షమే కదా అని దివి ప్రజలు భావించారు అందరూ నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మార్పు చెంది ఆయా ప్రాంతాలు చీకట్లు కమ్మాయి.
ఇంతలోనే పెద్ద ఎత్తున ఉరుములు, మెరుపులు సంభవించడంతో పాటు భారీ వర్షం కురిసింది.సముద్రం ఉగ్రరూపం దాల్చి అలలు తాకిడి చెట్టు ఎత్తున ఎగసిపడి గ్రామాలపై విరుచుకుపడినట్టుగా స్థానికులు గుర్తు చేసుకొంటున్నారు.
నీటి ప్రళయంలో గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకుపోయాయి. కేవలం రెండు గంటల వ్యవధిలోనే అంతా జరిగిపోయిందని ఆనాటి ఘటనను స్థానికులు చెబుతుంటారు.
ఇళ్లలోని ప్రజలు భయంతో దేవాలయాలలో, ప్రార్థనా మందిరాలలో, కమ్యూనిటీ భవనాలలో తలదాచుకున్నారు. మరికొంతమంది ఇంటి పై కప్పు ఎక్కి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు.
మరికొందరు చెట్లు, చెట్ల కొమ్మలు ఎక్కి వేలాడారు. ఒక్కసారిగా సముద్రపు అలలు విరుచుకుపడడంతో ఇండ్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి వందలాది మంది మృత్యువాత పడ్డారు.
వర్షం నిలిచిపోయిన తర్వాత ఈ ప్రాంతంలో ఎక్కడా చూసినా కూడా శవాల గుట్టలే కనిపించాయి.పశువులు నీటి ప్రళయంలో కొట్టుకుపోయి మృత్యువాత పడడంతో పశువుల కలేబరాలే కనిపించాయి.
ఆయా ప్రాంతాలు శవాలు, పశువుల కలేబరాలతో కనిపించడంతో మృతుల బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలే వినిపించాయి. ఈ ఉప్పెన దివిసీమ రూపురేఖలను మార్చింది.దీంతోగ్రామ గ్రామాలు చెదిరిపోయాయి.
ఆనాటి శాసనసభ్యులు మండలి వెంకట కృష్ణారావు దివి ప్రజలకు అండగా నిలవడంతో పాటు చెదిరిపోయిన దివిసీమకు పూర్వ వైభవం తీసుకురావడానికి విశేష కృషి చేశారు.
ఉప్పెనలో చనిపోయిన మృతుల శవాలను స్వచ్ఛంద సంస్థలు, వివిధ రాజకీయ పార్టీ నేతలు, కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలీసులు దహన సంస్కారాలు నిర్వహించారు.
అప్పటి పోలీస్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఎన్ వి నారాయణ రావు ఐపీఎస్ పోలీసు బలగాలను దింపి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అంతేకాకుండా నాగాయలంక మండలం సొర్ల గొంది గ్రామాన్ని దత్తత తీసుకొని భవనాలు నిర్మించడం తోపాటు అందుకు చిహ్నంగా స్థూపాన్ని కూడా నిర్మించారు.
ఆ స్తూపం నేటికీ దివిసీమ ఉప్పెన కు చిహ్నం గా ఉంది. ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ, సేవా మూర్తి మదర్ తెరిసా దేశ విదేశాలకు చెందిన ఎందరో ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు దివిసీమను సందర్శించి వారి సహకారాన్ని అందించారు.
దివిసీమ ఉప్పెన ఉప్పెన వందలాది గ్రామాలను తుడిచిపెట్టుకుపోవడం తో తీవ్ర ఆస్తి నష్టం తో పాటు, పంటనష్టాన్ని కలిగించింది. నాగాయలంక, కోడూరు మండలాలతో పాటు దివిసీమలో సుమారు 20 వేల ఎకరాలకు పైబడి పంట నష్టం జరిగింది. వీటితో పాటు ఆస్తి నష్టం కూడా కోట్లలో జరిగింది.
ఆస్తి, పంట నష్టం తో పాటు రహదారులు పూర్తిగా చెదిరిపోయాయి.గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులు అంతర్గత రహదారులు పూర్తిగా ధ్వంసం అవడంతో గ్రామాలకు వెళ్ళడానికి వీలు లేకుండా పోయింది.

Latest Videos

click me!