ప్రతి ఒక్కరికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం, ప్రజల్లో ఈ విషయంలో చైతన్యం నింపాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 16న ‘ఆహార, వ్యవసాయ సంస్థ’ ను ప్రారంభించింది. అప్పటి నుంచి ఇదేరోజున ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు.
ఒకరు రోజంతా కష్టపడి కూలి పనులు చేసి డబ్బు సంపాదిస్తారు. ఇంకొకరు రోజంతా ఏసీ గదుల్లో కంప్యూటర్ల ముందు కూర్చొని కుస్తీ పడతారు. ఎవరు ఎలా కష్టపడినా... కడుపు నింపుకోవడానికే. కోటి విద్యలు కూటి కోరకే... అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. ముందు కడుపు నిండాకే మనిషి మరో దాని గురించి ఆలోచిస్తున్నాడు. ప్రస్తుతం కనీస అవసరాల కిందకి చాలా వచ్చాయి. ఎన్ని ఆ జాబితాలో చేరినా మొదటి స్థానంలో ఆహారమే ఉంటుంది. ఎందుకుంటే... ఆహారం లేకుండా సృష్టిలో ఏ ప్రాణి జీవించలేదు కాబట్టి.
కానీ ప్రస్తుత రోజుల్లో మనుషులు లక్షల రూపాయలు సంపాదిస్తున్నా కూడా కడుపు నిండా భోజనం చేయడం లేదు. బరువు పెరుగుతామనో, లావు అయిపోతామనో ఇలా కారణాలు చెబుతున్నారు. కొందరేమో తినడానికి తిండి లేక అవస్తలు పడుతున్నారు. ఈ రెండు కారణాల వల్ల పోషకాహారలోపాన్ని ఎదురుకుంటున్నవారు చాలా మంది ఉన్నారు. ఈ రోజు ప్రపంచ ఆహార దినోత్సవం. ఈ సందర్భంగా ఎలాంటి ఆహారం తినాలనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతి ఒక్కరికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం, ప్రజల్లో ఈ విషయంలో చైతన్యం నింపాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 16న ‘ఆహార, వ్యవసాయ సంస్థ’ ను ప్రారంభించింది. అప్పటి నుంచి ఇదేరోజున ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఆహార దినోత్సవం సందర్భంగా ఎలాంటి జబ్బుల బారిన పడకుండా ఉండేందుకు ఏ ఆహారం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం...
పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలతో పాటు గింజలు, విత్తనాలు, పల్లీలు, శనగలు, ఉలవలు, బొబ్బర్లు, జీడిపప్పు, బాదం పప్పు, వాల్ నట్స్ వంటిని ప్రతి రోజూ తీసుకోవాలి.
భారతీయులు రోజూ కనీసం 400గ్రాముల కూరగాయలు, పండ్లు తీసుకోవాలని భారత పోషకాహార సంస్థ చెబుతోంది. రాగులు, జొన్నలు, వరి, గోధుమ వంటి ధాన్యాన్ని కూడా ఎక్కువగా తీసుకోవాలి. మరీ ప్రత్యేకంగా కొవ్వులు, చెక్కర, ఉప్పు వాడకాన్ని చాలా తక్కువగా వాడటం ఉత్తమం.
పోషకాహారం తీసుకోవడంతోపాటు తగినంత వ్యాయామం చేయడం కూడా చాలా అవసరం. మన భూమి మీద మనిషి తినకలిగే మొక్కల జాతుల సంఖ్య దాదాపు 30వేలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
50శాతం కేలరీలు అందిస్తున్న పంటలు 8 రకాలు ఉన్నాయి. బార్లీ, బీన్స్, వేరుశెనగ, మొక్కజొన్న, వరి, జొన్న,గోధుమ లు వీలైనంత ఎక్కువగా ఆహారంలో భాగం చేసుకోవాలి. బయట లభించే ఆహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఫాస్ట్ ఫుడ్ అసలు తినకపోవడం చాలా మంచిది. చిన్నారులకు కనీసం 9నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలి. పుట్టగానే డబ్బా పాలను అలవాటు చేస్తే.. అప్పటి నుంచే వారిలో పోషకాహార లోపం తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.