
కోలీవుడ్ ప్రేమ జంట నయనతార, విఘ్నేష్ శివన్‌లు పెళ్ళికి ముస్తాబవుతున్నారు. దాదాపుగా ఏడెనిమిదేళ్శనుంచి డేటింగ్‌లో ఉన్న ఈ ఇద్దరు త్వరలోనే పెళ్ళిపీటలు ఎక్కబోతున్నారు. అయితే ఈ ఇద్దరూ వీరి పెళ్ళిపై ఎక్కడా అధికారికంగా ప్రకటన మాత్రం ఇవ్వలేదు. కానీ పెళ్ళి ఏర్పాట్లను గత నెల నుండి జరుగుతూనే ఉన్నాయి. హల్దీ ఫంక్షన్, పెళ్ళి మండపం, రిసెప్షన్ వంటివి ముందు నుంచే ప్లాన్ చేసుకున్నారు.
ఇప్పటికే ఈ ఇద్దరు శుభలేఖలను కూడా పంచడం ప్రారంభించారు. మొదటి శుభలేఖను తమ కులదైవం సమక్షంలో ఉంచి పూజించిన ఈ జంట.. ఈ క్రమంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ను పెళ్ళికి ఆహ్వానించారు.నయనతార, విఘ్నేష్ శివన్‌లు స్వయంగా ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్‌ను కలిసి శుభలేఖను అందించారు. స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్‌ను కూడా పెళ్ళికి ఆహ్వానించారు. ఇక ఉదయనిధితో ఇత్తు కతివెలన్ కాదల్ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం తెలుగులో శ్రీనుగాడి లవ్‌స్టోరి పేరుతో డబ్ అయింది.
ఇక వీరితో పాటుగా కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కమల్‌హాసన్, రజినీ కాంత్, అజిత్, విజయ్, సూర్యలతో సహా పలువురు సినీ ప్రముఖులు కూడా వీరు పెళ్ళికి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఇక ఈ స్టార్స్ అంతా.. పెళ్ళికి హాజరుకానున్నట్లు సమాచారం. అంతేకాకుండా టాలీవుడ్ నుంచి కూడా పులువురు స్టార్లు వీరి పెళ్ళికి హాజరుకానున్నారని సమాచారం.
మహాబలిపురంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో విఘ్నేష్ శివన్, నయన తారల పెళ్లి జరుగనుంది. హిందూ సంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జూన్ 9న గ్రాండ్‌గా జరుగనుంది. కోలివుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జూన్ 8 సాయంత్రం అంటే పెళ్ళికి ముందు రోజు భారీ ఎత్తున రిసెప్షన్ కూడా ఉండబోతుందని టాక్. దీనిపై త్వరలోనే ప్రకటన రానుంది.