
దర్శకుడు తేజ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్పెషల్ మార్క్ ని వేసుకున్నారు. స్వచ్చమైన ప్రేమకథలు, సెన్సిబుల్ అంశాలతో సినిమాలు తీసి హిట్ కొట్టారు. టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టర్ అయ్యారు. తేజ సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. కానీ ఆయనకు సక్సెస్ లేక చాలా రోజులవుతుంది. చాలా గ్యాప్ తో రానాతో చేసిన `నేనే రాజు నేనే మంత్రి` సినిమాతో విజయాన్ని అందుకున్నారు. దీంతో మళ్లీ తేజకి పూర్వవైభవం వచ్చిందని, ఆయన దర్శకుడిగా మళ్లీ ఫామ్‌లోకి వచ్చారని భావించారు.
కానీ ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ జంటగా చేసిన `సీత` సినిమా బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం చవిచూశారు. మళ్లీ స్ట్రగులింగ్ పీరియడ్ వచ్చేసింది. ఇప్పుడు తెలుగులో `అహింస` పేరుతో మరో సినిమా చేస్తున్నారు. దీని ద్వారా నిర్మాత సురేష్‌బాబు చిన్న కుమారుడు అభిరామ్‌ని హీరోగా పరిచయం చేయబోతున్నారు. ప్రస్తుతం ఈసినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇదిలా ఉంటే దర్శకుడు తేజ మరోసారి బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. అక్కడ ఆయన రెండు సినిమాలు చేస్తున్నారు.
తేజ బాలీవుడ్ సినిమాలను అనౌన్స్ చేశారు. అక్కడ టైమ్స్ ఫిల్మ్స్, ఎన్‌హెచ్ స్టూడియోస్, ట్రిఫ్లిక్స్ ఫిల్మ్స్ తో కలిసి తేజ దర్శకత్వంలో సినిమాలను నిర్మించబోతున్నాయి. అందులో ఒకటి `జఖమి`. ఇది కాశ్మీర్ నేపథ్యంలో సాగే కథ. ఈ చిత్ర షూటింగ్ సైతం కాశ్మీర్‌లోని మంచు ప్రాంతంలో జరగనుంది. ఇందులో ఇద్దరు బాలీవుడ్ హీరోలు నటిస్తారు. మరోవైపు `తస్కరి` అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. 1980` బ్యాక్ డ్రాప్‌లో సాగే వెబ్ సిరీస్ ఇది. నాలుగు సీజన్లుగా రానుంది. ముంబయిలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ని రూపొందించబోతున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్ లకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే హిందీలో ఓ సినిమా చేశారు తేజ. ఆయన దర్శకత్వంలో తెలుగులో రూపొందిన సక్సెస్ అయిన `నువ్వు నేను` చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశారు. అది తెలుగులో అంతటి విజయాన్ని సాధించలేకపోయింది. భారీ పరాజయం చెందడంతో బాలీవుడ్ వైపు మళ్లీ చూడలేదు తేజ. దాదాపు 20ఏళ్ల తర్వాత ఇప్పుడు బాలీవుడ్‌లో సినిమాలు చేయబోతున్నట్టు ప్రకటించారు. మరి ఈ సారైనా సక్సెస్ అవుతాడా? పాన్ ఇండియా డైరెక్టర్‌గా ఎదుగుతాడా? అనేది చూడాలి.