తెలుగులో కమర్షియల్ సినిమాలు చేస్తూ కెరీర్ మొదలెట్టిన తాప్సీ బాలీవుడ్ కు వెళ్లి తనకంటూ ఓ మార్కెట్ క్రియేట్ చేసుకుంది.
--సూర్య ప్రకాష్ జోశ్యుల
తెలుగులో కమర్షియల్ సినిమాలు చేస్తూ కెరీర్ మొదలెట్టిన తాప్సీ బాలీవుడ్ కు వెళ్లి తనకంటూ ఓ మార్కెట్ క్రియేట్ చేసుకుంది. విభిన్నమైన కథాంశాలతో ఎంచుకుంటున్న ఆమె హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రయారిటీ ఇస్తోంది. తాజాగా గేమ్ ఓవర్ అంటూ ఓ కొత్త థ్రిల్లర్ తో మన ముందుకు వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యం వీడకూడదు అనే మెసేజ్ తో వచ్చిన ఈ చిత్రం కథేంటి...అందరికీ నచ్చుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి..?
సినిమా ప్రారంభంలోనే...అమృత (సంచన నటరాజన్) ని తాళ్లతో కట్టేసిన తన ముఖానికి ప్లాస్టిక్ కవర్ తొడిగి ఊపిరాడకుండా చేసి చంపేస్తాడు ఓ హంతకుడు. ఆ తరువాత ఆమె శరీరాన్ని నరికి తగులబెడతాడు.
వీడియో గేమ్ డిజైనర్ స్వప్న (తాప్సీ పన్ను) చీకటంటే భయం. తన పేరెంట్స్ కు దూరంగా , ఓ కేర్ టేకర్ కళమ్మ (వినోదిని వైద్యనాథన్)తో కలిసి ఒక ఇంట్లో ఉంటూంటుంది. ఓ రోజు స్వప్న తన చేతికి ఒక టట్టూ వేయించుకుంటుంది. ఆ టట్టూ కలర్ లో అమృత (సంచిత నటరాజన్) అస్తికలు కూడా కలుస్తాయి. ఆ తర్వాత ఆ టట్టూ స్వప్నపై ప్రభావం చూపించటం మొదలెడుతుంది. దారుణ హత్యకు గురైన అమృత తరహాలోనే స్వప్నకి కొన్ని సంఘటనలు ఎదురవుతాయి. ఆ సంఘటనలు ఏమిటి... ఇంతకీ అమృత ని చంపిన హంతకుడు ఎవరు? స్వప్న ఆ హంతుకుడుని ట్రేస్ చేయగలిగిందా...అందుకు ఆమె గేమ్ డిజైనింగ్ వృత్తి ఎంతవరూ ఉపయోగపడింది...అసలు స్వప్న...చీకటికి అంతలా భయపడటానికి కారణం ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
undefined
ఎలా ఉందంటే...?
హాలీవుడ్ లో ఇలాంటి వీడియో గేమ్ లు, వాటి డవలపర్స్ చుట్టూ తిరిగే హారర్ తో మిక్సైన థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి. మనకు మాత్రం చాలా అరుదు. ఆ విధంగా ఈ సినిమా గేమ్ ఛేంజర్. కొత్త ఎక్కడ ఉన్నా ఆహ్వానం పలకాల్సిందే. అలాగే సినిమా చూస్తున్నంతసేపు మన థాట్ ప్రాసెస్ ని ఆపగలిగేదే ఫెరఫెక్ట్ ఫిల్మ్. ఆ పనిని చాలా వరకూ ఈ సినిమా చెయ్యగలిగింది.
వాస్తవానికి ఇది పూర్తిగా డైరక్టర్ ఫిల్మ్. ఎక్కడ ఏ ఎమోషన్ రైజ్ అవ్వాలో దర్శకుడు ప్లాన్ చేసుకుని, అందుకు తగ్గట్లుగా సీన్స్ డిజైన్ చేసుకుంటూ , ఓవరాల్ కథ చెడకుండా కథనం అల్లాల్సిన కత్తి మీద సాము లాంటి ప్రయత్నం. ఎందుకంటే తాప్సీ తప్పిస్తే అక్కడ చూడటానికి ఎవరూ ఉండరు. ఆమెను ఎంతసేపు అని కంటిన్యూగా చూడగలం. అయితే అలా చూడగలిగేలా చేయగలిగాడు దర్శకుడు. అయితే అంత ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ మాత్రం కాదు.
అయితే దర్శకుడుని ఓ విషయంలో మాత్రం మెచ్చుకోవాలి. ఏదో టైటిల్ గేమ్ ఓవర్ అని పెట్టాం కదా టైటిల్ జస్టిఫికేషన్ కోసం అని హీరోయిన్ గేమ్ డిజైనర్ అని ఏదో ఒక సీన్ లో చూపెట్టడం కాకుండా... గేమింగ్ అంశాలని స్క్రిప్టులో తెలివిగా కలుపుకుంటూ వచ్చాడు. నేరేషన్ లో ఓ భాగం చేసారు. అలాగే పోస్టర్, ట్రైలర్ లో ఓ మూడ్ ని ఎలా క్రియేట్ చేసుకుంటూ వచ్చారో..సినిమాలోనూ అదే తరహా మూడ్ ని ఎలివేట్ చేసుకుంటూ వెళ్లాడు.
థ్రిల్లర్స్ ఎప్పుడూ మన ఊహకు అందుతున్నట్లే ఉండి ఊహించని చోట దెబ్బకొట్టేవే నచ్చుతూంటాయి. అలాగే ఈ గేమ్ ఓవర్ కూడా ఏముంది మామూలే కదా... ఆ విలన్ ..హీరోయిన్ ని చంపటానికి వస్తాడు. ఆమె తప్పించుకుంటుంది అనే పద్దతిలో నడిస్తూ , అప్పడప్పుడూ ఝలక్ ఇస్తూ జై కొట్టించుకుంటుంది. కాకపోతే ఆ అప్పుడప్పుడూ కోసం వెయిట్ చేయటం పెద్ద గేమ్. ఈ రకంగా డైరక్టర్ చూసేవాడితో గేమ్ ఆడుతున్నాడు అనిపిస్తుంది.
ఇక తాప్సీ విషయానికి వస్తే... భయపడటం, నిరాశ ఆవహించటం అనే రెండు ఎమోషన్స్ ని ఫెరఫెక్ట్ గా పలికించింది. వేరే వేరియేషన్స్ కు స్క్రిప్టు అవకాసం ఇవ్వలేదు. అలాగే దాదాపు ప్రతీ ఫ్రేమ్ లోనూ తాప్సీనే కనపడే ఈ సినిమా ఎంతో స్క్రిప్టు బలం ఉంటే తప్ప భరించటం కష్టం. దానికి తోడు రిపీట్ అయ్యే సీన్స్. ఆ విషయం ముందే గమనించినట్లున్నారు దర్శకుడు, రచయిత. స్క్రీన్ ప్లేతో సినిమాని నడపటానికి ప్రయత్నించారు. అయితే ఫస్టాఫ్ ని కేవలం సెటప్ కే వాడుకుని, సెకండాఫ్ లోనే అసలు సీన్ లోకి వచ్చారు. అయితే సెకండాఫ్ ని నస పెట్టకుండా రేసీ గా పరుగెత్తించాడు. సైక్లాజికల్, పారా నార్మల్ రెండు లేయిర్స్ ని ఫెరఫెక్ట్ గా సింక్ చేసుకుంటూ వచ్చాడు.
టెక్నికల్ గా ..
ఇలాంటి థ్రిలర్స్ సినిమాలకు టెక్నికల్ బ్రిలియన్సీ అవసరం. ఆ విషయంలో ఈ సినిమా ఏ మాత్రం లోటు చెయ్యదు. వసంత్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రాణం పోసి నిలబెట్టింది. రోన్ ఏతాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కాస్త లౌడ్ గానే ఉంది. దర్శకుడుగా అశ్విన్ శరవణన్ కష్టం కనిపిస్తుంది కానీ ఇంత కష్టపడి చేసే థ్రిల్లర్స్ ఓ వర్గానికే పరిమితం అవ్వటం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎడిటింగ్ ఫస్టాఫ్ కాస్త సాగినట్లు అనిపించినా,సెకండాఫ్ స్టఫ్ కు తగినట్లు షార్ప్ గా ఉంది.
ఫైనల్ థాట్..
మల్టిఫ్లెక్స్ మనుష్యులకు నచ్చే గేమ్
Rating:3/5
ఎవరెవరు..
తారాగణం : తాప్సీ, వినోదిని వైద్యనాథన్, అనీష్ కురివిల్లా తదితరులు
సంగీతం: రోన్ ఏతాన్ యోహాన్ ,
ఎడిటర్: రిచర్డ్ కెవిన్,
రచన: అశ్విన్ శరవణన్,కావ్య రాంకుమార్,
మాటలు: వెంకట్ కాచర్ల,
ఛాయా గ్రహణం: ఎ.వసంత్,
ఆర్ట్: శివశంకర్ ,
కాస్ట్యూమ్ డిజైనర్: ఎన్.కె.నందిని,
పోరాటాలు: 'రియల్' సతీష్,
సౌండ్ డిజైనర్: సచిన్ సుధాకరన్, హరిహరన్ (సింక్ సినిమా),
స్టిల్స్: ఎమ్.ఎస్.ఆనందం,
పబ్లిసిటీ డిజైనర్: గోపి ప్రసన్న, వై నాట్ స్టూడియోస్ టీమ్
కంటెంట్ హెడ్: సుమన్ కుమార్,
డిస్ట్రిబ్యూషన్ హెడ్: కిషోర్ తాళ్లూరు,
బిజినెస్ ఆపరేషన్స్: ప్రణవ్ రాజ్ కుమార్,
సహ నిర్మాత: చక్రవర్తి రామచంద్ర,
నిర్మాత: ఎస్.శశికాంత్,
దర్శకత్వం: అశ్విన్ శరవణన్.