కామెడీ సినిమాలు చేస్తూ నవ్విస్తూ ఈ తరం ఇవివి గా సెటిలైన అనీల్ రావిపూడి నుంచి ఓ సినిమా వస్తోందంటే ఇంట్రస్ట్ ఉంటుంది. అందులోనూ ఆయన స్క్రీన్‌ప్లే సమకూర్చడం...ప్రొడక్షన్ లో పార్టనర్ కావడం... దర్శకత్వ పర్యవేక్షణ చేయడంతో కథ ఎంతో బాగుంటే తప్ప ..ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడు అనే ప్రశ్న ఉదయిస్తుంది. దానికి తోడు ట్రైలర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ క్రమంలో విడుదలైన ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది. నవ్వించిందా..ఏడిపించిందా..అసలు ఈ చిత్రం కథేంటి..సినిమాపై ఉన్న ఎక్సపెక్టేషన్స్ ని ఏ మేరకు రీచ్ అయ్యిందో చూద్దాం..
కథ
నాటకాలంటే పిచ్చి ఉన్న గాలి సంపత్ (రాజేంద్ర ప్రసాద్) కు కావాల్సిన నటన ఉంది కానీ, గాత్రం మాత్రం లేదు. రేడియో ఆర్టిస్ట్ అయిన ఆయన ఓ యాక్సిడెంట్ లో భార్యని, వాయిస్ ని కోల్పోతాడు. అయితే తనలోని ధైర్యాన్ని ,నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోడు. మాట్లాడితే నోటిలో నుంచి ‘ఫీ ఫీ ఫీ’ అని గాలి వచ్చినా ఆ ఫిఫీ లాంగ్వేజ్ తో అతను స్టేజిపై డైలాగులు చెప్తూంటాడు. ఆ డైలాగులకు..ఓ ట్రాన్సలేటర్ జనాలకు అర్దం అయ్యేలా చెప్తూంటాడు. సంపత్ కొడుకు సూరి (శ్రీవిష్ణు) ఓ డీసిఎం వ్యాన్ డ్రైవర్. అతని జీవితాశయం సొంతంగా డీసిఎం వ్యాన్ కొనుక్కోవటమే. ఆ వ్యాన్ ని కొనిపెట్టి కొడుకు కళ్లలో ఆనందం చూడాలని గాలి సంపత్ కోరిక. ఈలోగా నాటకాల పరిషత్తు పోటీ ప్రకటన వస్తుంది. ఫస్ట్ ప్రైజ్ ఎనిమిది లక్షలు. ఆ పోటీలో పాల్గొని కొడుక్కి ట్రక్ గిప్ట్ గా ఇద్దామనుకుంటాడు.
undefined
అయితే ముందుగా ఐదు లక్షలు అడ్వాన్స్ గా ఇస్తే..షో స్లాట్ ఇస్తానని నాటకకాల కాంట్రాక్టర్ చెప్తాడు. దాంతో తన కొడుకు వ్యాన్ కొనుక్కుందామని దాచుకున్న డబ్బులు దొంగతనం చేస్తాడు. అలాగే కొడుకు ప్రేమించిన అమ్మాయితో పెళ్లిని తను తెలియక చేసిన పనితో చెడకొడతాడు. కొడుకు జీవితంలో ఓ పెద్ద విలన్ గా కనపడతాడు. దాంతో తండ్రి,కొడుకు ఇద్దరు మధ్యా పెద్ద గొడవ జరిగి విడిపోతారు. ఈ క్రమంలో అనుకోకుండా గాలి సంపత్ తమ ఇంటి వెనుక ఉన్న ముప్పై అడుగుల నూతిలో పడిపోతాడు. మాట రాని గాలి సంపత్ ఆ నుయ్యి నుంచి ఎలా బయిటపడతాడు. తన తండ్రి గాలి సంపత్ కనపడకుండా పోయాక సూరి ఏం చేసాడు? ఆ తర్వాత తన తండ్రి స్నేహితుడి ద్వారా గాలి సంపత్ గురించి కొడుకు సూరి తెలుసుకున్న నిజాలేమిటి? చివరకు ఏమైంది? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
స్క్రీన్ ప్లే సంగతులు
కామెడీ,సెంటిమెంట్ కలిపికొట్టు..హిట్ కాకపోతే చెప్పిచ్చుకు కొట్టు అని మన సినిమా పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఆ విషయం చాలా సార్లు ప్రూవ్ అయ్యింది కూడా. ఈ సినిమాలో కూడా దాదాపు అలాంటి ఫార్మెట్ నే ఫాలో అయ్యారనే చెప్పాలి. అయితే కథ కొత్తది కాదు..ఇంతకు ముందు చాలా సార్లు చూసిన సీన్స్ తో రెడీ చేసిందే. ముఖ్యంగా తండ్రి,కొడుకుల సీన్స్,ఎమోషన్స్ చూస్తూంటే ఎప్పుడో పాతికేళ్ల నాటి సినిమా చూస్తున్నామా అనే డౌట్ వస్తుంది. రాజేంద్రప్రసాద్ పాత్ర, 30 అడుగుల నూతిలో పడటం అనేవి ఎంగేజింగ్ ఎలిమెంట్స్,కొత్తవి. అవి రెండు చాలు హిట్ కొట్టడానికి అనుకున్నట్లున్నారు. కానీ అవే సరిపోతాయా..ఓటీటిలతో పూర్తిగా మారిపోయిన ప్రేక్షకుడుకి.
అలాగే అనీల్ రావిపూడి తరహా కామెడీ అయితే ఈ సినిమాలో ఎక్సపెక్ట్ చేయటం అనవసరం. ఇది ఎమోషన్స్ తో సాగే సినిమా. తండ్రి కొడుకు ల మధ్య వచ్చే భావోద్వేగాలే ప్రధానం. రాజేంద్రప్రసాద్ లాంటి కామెడీ పండించగల సమర్దుడు ఉన్నా..ఆయనలో నటుడుకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు.
ఫస్టాఫ్ లో ఫన్ కు ప్రయారిటీ ఇచ్చినా ..సెకండాఫ్ లో మాత్రం పూర్తిగా ఆ నలుగురు సినిమా టైపే.తండ్రిని చాలా మంది పిల్లలు సరిగ్గా అర్దం చేసుకోరు. ఆయన తన కుటుంబానికి ఎంత చేస్తున్నాడనేది తెలుసుకోలేరు. తమకేం చేయలేదని ఎప్పుడూ వాపోతూంటారు. అలాంటివాళ్లకు ఈ సినిమా కనువిప్పు కలిగించేలా చేసారు. ఈ సినిమా క్లైమాక్స్ లో శ్రీ విష్ణు చెప్పిన.. ‘ఒక వయసు దాటాక తల్లిదండ్రులే బిడ్డలు అవుతారు.. మా నాన్న నాకు బిడ్డ.. ఆ బిడ్డను వెతుక్కోనివ్వండి సార్’.. డైలాగుకు అందుకే మనం కనెక్ట్ అవుతాము.
కాకపోతే స్క్రీన్ ప్లే ఇంకాస్త టైట్ గా ఉండాల్సింది.అలాగే ఎమోషన్స్ కూడా ఇంకాస్త బలంగా ఉండాల్సింది. ఇలాంటి కథల్లో గాఢత తక్కువైతే తేలిపోతుంది. అలాగే ఓ మాటలు రాని మనిషి..నూతిలో పడిపోతే అనే పాయింట్ వరకూ కొత్తగా అనిపిస్తుంది కానీ ...మిగాతా సీన్స్, తండ్రి,కొడుకు మధ్య వచ్చే ఎమోషన్స్ ఇంతకు ముందు చాలా సినిమాల్లో రకరకాలుగా చూసేసినవే. దాంతో స్క్రీన్ ప్లే చాలా ప్రెడిక్టుబుల్ గా అనిపిస్తుంది. అలాగే సినిమాకు ప్లస్ కావాల్సిన ప్లాష్ బ్యాక్ సీన్స్ కూడా కథలో ఆ విషయం రివీల్ చేయాలి కాబట్టి చేస్తున్నాము అన్నట్లున్నాయి.
దర్శకత్వం మిగతా విభాగాలు...
ఈ సినిమా దర్శకుడు పూర్తిగా అనీల్ రావిపూడిని అనుసరించినట్లు అనిపిస్తుంది. కాకపోతే సినిమా నీటు గా ఉంది. ఎక్కడా అతి చెయ్యలేదు. స్క్రీన్ ప్లే, సీన్స్ ఈ కాలానికి తగినట్లు రాసుకోవాల్సింది. ఎమోషన్స్ ఎప్పుడైనా ఒకటే కానీ కాలానికి తగినట్లు కొత్తరూపు సంతరించుకుంటాయి. వాటిని ఈ సినిమా ప్రతిబింబించలేకపోయింది. ఇక ఈ సినిమాకు ప్లస్ మిర్చి కిరణ్ డైలాగ్స్.ముఖ్యంగా సత్య పేల్చి వన్ లైనర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్సైంది. అరకు అందాలు అద్బుతంగా చూపించారు.అలాగే అచ్చు రాజమణి మ్యూజిక్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. బావి సెట్ విషయంలో ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ వర్క్ కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తమ్మిరాజు ఎడిటింగ్ సెకండాఫ్ లో దారి తప్పింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. గ్రాఫిక్స్ వర్క్ క్వాలిటీగా ఉన్నాయి.
నటీనటుల్లో ... రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో తన విశ్వరూపం చూపించారు. అయితే డైరక్టర్ దృష్టి మొత్తం ఆయనపైనే పెట్టినట్లున్నారు మిగతా కమెడియన్స్‌ను సరిగ్గా వాడుకోలేకపోయారు. అలాగే శ్రీకాంత్ అయ్యంగార్ కామెడీ సీన్లు చిరాకు తెప్పిస్తాయి. శ్రీనివాస్‌రెడ్డి మూఢభక్తి సీన్స్ బాగా పేలాయి. హీరోగా శ్రీవిష్ణు కూడా కొడుకు పాత్రలో రాజేంద్రప్రసాద్ కు పోటీ ఇచ్చారు. హీరోయిన్ గా లవ్లీ సింగ్ జస్ట్ ఓకే.
ఫైనల్ ధాట్...
తొంభైల నాటి సినిమాలు..టీవీల్లో వస్తున్నాయి కదా,పనిగట్టుకుని తీయటమెందుకు?
Rating: 2.5
---సూర్య ప్రకాష్ జోశ్యుల
ఎవరెవరు..
బ్యానర్: ఇమేజ్‌స్పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, షైన్ స్క్రీన్స్;
నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు, లవ్లీ సింగ్, తనికెళ్ల భరణి, సత్య, రఘుబాబు తదితరులు
సంగీతం: అచ్చు;
సినిమాటోగ్రఫీ; సాయి శ్రీరామ్,
ఎడిటింగ్; బి.తమ్మిరాజు,
నిర్మాత: ఎస్.కృష్ణ, హరీశ్ పెద్ది, సాహు, గారపాటి;
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం పర్యవేక్షణ: అనిల్ రావిపూడి;
కథ, దర్శకత్వం: అనీశ్ కృష్ణ;
విడుదల 11-03-2021