సామాజిక అంశాలను కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపి కథ చెప్పటం అనేది కత్తి మీద సామే. ఏ మాత్రం తేడా వచ్చినా అటు మేధావులను, ఇటు సామాన్య ప్రేక్షకులను అలరింప చేయలేక చతికిలపడుతుంది.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి. విజయ్ రాజకీయ ఎంట్రీ అంటూ వార్తలు కూడా గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ రెండు పాయింట్స్ ని దగ్గర పెట్టుకుని ఓ కథ రెడీ చేస్తే ...అనే ఆలోచన మురగదాస్ వచ్చినట్లుంది. దాంట్లో ఓటేయండి సార్ అనే ఓ సామాజిక అంశం లాంటి ఎలిమెంట్ ని కూడా కలిపేసి, ఎప్పటలా తన మాస్ మసాలా కలిపేస్తే ...కేక కదా అనిపించి ఉంటుంది.
undefined
మరో ప్రక్క విజయ్ కూడా ప్రస్తుతం సమాజంలో జరిగే కరెంట్ టాపిక్స్ ని ఇముడ్చుతూ చెప్పే కథలనే ఇష్టపడుతున్నారు. ఆయన జెండా ,ఎజెండా మనకు తెలియదు. దాంతో వీరిద్దరూ ముచ్చటగా మూడోసారి కలిసి సినిమా చేసారు. అంతవరకూ బాగానే ఉంది. మరి ఎలక్షన్స్ నేపధ్యంలో చెప్పిన ఈ కథ ఇంట్రస్టింగ్ గా ఉంటుందా....తమిళ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని సినిమా చేస్తే ..మనవాళ్లకు ఎక్కుతుందా...అసలు కథేంటి..విజయ్ ఈ సినిమాతో అయినా తెలుగులో స్దిరపడతాడా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి
ఎన్నారై సుందర్ రామస్వామి (విజయ్) అమెరికన్ బేసెడ్ GL గ్రూప్ కు సీఈఓ. తన కెరీర్ లో అపజయం అంటూ ఎరగక..కార్పోరేట్ ప్రపంచాన్ని ఏలుతున్న సుందర్...ఎలక్షన్స్ లో తన ఓటు హక్కుని వినియోగించుకోవటానికి ఇండియా వస్తాడు. అయితే అదృష్టమో,దురదృష్టమో ..ఈ దేశంలో చాలా మందికి జరిగినట్లుగానే అతని ఓటు హక్కుని వేరే వాళ్లు వినియోగించేసుకుంటారు..అంటే దొంగ ఓటు వేసేస్తారు. దాంతో సుందర్ కు ఏం చేయాలో తోచదు..కోపం వస్తుంది. మరో ప్రక్క జనం...మీడియా ఈ కార్పోరేట్ హెడ్ ఇప్పుడేం చేస్తాడో అని అంతా ఎదురుచూస్తారు. ఈ క్రమంలో సుందర్ ..చట్టబద్దంగా పోరాడదామనుకుంటాడు. ఇండియాలో టాప్ లాయిర్ ని పెట్టుకుని లీగల్ ప్రొసీడింగ్స్ మొదలెడతాడు. ఎలక్షన్ లా Section 49-P ని గుర్తు చేస్తూ...ఎలక్షన్ రిజల్ట్ ప్రకటించకుండా ఈసీని ఆపుచేయగలుగుతాడు.
దాంతో ఎలక్షన్ లో గెలుస్తామనుకున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావాలనుకున్న వ్యక్తి(పాల కరుపయ్య)కుకాలుతుంది. అతను డైరక్ట్ గా సుందర్ ని ఛాలెంజ్ చేస్తాడు. ఇదంతా వివరిస్తూ.. సుందర్ ఓ ప్రెస్ మీట్ పెట్టడంతో..మూడు లక్షలకు పైగా లీగల్ కేసులు పడతాయి..తమ ఓట్లు వేరే వారు వేసేసారని. జనాల్లో చైతన్యం వస్తుంది. మరో ప్రక్క ఆ మాజీ ముఖ్యమంత్రి తన కూతురు పాప (వరలక్ష్మీ శరత్ కుమార్) సలహాతో ...సుందర్ ని లేపేసే ప్రయత్నం చేస్తాడు.
ఈ లోగా అంతమంది కేసులు వేసారు కాబట్టి ఎలక్షన్స్ రద్దు చేసి, తిరిగి ఎలక్షన్స్ జరపమని ఎలక్షన్ కమీషన్ ఎమర్జన్సీ ఆర్డర్ పాస్ చేస్తుంది. అప్పుడు సుందర్ తన నియోజక వర్గం నుంచి సిఎం అభ్యర్దిపై పోటీకు దిగుతాడు. అంతటితో ఆగకుండా తన మనుష్యులను మిగతా స్దానాల్లో నిలబెట్టి గెలిపిస్తానని ఛాలెంజ్ చేస్తాడు. పొలిటికల్ క్యాంపైన్ మొదలవుతుంది. సుందర్ కు సపోర్ట్ గా ...మొదటి నుంచి ఎలక్షన్ ఏజెంట్ గా పరిచయమైన లీలా( కీర్తి సురేష్) ఉంటుంది.
ఈ క్రమంలో ముఖ్యమంత్రి కుమార్తె (వరలక్ష్మీ శరత్ కుమార్) డైరక్ట్ గా సుందర్ తో పొలిటికల్ వార్ లోకి దిగుతుంది. ఇంతకీ సుందర్ తన ఛాలెంజ్ లో గెలుస్తాడా...ఏం చేసి తన అభ్యర్దులను గెలిపించుకుంటాడు..చివరకి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఓటు వేయండి సార్..
ఓటు వేయటం పౌరుడుగా మన భాధ్యత, మన కర్తవ్యం అంటూ ఎవరైనా చెప్తే వాళ్ల వంక వింతగా చూస్తాం. ఆ మాత్రం మాకు తెలియదా అంటూ.. అయితే మురగదాస్ మాత్రం.. మీరు ఎలా చూసినా సరే నా సినిమా చూసి ఓటు విలువ తెలుసుకోవాలి అని డిసైడ్ అయ్యినట్లున్నారు. దొంగ ఓటు పాయింట్ తో కథ మొదలెట్టి..ఓటు గొప్పతనం కథను ముగించాడు. అయితే ఆ దొంగ ఓటు వేసే వాళ్లను క్షమించి వదిలేయాలి, అంతగా వాడు మనతో తిరుగుతానంటే వాళ్లను కూడా తిప్పుకోవాలి అనే సందేశం సైతం ఇచ్చాడు.
సామాజిక అంశాలకి కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపి కథ చెప్పటం అనేది 'కత్తి' మీద సామే. ఏ మాత్రం తేడా వచ్చినా అటు మేధావులను, ఇటు సామాన్య ప్రేక్షకులను అలరింప చేయలేక చతికిలపడుతుంది. అయితే తమిళ దర్శకుడు శంకర్ ఆ తరహా సినిమాలు చేయటంలో పండిపోయారు. ఆ దారిలోనే ప్రయాణం పెట్టుకున్న మురుగదాస్ కూడా సక్సెస్ అయ్యారు. అయితే శంకర్ రేంజిలో సక్సెస్ కాలేదన్నది నిజం. ఇప్పుడీ సినిమా మాత్రం సందేశం, కమర్షియాలిటీ కలవలేదు. రెండు వేరు వేరు తానుల్లో ముక్కల్లా విడిపోయాయి.
ఎలా ఉంది
ఖచ్చితంగా మురగదాస్, విజయ్ కాంబినేషన్ లో వచ్చిన తుపాకి, కత్తి సినిమాల స్దాయిలో అయితే లేదు. అలాగే ఫస్టాఫ్ లో ఉన్నంత విషయం సెకండాఫ్ కు వచ్చేసరికి మిస్సైంది. ఫస్టాఫ్ లో తన ఓటు మిస్ అవటంతో సమస్యలోకి ప్రవేశించి ఇంటర్వెల్ లో ఫెరఫెక్ట్ గా సమస్యను స్దాపించిన మురగదాస్ అక్కడవరకూ సక్సెస్ అయ్యారు.
సెకండాఫ్ లో ఆ సమస్య పై పోరాటం సరిగ్గా లేదు. పొలిటికల్ సీన్స్ రిపీట్ గా రొటీన్ గా ఉన్నాయి. అలాగే కథ ఎక్కడికీ జరుగుతన్నట్లుగా కాకుండా అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపించింది. విలన్ కు, విజయ్ కు మధ్య వచ్చే ఛాలెంజ్ లలో ఉన్నంత విషయం...ఆ ఛాలెంజ్ ని ఎలా డీల్ చేస్తాడు అన్న విషయంలో లోపించింది. క్లైమక్స్ మరీ సినిమాటెక్ గా ఉంది. అలాగే విలన్స్ హీరో ముందు తేలిపోయారు. దాంతో హీరో అనుకున్నది..చెప్పినట్లే జరుగుతూ సెకండాఫ్ బోర్ కొట్టడం మొదలవుతుంది.
అలాగే తమిళనాడు రాజకీయాలను బేస్ చేసుకుని ఎక్కువ సీన్స్ రిఫెరెన్స్ గా ఉన్నాయి. తెలుగు వాతావరణం మిస్తైంది. దాంతో ఈ చిత్రం తెలుగువారికి ఏ స్దాయిలో కనెక్ట్ అవుతున్నది చెప్పలేం.
విజయ్ మాత్రం వన్ మ్యాన్ షో అన్నట్లుగా తన భుజంపైనే సినిమా మొత్తం మోసాడు. తమిళనాట ఈ హీరోకు ఉన్న మాస్ ఫాలోయింగ్ కు ఈ సినిమా బాగుందనిపిస్తుంది. కానీ తెలుగులో ఇప్పుడిప్పుడే ఆయన అభిమానగణం ఏర్పడుతున్నారు. కీర్తి సురేష్ మాత్రం ఎందుకో గ్లామర్ కోల్పోయినట్లు అనపించింది. వరలక్ష్మీ శరత్ కుమార్ ..బిగతీసుకుని మాట్లాడటం తప్ప విలనీ ఏమీ పండించలేకపోయింది.
టెక్నికల్ గా
మురగదాస్ వంటి స్టార్ డైరక్టర్ సినిమాలలో టెక్నికల్ వ్యాల్యూస్ ఎప్పుడూ ఉన్నతంగా ఉంటాయి. కాబట్టి ఆ విభాగాలు గురించి మాట్లాడక్కర్లేదు. అయితే కథ,కథనం విషయంలోనే మరింత శ్రద్ద పెడితే..డబ్బింగ్ సినిమాల్లో కథను చూసే మన తెలుగువాళ్లకు బాగుండును అనిపిస్తుంది.
ఫైనల్ ధాట్
ఓటు వేద్దామని ఎలక్షన్ బూతుకు వెళ్లేసరికి మన ఓటు వేరే వారు వేసేస్తే ఏంటి పరిస్దితి అన్న సింగిల్ లైన్ చుట్టూ అల్లిన ఈ కథ ...ట్రీట్మెంట్ పరంగా వీక్ అనే చెప్పాలి. అయితే మాస్ హీరోకు ఈ మాత్రం చాలు అని మురగదాస్ భావించిఉండవచ్చు. అది తమిళందాకా ఓకే. మరి తెలుగుకు ..? విజయ్ ఇంకా మామూలు హీరోనే కదా.. అయినా విజయ్ అక్కడ రాజకీయాల్లోకి వస్తాడు అనే టాక్ ఉంది. ఆ పాయింట్ మీద అక్కడ జనాలకు కనెక్ట్ అవుతారు. మరి మన పరిస్దితి ఏమిటి..?
రేటింగ్: 2/5
ఎవరెవరు..
నిర్మాణ సంస్థ: సన్ పిక్చర్స్
తారాగణం: విజయ్, కీర్తిసురేశ్, వరలక్ష్మి శరత్‌కుమార్, యోగిబాబు, రాధారవి తదితరులు
మాటలు: శ్రీరామకృష్ణ
పాటలు: చంద్రబోస్, వనమాలి
సంగీతం: ఎ.ఆర్.రెహమాన్
ఛాయాగ్రహణం: గిరీశ్ గంగాధరన్
కూర్పు: శ్రీకర్ ప్రసాద్
నిర్మాత: కళానిధి మారన్
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్.మురగదాస్
తెలుగు విడుదల: అశోక్ వల్లభనేని