Sai Paranjpye: ప్రముఖ దర్శకులు, రచయిత, స్క్రీన్ రైటర్ అయిన సాయి పరాంజపే ప్రతిష్ఠాత్మక పద్మపాణి జీవిత సాఫల్య పురస్కారం అందుకోనున్నారు. 10వ అజంతా-ఎల్లోరా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ప్రారంభోత్సవంలో ఆమెను ఈ పురస్కారంతో సన్మానించనున్నారు.
10th Ajanta-Ellora International Film Festival: 10వ అజంతా-ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (ఎఐఎఫ్ఎఫ్ 2025) 2025 జనవరి 15 నుండి 19 వరకు ఛత్రపతి శంభాజీనగర్ లో జరగనుంది. ఈ ఏడాది, ఫెస్టివల్ అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారమైన "పద్మపాణి లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డు"ను భారతీయ సినిమాకు ఎంతో కృషి చేసిన ప్రముఖ దర్శకురాలు, స్క్రీన్‌వ్రైటర్, నిర్మాత, నటులైన సాయి పరంజపేకు ఇవ్వనున్నారు. రాబోయే అజంతా-ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆమెను ఈ పురస్కారంతో గౌరవించనున్నారు. ఈ మేరకు AIFF నిర్వహణ సమితి ఛైర్మన్ నందకిషోర్ కాగ్లీవాల్, చీఫ్ మెంటర్ అంకుశ్రావో కాదమ్, AIFF ఆహ్వాన చైర్మన్, దర్శకుడు అశుతోష్ గోవారికర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ పద్మపాణి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ ను 2025 జనవరి 15 వ తేదీన సాయంత్రం 6.00 గంటలకు రుక్మిణి ఆడిటోరియం, ఎమ్.జి.ఎం. యూనివర్సిటీ క్యాంపస్, చత్రపతి సంభాజీనగర్ లో ప్రారంభోత్సవం సందర్భంగా సాయి పరంజపేకు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో దేశవిదేశాలకు చెందిన చాలా మంది కళాకారులు, ప్రముఖ వ్యక్తులు హాజరుకానున్నారు.
undefined
సాయి పరంజపే నాలుగున్నర దశాబ్దాలుగా భారతీయ సినిమాకు సేవలు అందిస్తున్నారు. ఆమె ప్రభావవంతమైన హిందీ సినిమాలు భారతీయ సినిమాకు ఒక ప్రత్యేకతను అందించాయి. ఆమె సినిమాలు మానవ సంబంధాలపై లోతైన భావోద్వేగం, మేధోపరిశీలనను అందిస్తాయి. ఆమెకు గుర్తింపు తీసుకువచ్చిన సినిమాల్లో "స్పర్ష్" (1980), "చశ్మే బుద్దూర్" (1981), "కథా" (1983), "దిశ" (1990), "చూడియాన్" (1993), "సాజ్" (1997) వంటి సినిమాలు ఉన్నాయి. సినిమా దర్శకత్వంతో పాటు, పరంజపే అనేక ప్రముఖ నాటకాలు, పిల్లల నాటకాలకు కూడా దర్శకత్వం వహించారు. ఆమె మరాఠి సాహిత్యంలో ముఖ్యంగా పిల్లల సాహిత్యంలో గణనీయమైన కృషి చేశారు.
ఆమె అద్భుతమైన కృషిని గుర్తించి, 2006 లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మభూషణ్ పురస్కారం అందజేసింది. ఆమెను ఫిల్మ్‌ఫేర్ అవార్డు, మహారాష్ట్ర ఫౌండేషన్ అవార్డు వంటి ఎన్నో సత్కారాలు అందుకున్నారు. అంతేకాకుండా, సాయి పరంజపే భారతీయ పిల్లల సినిమా సంస్థ (CFSI) చైర్మన్‌గా రెండు పర్యాయాలు పనిచేశారు. సాయి పరంజ్‌పే తాత RP పరంజపే ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు, విద్యావేత్త. ఆమె తల్లి శకుంతల పరంజపే 1930-40 లలో హిందీ, మరాఠీ చిత్రాలలో నటించారు. ఆమె రాజ్యసభ సభ్యురాలు (1964-1970)గా కూడా సేవలు అందించారు. 1991లో ఆమె సామాజిక సేవకు గాను పద్మభూషణ్‌ను అందుకుంది.
సాయి పరంజపే తన ఎనిమిదేళ్ల వయసులో మరాఠీలో అద్భుత కథల సేకరణతో తన రచనా జీవితాన్ని ప్రారంభించారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD) నుండి గ్రాడ్యుయేట్ అయిన సాయి పరంజపే ఆల్ ఇండియా రేడియోలో పనిచేశారు. పిల్లల పుస్తకాలతో పాటు పెద్దలు, చిన్నారుల కోసం హిందీ, మరాఠీ, ఆంగ్ల భాషలలో అనేక నాటకాలు రాసి వాటికి దర్శకత్వం వహించారు. ఆమె మొదటి టీవీ షో ది లిటిల్ టీ షాప్ (1972) టెహ్రాన్‌లో ఆసియన్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్ అవార్డును గెలుచుకుంది. ఆ సంవత్సరం తరువాత ఆమె బొంబాయి దూరదర్శన్ ప్రారంభ కార్యక్రమాన్ని నిర్మించడానికి ఎంపికైంది. 1970వ దశకంలో ఆమె చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా (CFSI)కి రెండుసార్లు చైర్‌పర్సన్‌గా పనిచేసింది. CFSI కోసం నాలుగు బాలల చిత్రాలను చేసింది. ఇందులో అవార్డు గెలుచుకున్న జాదూ కా శంఖ్ (1974), సికందర్ (1976) ఉన్నాయి.